Share News

అధికారుల తీరుపై ఆగ్రహం

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:09 AM

మండలంలో పారిశుధ్యం లోపించడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలుడి మృతదేహంతో దేవనకొండ ఎంపీడీవో కార్యాలయాన్ని దిగ్బంధం చేసిన ఘటన చోటుచేసుకుంది.

అధికారుల తీరుపై ఆగ్రహం
బాలుడి మృత దేహంతో కుటుంబ సభ్యులు

బాలుడి మృతదేహంతో ఎంపీడీవో కార్యాలయం దిగ్బంధం

దేవనకొండ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలో పారిశుధ్యం లోపించడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలుడి మృతదేహంతో దేవనకొండ ఎంపీడీవో కార్యాలయాన్ని దిగ్బంధం చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. దేవనకొండకి చెందిన నరసనాయుడు, కవిత దంపతుల కుమారుడు రేవంత్‌ నాయుడు(19 నెలలు) వారం రోజుల క్రితం జ్వరం బారినపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆబాలుడు మృతిచెందాడు. తీవ్ర వేదనకు గురైన బాలుడి కుటుంబీకులు మృతదేహంతో నేరుగా బుధవారం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు కార్యాలయంలోకి వెళ్లకుండా దిగ్బంధం చేసి వారి తీరుపై మండిపడ్డారు. దేవనకొండలో పందుల సంచారం, కోతుల బెడద, కాలనీలో పారిశుధ్యం లోపించిందని అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశామన్నారు. సమస్యలను గాలికొదిలేయడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆగ్రహించారు. వైద్యశాఖ నిర్లక్ష్యం కూడా తీవ్రంగా ఉందని టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, వైస్సాఆర్‌సీపీ నాయకులు మండిపడ్డారు. గ్రామంలో పందులు, కోతుల బెడద నుంచి రక్షించి, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేస్తామని సీఐ వేణుగోపాల్‌, ఎంపీడీవో జ్యోతి, డీప్యూటీ ఎంపీడీవో గోపాల్‌ నిరసనకారులకు తెలిపారు. వారు ఆందోళన విరమించారు.

Updated Date - Oct 01 , 2026 | 12:09 AM