ఆమోదమా..? తిరస్కారమా?
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:42 PM
ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘానికి 88 ఏళ్ల చరిత్ర ఉంది. గతేడాది దాదాపు రూ.22 లక్షలకు పైగా లాభాలు ఆర్జించింది.
ఎమ్మిగనూరు చేనేత సొసైటీ విక్రయ కేంద్రాల విలీనంపై ఉత్కంఠ
నేడు వైడబ్ల్యూసీఎస్ సర్వసభ్య సమావేశం
అడ్డుకుంటామంటున్న చేనేత కార్మిక సంఘాలు
సొసైటీ ఏడీ అప్పాజీ ఆకస్మిక బదిలీ
ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘానికి 88 ఏళ్ల చరిత్ర ఉంది. గతేడాది దాదాపు రూ.22 లక్షలకు పైగా లాభాలు ఆర్జించింది. లాభాల్లో ఉన్న ఈ సొసైటీ విక్రయ కేంద్రాలను ఆప్కోలో విలీనం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం జరిగే చేనేత సొసైటీ సర్వసభ్య సమావేశంలో విక్రయ కేంద్రాలు విలీనం అంశాన్ని అజెండాలో చేర్చారు. అప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆప్కోలో విలీనం చేయాలనే ప్రతిపాదన చేనేతల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. అయితే మంగళవారం జరిగే సర్వసభ్య సమావేశంలో వైడబ్ల్యూసీఎస్ విక్రయ కేంద్రాలు ఆప్కోలో విలీనం ప్రతిపాదనను ఆమోదిస్తారా..? తిరస్కరిస్తారా..? ఎమ్మిగనూరులో ఏ ఇద్దరు కలసినా ఇదే హాట్ టాపిక్. సెలవు రోజు ఆదివారం సొసైటీ ఏడీ అప్పాజీని రాష్ట్ర చేనేత, జౌలి శాఖ హెడ్ ఆఫీస్‌కు బదిలీ చేయడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కర్నూలు, మార్చి 30(ఆంధ్రజ్యోతి)
ఇది చేనేత సొసైటీ చరిత్ర
దేశానికి స్వాతంత్ర్యానికి పూర్వమే దివంగత పద్మశ్రీ మాచాని సోమప్ప 1938లో ‘ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్ (రిజిస్ట్రేషన్ నంబరు.వై298)ను స్థాపించారు. నేతన్నలకు జీవనోపాధి కల్పించారు. దేశంలోనే చేనేత వస్త్ర ఉత్పత్తులకు బ్రాండ్‌గా మారింది. దుప్పట్లు (బెడ్‌షీట్లు), తువాళ్లు, లుంగీలు, చేతి రుమాలు, దోమతెరలు, షర్టింగ్ దుస్తులు, ధోతీలు, చీరలు వంటి వివిధ రకాల చేనేత వస్త్ర ఉత్పత్తులతో చేనేతపురిగా ప్రసిద్ధి చెందింది. నాడు రెండు వేలకు పైగా చేనేత కార్మికులు వస్త్ర ఉత్పత్తి ద్వారా ఆకలి తీర్చుకున్నారు. మరమగ్గాల విప్లవానికి ఎన్నో చేనేత సంఘాలు కనుమరుగైనా.. ఎమ్మిగనూరు సహకార సంఘం 450 మందికి పైగా నేతన్నలకు ఉపాధి చూపుతోంది. ఈ సొసైటీకి కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, అనంతపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒంగోలు, కాకినాడ, గుంటూరు, తిరుపతి సహా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 19 ఎమ్మిగనూరు చేనేత విక్రయ దుకాణాలు ఉన్నాయి. 60 మందికి పైగా రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. సొసైటీకి ఎమ్మిగనూరు ప్రాంతంలో రూ.కోట్లు విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఏటా రూ.2.80 కోట్లు లావాదేవీలు (టర్నోవర్) కలిగిన సొసైటీ 2024-25లో రూ.22 లక్షలకు పైగా ఆదాయం సొంతం చేసుంకుంది. లాభాల్లో నడుస్తున్న చేనేత సహకార సంఘానికి చెందిన విక్రయ కేంద్రాలను ఆప్కోలో విలీనం చేయాలనే ప్రతిపాదన తెరపైకి తీసుకురావడంపై చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ సూచన మేరకు సంఘం సేల్స్ ఎంపోరియంలను (విక్రయ కేంద్రాలు) ఆప్కోలో విలీనం చేయు విషయాలను చర్చించి ఆమోదించు విషయం’ అంటూ అజెండాలో చేరుస్తూ ‘సూచిక సంఖ్య: వైడబ్ల్యూసీఎస్/ జీబీ/2026/26బి కింద ఈ నెల 11న సభ్యులకు సర్యులర్ జారీ చేశారు.
అనుమతి అడిగితే ఇలా చేస్తారా?
ఎమ్మిగనూరు చేనేత సహకారం సంఘం విక్రయ కేంద్రాల్లో ఆ సంఘం చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే చేనేత వస్త్ర ఉత్పత్తులు మాత్రమే విక్రయించాలి. ఇది ప్రధాన నిబంధన. అయితే పండుగలు, పెళ్లీల సీజన్‌లో ఏపీసీఎస్ యాక్ట్-1964 సెక్షన్ 48(2) ప్రకారం సిస్టర్ సొసైటీలు (ఇతర సహకార సంఘాలు) ఉత్పత్తులను ఆ కేంద్రాల్లో విక్రయాలు చేసేందుకు చట్టం వెసులుబాటు కల్పించింది. అయితే.. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ ప్రత్యేక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. ఈ చట్టం మేరకు ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం విక్రయ కేంద్రాల్లో ఆప్కో సహా ఇతర సొసైటీలకు చెందిన రూ.20 లక్షల చేనేత వస్త్ర ఉత్పత్తులు విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎమ్మిగనూరు చేనేత సహకార సొసైటీ అధికారులు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖరాణికి ప్రతిపాదన పంపించారు. ఆ ప్రతిపాదనను పరిశీలించి అనుమతి ఇవ్వవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ రెండూ కాకుండా ఏకంగా ఆరేడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేనంతగా నష్టాల్లో కూరుకుపోయిన ఆప్కోలో మార్కెటింగ్ పేరిట ఎమ్మిగనూరు చేనేత సొసైటీ విక్రయ కేంద్రాలను విలీనం చేయాలని ఏకంగా అజెండాలో చేర్చచడం రాజకీయ దుమారానికి తెర లేచింది. ఇప్పటికైనా రాష్ట్ర అధికారులు, పాలకులు స్పందించి మార్కెటింగ్ పేరిట విక్రయ కేంద్రాల విలీనం అంశాన్ని అజెండా నుంచి తొలగించి సొసైటీ మనుగడకు తీసుకోవాల్సిన ఉత్తమ ఆలోచనలు చేయాలని పలువురు కోరుతున్నారు. చేనేతల అభిష్టానికి విరుద్ధంగా కమిషనర్ రేఖరాణి ముందుకు వెళ్తే ఆ ప్రభావం రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలపై పడుతుందని, దీంతో రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సొసైటీ ఏడీ అత్యవసర బదిలీ!
ఎమ్మిగనూరు చేనేత సొసైటీ సర్వసభ సమావేశం మంగళవారం జరగాల్సి ఉంది. ఉంది. ఒక్క రోజు ముందు అది కూడా సెలవు రోజైనా ఆదివారం ఆ సొసైటీ ఏడీ ఎస్. అప్పాజీని చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖరాణి బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆదివారం సాయంత్రంలోగా విజయవాడ హెడ్ ఆఫీసులో రిపోర్ట్ చేసుకోవాలి అంటూ ఉదయం సీటీసీ బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం, గంటల వ్యవధిలోనే జౌళి శాఖ ఏడీ నాగరాజు సొసైటీ ఏడీగా అదనపు బాధ్యతలు (చార్జ్) తీసుకొని ఏడీ అప్పాజీని రిలీవ్ చేయడం వెనుక అంతర్యమేమిటో..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అప్పాజీ ఉంటే విలీన తీర్మానం జరగకుండా అడ్డుకుంటాడనే ఉద్ధేశంతోనే సెలవు రోజు ఆకస్మిక బదిలీ వేటు వేయడమే కాకుండా, ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా హెడ్ ఆఫీసులో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ‘రాజకీయ’ బదిలీపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.