Share News

ఏపీఎఫ్‌ఆర్‌కు శ్రీకారం

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:49 PM

రైతులకు ప్రభుత్వ పథకాలను అందించే విధంగా ఫార్మర్‌ రిజిస్ట్రీ విశిష్ట గుర్తింపు సంఖ్య విధానానికి(ఏపీఎఫ్‌ఆర్‌) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి.

ఏపీఎఫ్‌ఆర్‌కు శ్రీకారం

పథకాలు సులభంగా పొందండి

భవిష్యత్తులో అన్నింటా ఇదే ప్రామాణికం

నంద్యాల, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రైతులకు ప్రభుత్వ పథకాలను అందించే విధంగా ఫార్మర్‌ రిజిస్ట్రీ విశిష్ట గుర్తింపు సంఖ్య విధానానికి(ఏపీఎఫ్‌ఆర్‌) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ప్రతి రైతు పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. అన్నదాత సుఖీభవ, ఎరువుల రాయితీ, పీఎం కిసాన్‌, పెట్టుబడి సాయం, పంట బీమా, సాగు చేసిన పంట విక్రయాల కు భవిష్యత్తులో తప్పని సరైందని జిల్లా వ్యవసాయాధికారులు తెలిపారు. ఏది ఏమైనా సరికొత్త విధానంలో రైతులకు ఇలాంటి విధానం తీసుకోరావడంతో ఇటు రైతులకు.. అటు ప్రభుత్వానికి అన్నింటా సరైనా లెక్క తేలే అవకాశం ఉన్నట్లైంది.

నమోదు ఇలా...

రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి సంబంధిత వ్యవసాయ సహాయకుల ద్వారా తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. ఆధార్‌కార్డుకు లింకైనా ఫోన్‌ నెంబర్‌ తెలియజేయాలి. ఇదే క్రమంలో తమ ఆధార్‌కు తమ భూమి వివరాలు కూడా అనుసంధానమై ఉండాలి. లేదంటే నమోదు పక్రియ మధ్యలోనే ఆగిపోతుంది. ఆ తర్వాత అన్ని సక్రమంగా ఉంటే వివరాలను నమోదు చేయగానే రైతు ఫోన్‌కు 11 అంకెలు కలిగిన విశిష్ట గుర్తింపు సంఖ్య మెసేజ్‌ రూపంలో వస్తుంది. ఆ తర్వాత ఎక్కడైనా మీ సేవా కేంద్రాల్లో స్మార్డ్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

జిల్లా వ్యాప్తంగా 2,63,394 మంది రైతులుండగా..

నంద్యాల, శ్రీశైలం, డోన్‌, పాణ్యం, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, బనగాన పల్లె నియోజకవర్గాల పరిధిలో 2,63,394మంది రైతులుండగా ఇప్పటివరకు సదరు ఏపీఎఫ్‌ఆర్‌ కింద 2,13,149 మంది రైతులు సదరు రైతుల ఫార్మర్‌ రిజిస్ట్రీ విశిష్ట సంఖ్యను నమోదు చేసుకున్నట్లు జిల్లా వ్యవసాఽయాధికారుల లెక్కలు చెప్తున్నాయి. ఇక మిగిలిన 50,245మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది. మిగిలిన 50.245మంది రైతుల్లో చాలా మంది రైతులకు సంబంధించి వివిధ కారణాలతో ఆన్‌లైన్‌ కావడం లేదని ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది.

జిల్లాలో పరిస్థితి ఇలా..

జిల్లా వ్యాప్తంగా రైతుల సంఖ్య : 2,63,394

ఇప్పటి వరకు నమోదు చేసుకున్న రైతుల సంఖ్య : 2,13,149

ఇంకా పెండింగ్‌లో ఉన్న రైతుల సంఖ్య : 50,245

సులభతరంగా పథకాలు పొందే..

ఏపీఎఫ్‌ఆర్‌ విధానంతో రైతులకు కల్పించే రైతుల రిజిస్ట్రీ విశిష్ట సంఖ్యనే భవిష్యత్తులో ప్రభుత్వాలు అందించే పథకాలకు అన్నింటికి ఇదే ప్రామాణికం. సులభతరంగా పథకాలు పొందే అవకాశం ఉంది.. ఎప్పటికప్పుడు ఆయా రైతులకు సంబందించిన వివరాలను వెంటనే తెలుకోవచ్చు. రైతులకు అవగాహన కల్పించి నమోదు చేసుకునేలా చేస్తున్నాం.

వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవ సాయాధికారి, నంద్యాల

Updated Date - Feb 28 , 2026 | 11:49 PM