సాయుధ పోరాట వీరుడు వడ్డె ఓబన్న
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:17 PM
స్వాతంత్య్ర సంగ్రామంలో సాయుధ పోరాట యోధుడు వడ్డె ఓబన్న చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కొనియాడారు.
జయంతి వేడుకల్లో కలెక్టర్ ఏ. సిరి
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సంగ్రామంలో సాయుధ పోరాట యోధుడు వడ్డె ఓబన్న చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో వడ్డె ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే స్థానిక బి క్యాంపులోని బీసీ భవన్‌లో వడ్డె ఓబన్న చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు డీబీసీడబ్లూవో ప్రసూన, వడ్డెర సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న సమయంలో రేనాటి పాలెగాళ్లకు, కంపెనీకి మధ్య కమార్జు భత్యాల విషయంలో మొదలైన ఘర్షణలు పోరాటాలుగా మారాయన్నారు. ఆ పోరాటంలో ముఖ్యమైనది నొస్పం పాలేగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటమని, ఈ విరోచిత పోరాటంలో సైన్యాధ్యక్షుడిగా వడ్డె ఓబన్న కీలక భూమిక పోషించారన్నారు. భయం అనేది ఎరుగకుండా వడ్డెరులు, బోయ లు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని ఓబన్న సమర్ధవంతంగా నడిపించారన్నారు. వడ్డెర కులస్థులు, యువత చదువుల్లో, ఉద్యోగాల్లో రాణించి సమాజ అభివృద్దికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుసేన్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మికాంతం, వడ్డెర రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రిక, సర్వేశ్వరరావు, జయ్‌పాల్ బాబు, జిల్లా అధ్యక్షుడు బండ్ల రవి, తిరుపాల్ బాబు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, వలసల రామకృష్ణ, కుర్ని సంఘం చైర్మన్ మునెప్ప, ఉప్పర సంఘం డైరెక్టర్ చంద్ర, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు.