పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:17 PM
స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లును పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై కలెక్టర్ డా.ఏ. సిరి
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లును పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ సిల్వర్ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లు, రిసెప్షన్ కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ సిల్వర్ జుబ్లీ కళాశాలలో కర్నూలు రూరల్, గూడూరు, ఓర్వకల్లు, క్రిష్ణగిరి మండలాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లు, రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో కోడుమూరు, సి. బెళగల్, కల్లూరు, వెల్దుర్తి మండలాలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ రెండు కళాశాలల్లో ఎన్నికల సామగ్రి భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్ ప్రాంతాల కోసం కేటాయించిన హాళ్లు, గదులను పరిశీలించి, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తుల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియకు సంబంధించి జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు, కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల ఏజెంట్లకు ప్రత్యేక ప్రవేశమార్గాలు ఏర్పాటు చేసి, చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఆర్. సుధాకర్‌రెడ్డి, కర్నూలు ఆర్‌డీఓ సందీ్‌పకుమార్, తహసీల్దార్లు వెంకటరమే్‌షబాబు, ఆంజనేయులు పాల్గొన్నారు.