Share News

అర్జీలు బుట్టదాఖలు

ABN , Publish Date - May 18 , 2026 | 11:41 PM

ప్రభుత్వం పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌, స్పెషల్‌ క్యాంపులు ఏర్పాటు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.

అర్జీలు బుట్టదాఖలు

సమస్యలు పరిష్కారమయ్యేనా?

పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై నిర్లక్ష్యం

అటకెక్కిన రెవెన్యూ క్లినిక్‌ దరఖాస్తులు

ఇబ్బందుల్లో రైతన్నలు

పట్టించుకోని క్షేత్రస్థాయి అధికారులు

ప్రభుత్వం పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌, స్పెషల్‌ క్యాంపులు ఏర్పాటు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. అన్నదాతల భూ సమస్యల పరిష్కారంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం విఫలమవుతోంది. ఒక వైపు ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. కార్యాల యాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యలను పరిష్కరిస్తామంటూ ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లు కేవలం అర్జీలు తీసుకోవడానికే పరిమితమయ్యాయి. రెవెన్యూ విభాగంలోని పేరుకుపోయిన అర్జీలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం..

కర్నూలు కలెక్టరేట్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ విభాగంలో వివిధ కార్యక్రమాల్లో స్వీకరిస్తున్న అర్జీలు బుట్టదాఖలు అవుతున్నాయి. ఎక్కడ కూడా వాటికి పరిష్కారం లభించడం లేదు. రైతులు సమర్పిస్తున్న వేలాది అర్జీలు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రాథమిక పరిశీలన చేయాల్సిన విలేజ్‌ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), సర్వేయర్లు క్షేత్రస్థాయికి రాకపోవడంతో ఫైళ్లు కదలడం లేదు. భూములకు శాశ్వత హక్కులు కల్పిస్తామంటూ చేపట్టిన రీసర్వే (వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష) ప్రక్రియ రైతులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. సాంకేతిక లోపాలు, అదికారుల అనాలోచిత సర్వేల వల్ల ఒకరి భూమి మరొకరి పేరు మీదకు బదిలీ కావడం, సరిహ ద్దులు మారిపో వడం వంటి తీవ్రమైన తప్పులు దొర్లాయి.

అధికారులు సాకులు చెబుతూ..

రీసర్వేలో రికార్డుల సవరణ కోసం రైతులు పీజీఆర్‌ఎస్‌ ద్వారా వేలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. ఈ తప్పులను సరిదిద్దడంలో మండల సర్వేయర్లు, విలేజ్‌ సర్వేయర్లు తహసీల్దార్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. పైగా రీసర్వే పూర్తయింది. ఇక మార్పులు మా చేతుల్లో లేవు అంటూ అధికారులు సాకులు చెబుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే..

గతంలో జరిగిన రికార్డుల కంప్యూటరైజేషన్‌ తప్పుల వల్ల వేలాది మంది పేద, మధ్యతరగతి రైతుల సొంత పట్టా భూములు, జీవోల ప్రకారం పొందిన అసైన్డ్‌ భూములు, నిషేధిత జాబితాల్లోకి వెళ్లిపోయాయి. దీని వల్ల రైతులకు అత్యవసర సమయాల్లో (పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం) భూమి అమ్ముకోవడానికి గానీ, బ్యాంకుల్లో రుణాలు పొందడానికి గానీ వీలు పడటం లేదు. 22-ఏ నుంచి భూమిని తొలగించాలని మీసేవ ద్వారా, పీజీఆర్‌ఎస్‌ ద్వారా అర్జీలు పెట్టుకున్నా ఏళ్ల తరబడి దస్త్రాలు పెండింగ్‌లోనే మూలపడుతున్నాయి.

నిబంధనలు తుంగలోకి..

పీజీఆర్‌ఎస్‌ రెవెన్యూ క్లినిక్‌ స్పెషల్‌ క్యాంపులలో వచ్చే అర్జీలపై నిర్ణీత కాలపరిమితి (ఎస్‌ఎల్‌ఏ)లోగా స్పందించాలనే నిబంధనను క్షేత్ర స్థాయి అధికారులు తుంగలో తొక్కుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రాకుండా ఉండేందుకు, సమస్య పరిష్క రించకుండానే తప్పుడు కారణాలు, అసంపూర్తి సమాచారంతో అర్జీలను రిజెక్ట్‌ (తిరస్కరించడం) చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒకే సమస్యపై రైతులు నాలు గైదుసార్లు అర్జీలు పెట్టుకోవాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ఫిర్యాదుల వేదికలో 80 శాతానికి పైగా భూ సమస్యలే ఉంటున్నాయి. ఉన్నతాధికారులు అసలు పట్టించుకోవడం లేదు.

పెండింగ్‌లో అర్జీల వివరాలు

పీజీఆర్‌ఎస్‌ :

రెవెన్యూలో అర్జీలు - 2069

రీసర్వేలో అర్జీలు - 488

రీ ఓపెన్‌ అయిన అర్జీలు - 450

రెవెన్యూ క్లినిక్‌లో పెండింగ్‌ అర్జీలు

ఆర్‌వోఆర్‌ కేసులు

ఆదోని డివిజన్‌లో - 284 (22ఏ - 14)

కర్నూలు డివిజన్‌లో - 215 (22ఏ- 50)

పత్తికొండ డివిజన్‌లో- 152 (22ఏ-34)

రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం. భూ సమస్యలపై మండలాల్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

నూరుల్‌ ఖమర్‌, జేసీ, కర్నూలు

Updated Date - May 18 , 2026 | 11:41 PM