గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:25 AM
కర్నూలు నగరంలో నీటి కష్టాలు ఉన్నప్పటికీ గణేశ్ నిమజ్జనోత్సవానికి ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు కల్చరల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : కర్నూలు నగరంలో నీటి కష్టాలు ఉన్నప్పటికీ గణేశ్ నిమజ్జనోత్సవానికి ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం కర్నూలు పాతనగరంలోని రాంభొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహ మంటపం వద్ద గణనాథున్ని మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ కర్నూలు నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. వర్షాలతు సమృద్ధిగా కురవాలని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేసీ కెనాల్‌లో రెండు వైపులా గోడలు నిర్మించి, ట్యాంక్ తరహాలో నీటిని నిలువ చేసి గణేశ్ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే నన్నూరు టోల్‌ప్లాజా వద్ద హంద్రీనీవాలో కూడా వినాయక ప్రతిమల నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు తమకు ఇష్టమైన ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాంభొట్ల గణేశ్ మంటప ప్రతినిధులు మంత్రిని ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి టీజీ భరత్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ నవరాత్రి ఉత్సవ మంటపాలను సందర్శించి, అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.