సంతృప్తికర దర్శనానికి ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:49 PM
శ్రీశైల మహా క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి నిత్యం వచ్చే భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనాలు, ఆర్జితసేవలు సంతృప్తికరంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు వెల్లడించారు.
సామాన్య భక్తులకు నూతన డార్మిటరీలు
క్షేత్రంలోని ప్రధాన కూడళ్లలో శాశ్వత శౌచాలయాలు
ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు
శ్రీశైలం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి నిత్యం వచ్చే భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనాలు, ఆర్జితసేవలు సంతృప్తికరంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు వెల్లడించారు. మంగళవారం 6వ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని ఈవో శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించగా చైర్మన్ సహా ఇద్దరు సభ్యులు వర్చువల్‌గా వీడియో కాన్ఫ్‌రెన్స్ ద్వారా హాజరుకాగా మిగతా సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతో 22 అంశాల అజెండాపై చర్చించిన తరువాత 15 అంశాలను ఆమోదించి, 5 అంశాలను వాయిదా వేసి మరో 2 అంశాలను తిరస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు వసతులు కల్పించే క్రమంలో నూతన డార్మిటరీలు ఏర్పాటు చెయ్యడంతోపాటు ప్రస్తుతం ఉన్న వాటిలో ఆధునిక వసతులు కల్పిస్తూ మరమ్మతులు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకుం టున్నట్లు తెలిపారు. రానున్న ఆరు నెలల్లో ప్రధాన కూడళ్లలో సుమారు 20కిపైగా శాశ్వత శౌచాలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. అదే విధంగా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, గోశాలలో పచ్చి, ఎండు గడ్డి సరఫరా కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. భక్తులు వేచి ఉండే కంపార్టుమెంట్లు క్యూకాంప్లెక్ల్స్‌ల నిర్మాణాలను త్వరగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు సంతృప్తికర దర్శనాలు చేసుకునేం దుకు ప్రభుత్వం తీసుకుంటున్న సముచితమైన నిర్ణయాలను అమలు చేయడానికి ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సంయుక్తంగా కార్యాచరణ అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు పాల్గొన్నారు.