పర్యవేక్షక సిబ్బందిని ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:09 AM
రాష్ట్రంలోనే పంట ఉత్పత్తుల విక్రయాల్లో రైతులకు గిట్టుబాటు ధర అందించడంలో ముందువరుసలో ఉన్న కర్నూలు మార్కెట్ యార్డులో పర్యవేక్షక సిబ్బందిని నియమించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతుల విజ్ఞప్తి
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే పంట ఉత్పత్తుల విక్రయాల్లో రైతులకు గిట్టుబాటు ధర అందించడంలో ముందువరుసలో ఉన్న కర్నూలు మార్కెట్ యార్డులో పర్యవేక్షక సిబ్బందిని నియమించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు గురువారం వినతి పత్రాన్ని పంపారు. కర్నూలు మార్కెట్ యార్డులో ప్రతిరోజు రైతులు ఉల్లిగడ్డలు, వేరుశనగ, కందులు, మొక్కజొన్నలు, ఆముదాలు తదితర వాటిని అమ్మకానికి తీసుకువస్తున్నారు. పక్కరాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు అనంతపురం, కడప జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ప్రతిరోజు పంట ఉత్పత్తులను విక్రయానికి తరలిస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర అందుతుందనే నమ్మకంతో రైతులు ఇక్కడికే పంట ఉత్పత్తులను అమ్మకానికి తీసుకువస్తున్నారు. అయితే రెండు నెలలుగా పంట ఉత్పత్తుల తూకాల సమయంలో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వల్ల వ్యాపారుల హవా సాగుతోంది. గతంలో అసిస్టెంట్ సెక్రటరీలతో పాటు సూపర్‌వైజర్లు కూడా పంట ఉత్పత్తుల తూకం సమయంలో రైతులకు ధైర్యం చెప్పి అక్కడే నిఘా పెట్టేవారు. వ్యాపారుల నిర్వాకంతో తూకాల్లో తేడాలు వస్తున్నాయని ఉన్నతాధికారులు తూకాల సమయంలో సిబ్బంది, అధికారులు తమ వద్దే నిఘా వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు వినతి పత్రాన్ని పంపారు. తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.