పెద్ద విగ్రహాలను భద్రపరుచుకోవడానికి ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:48 PM
ప్రత్యేక ప్రదేశాల్లో భారీ వినాయక విగ్రహాలను భద్రపరుచుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
వచ్చే వినాయక చవితిలో మళ్లీ వినియోగించుకోవాలి
నీటి కొరత నేపథ్యంలో భక్తులు సహకరించాలి
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ప్రదేశాల్లో భారీ వినాయక విగ్రహాలను భద్రపరుచుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. సుంకేసుల రోడ్డులో రైల్వే ట్రాక్ పక్కన, ఎంఆర్‌సీ ఫంక్షన్ హాల్ పక్కన, వెంకటరమణ కాలనీలో టూరిస్ట్ హోటల్ వెనుక ఉన్న ఖాళీ మైదానాలు, ఎ.క్యాంపు, జొహరాపురం ప్రాంతాల్లో పలు మైదానాలను ఆదివారం ఆయన పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో తగ్గిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం నగర ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపడా నీటిని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిమజ్జన కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో నీటిని వినియోగించడం సాధ్యం కాదన్నారు. దీనివల్ల గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు గరిష్ఠంగా 1 నుంచి 1.5 అడుగుల పరిమాణంలో ఉండే చిన్న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చిన్న విగ్రహాలను బకెట్లు, టబ్బుల్లో నిమజ్జనం చేసుకునేలా ఎంపిక చేసుకోవాలన్నారు. కొత్తగా పెద్ద విగ్రహాలకు ఆర్డర్లు ఇవ్వొద్దని, ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన వారు వాటిని రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పెద్ద విగ్రహాలు తయారై వచ్చిన వారు వాటిని నిమజ్జనం చేయకుండా భద్రపరిచి వచ్చే ఏడాది వినాయక చవితి వేడుకల్లో వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. ఇందు కోసం నగరంలో ఐదు మైదానాలను గుర్తించి, పెద్ద విగ్రహాలను భద్రపరుచుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి సూచనలు, నిర్ణయాలకు అనుగుణంగా తాగునీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం నీటి పరిస్థితులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని, భక్తిని కొనసాగిస్తూ నీటిని పొదుపు చేసే విధంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఈ జె.రమణమూర్తి, మాజీ కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.