ఆంధ్రజ్యోతిపై అక్కసు
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:13 AM
వైసీపీ తీరు మారలేదు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఆ పార్టీ వర్గాల్లో ఎలాంటి మార్పు రాలేదు.
తీరు మార్చుకోని వైసీపీ
పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ఆ పార్టీ నైజం
ప్రధాన కార్యాలయంపై దాడులను ఖండించిన నేతలు, ప్రజా సంఘాలు
కర్నూలు అర్బన్/కర్నూలు కల్చరల్/ నంద్యాల రూరల్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ తీరు మారలేదు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఆ పార్టీ వర్గాల్లో ఎలాంటి మార్పు రాలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌లోని ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకలు దాడులకు తెగబడ్డారు. అదే క్రమంలో ఆ పార్టీ నేతలు రెచ్చిపోతూ ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతులను దహనం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులకు పాల్పడేందుకు వైసీపీ మూకలు సిద్ధమవుతున్నారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా, ప్రశ్నించే గొంతుపై దాడికి పాల్పడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కవులు, రచయితలు వైసీపీ ప్రజాకంఠక నిర్ణయాలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
వైసీపీది హేయమైన చర్య
యదార్థాలను ప్రచురించే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య. హైదరాబాద్‌లో వైసీపీ మూకలు కార్యాలయంపై దాడికి యత్నించడం, రాష్ట్రంలోని పలుచోట్ల ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేయడం వంటి అనైతిక చర్యలకు వైసీపీ పాల్పడుతోంది. జగన్ అండ్ కో చేస్తున్న చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజాభ్యున్నతికి పాల్పడుతుంటే అలాంటి సంస్థలపై కూడా దాడులకు పాల్పడడం సిగ్గుచేటుగా ఉంది. వైసీపీ నాయకుల పద్ధతి మారకపోతే పతనం తప్పదు.
ఎన్‌ఎండీ ఫరూక్, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి
ఆంధ్రజ్యోతిపై దాడి దారుణం
హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడటం దారుణం. వార్తలు నచ్చకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలే కానీ, ఇలా దాడులు చేసి మీడియాను బెదిరించాలను కోవడం మంచి పద్ధతి కాదు. వైసీపీ నాయకులు ఇకనైనా ధోరణి మార్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో మీడియాకు తగిన గుర్తింపు ఉంది. అలాంటి మీడియాపై అక్కసు వెళ్లగక్కుతూ దాడులకు పాల్పడితే సమాజం చూస్తూ ఊరుకోదు. ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. వైసీపీ నాయకులు ఇతరులపై దూషణలకు పాల్పడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారు.
- టీజీ భరత్, పరిశ్రమల శాఖ మంత్రి
దాడులు చేయడం వైసీపీకి అలవాటే
వైసీపీ అధినేత జగన్ వైఖరిని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతారా? పత్రికలు, పత్రికా స్వేచ్ఛపై దాడులు చేయడం వైఎస్ జగన్‌కు, వారి నాయకత్వానికి అలవాటే. రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేసిన వైసీపీ నాయకులు పచ్చి గూండాలు, రౌడీల్లా మాట్లాతున్నారు. పత్రికాస్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య. సొంతంగా ఒక మీడియా సంస్థను నడుపుతున్న జగన్ సాటి మీడియా సంస్థలపై దాడికి ప్రోత్సహించడం ఆయన దుర్మార్గానికి పరాకాష్ట. ఇలాంటి వ్యాఖ్యలు, దాడులను ప్రజాస్వామ్య వాదులు ఎంతమాత్రం హర్షించరు. 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీలో మార్పు రాకపోవడం దురదృష్టకరం.
- బీసీ జనార్దన్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖమంత్రి
వైసీపీ ఆందోళన సమంజసమా?
ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ నాయకుల ఆందోళన సమంజసమా? మన దేశంలో మీడియా స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా సంస్థలపై ఒత్తిళ్లు తీసుకురావడం, దాడులు చేయడం తగదు. ఇది ప్రజాస్వామ్యానికి హానీకరం. ప్రజలకు నిజాలను తెలియజేయడం మీడియా సంస్థల బాధ్యత. ఆ పని చేయడాన్ని అడ్డుకోవడం తగదు. మీడియాపై ద్వేష వాతావారణాన్ని సృష్టించడం ప్రజాస్వామ్యనికి ప్రమాదకరం. వైసీపీ అనుచరులు ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడటం అభ్యంతరకరం.
- గుడిసె క్రిష్ణమ్మ్ట, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు
దాడులను ఖండించిన ఐజేయూ, ఏపీయూడ బ్ల్యూజే
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్‌పై వైసీపీ నేతల దాడులను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ), ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూ డబ్ల్యూజే తీవ్రంగా ఖండించాయి. ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈఎన్ రాజు, సుబ్బయ్య, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరంట్ల కొండప్ప, రాష్ట్ర సమితి సభ్యుడు వైవీ కృష్ణారెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసగౌడ్ మంగళవారం మాట్లాడుతూ.. హైదరాబాదులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై వైసీపీ దాడికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ పేరుతో వచ్చిన వార్త వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతూ వైసీపీ నేతలు ప్రధాన కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం సబబు కాదన్నారు. ఛానెల్‌లో వచ్చిన వార్త పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలకు ఆశ్రయించవచ్చని చెప్పారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించిన వారిని అరెస్టు చేయాలని, భవిషత్తులో దాడులు జరగకుండా భద్రత కల్పించాలని కోరారు.
ఉన్నది.. ఉన్నట్లు చెప్పడం కూడా తప్పేనా..?
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఛానల్‌పై వైసీపీ నాయకులు దాడి చేయడం దుర్మార్గం. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ పేరుతో వచ్చిన వార్త వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతూ వైసీపీ నాయకులు ప్రధాన కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం సరైన పద్ధతి కాదు. జగన్ మావిగన్ పేరుతో రాజధాని అమరావతిపై కుట్రలు చేసే క్రమంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఆంధ్రజ్యోతి ప్రస్తుతం జరుగుతున్న విషయాలను ప్రజలకు వివరించడంలో తప్పు ఏమిటి? వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే న్యాయ స్థానాలను ఆశ్రయించాలన్నారు. ప్రతికా స్వేచ్ఛపై ఇలాంటి దాడులు సరికాదు.
-సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్
అమరావతి, ఆంధ్రజ్యోతిపై అక్కసు
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం ఏమాత్రం సరైన చర్య కాదని సాహితీవేత్త, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కళారత్న పత్తి ఓబులయ్య అన్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంలో నిక్కచ్చిగా వాస్తవాలను చెప్పడంతోనే వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు. ‘మావిగన్’ రచ్చ నుంచి దృష్టి మరల్చే ప్రక్రియలో భాగంగానే వైసీపీ ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడుతోంది. ప్రతికూల వార్తలు ప్రచురితమైనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించాలే కానీ ఇలా నేరుగా కార్యాలయాలపై దాడులకు పాల్పడటం ఏమిటి? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించారు. అమరావతి, ఆంధ్రజ్యోతి అంటే గిట్టకనే ఆందోళన ముసుగులో దాడులు చేసి మీడియా సంస్థలను భయపెట్టాలని వైసీపీ కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోంది. రాష్ట్రానికి పదేళ్లుగా రాజధాని లేదు. ఇప్పుడు వచ్చింది. అమరావతి వంటి అద్భుతమైన రాజధాని వస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఎందుకు అంత అక్కసు. మీడియా సంస్థలపై దాడులకు పాల్పడటం సరైన చర్య కాదు.
ఆంధ్రజ్యోతిపై దాడి సిగ్గుచేటు
డోన్ టౌన్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రజల పక్షాన వార్తలు ప్రచురితం చేస్తున్న ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేయడం సిగ్గు చేటు అని రాష్ట్ర సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఎంఎ్‌సఆర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాదు ప్రధాన కార్యాలయమైన ఏబీఎన్-ఆంద్రజ్యోతిపై వైసీపీ అల్లరి మూకలు దాడులకు పూనుకోవడం అన్యాయమన్నారు. వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో ఆంధ్రజ్యోతిపై కక్ష కట్టినా కూడా ఆంధ్రజ్యోతి ఏనాడూ ఽభయపడలేదన్నారు. ఏబీఎన్ ఆంద్రజ్యోతిపై దాడి చేసిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్టు చేయాలని కోరారు.
మీడియా స్వేచ్ఛపై దాడులు సిగ్గుచేటు
మంత్రాలయం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిజాలు వెలుగులోకి తెస్తున్న మీడియా సంస్థలపై దాడులు చేయడం సిగ్గుచేటని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం, సమస్యలు వచ్చినా తనకు గాని తన సోదరులు రఘునాథ్ రెడ్డి,రామకృష్ణారెడ్డి, తనయుడు రాకే్‌షరెడ్డి దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేయడం సరికాదని అన్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడడం అందరి బాధ్యతగా గుర్తించుకోవాలని సూచించారు.
వైసీపీది ఆది నుంచి విష సంస్కృతి
నంద్యాల రూరల్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఆవిర్భావం నుంచి విష సంస్కృతి కలిగిన పార్టీ అని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. వాస్తవాలను చూపించే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ మూకలు దాడి చేయడం వారి అనైతికతకు అద్దం పడుతుందన్నారు. వైసీపీ నాయకులు పత్రికా కార్యాలయంపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డ వైసీపీ రౌడీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు కష్టపడి ఉన్నతస్థాయికి చేరుకున్న వారేనని అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవల్సిందిపోయి వారిపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.
మీడియా గొంతు నొక్కాలనుకోవడం పిరికి చర్య
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): అమరావతిపై తమ అరాచక వైఖరిని ప్రశ్నించినందుకు వైసీపీ అల్లరిమూకలు మీడియా గొంతు నొక్కాలనుకోవడం పిరికిపంద చర్య అని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ హైదరాబాదులోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిని బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. రౌడీ మూకలను వెంటేసుకొని వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక మీడియా సంస్థపైకి వెళ్లడం వారి విష సంస్కృతికి పరాకాష్టగా ఆయన పేర్కొన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం కాదని, చేతనైతే ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలని అన్నారు.