తీరని సమస్య..!
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:24 PM
ఆత్మకూరులో ఇంధన కొరత సమస్య ప్రజల్ని ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తోంది.
ఆత్మకూరులో వాహనదారులకు అవస్థలు
డీజిల్, పెట్రోల్ కోసం బంకుల వద్ద పాట్లు
రైతుల పరిస్థితి మరీ అధ్వానం
ఆత్మకూరు, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరులో ఇంధన కొరత సమస్య ప్రజల్ని ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తోంది. కొన్ని రోజులుగా డీజిల్, పెట్రోల్ కొరత ఉండటం వల్ల వాహనదారులకే కాదు రైతులకు కూడా అవస్థలు తప్పడం లేదు. వాస్తవానికి పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం వల్ల భారత్‌కు ఇంధన సరఫరా అంతంత మాత్రంగానే జరుగుతోంది. దీంతో ఆయా ఆయిల్ కంపెనీలు సైతం పెట్రోల్ బంకులకు డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేయడం లేదు. బంకుల యజమానులు తమ వద్ద ఉన్న కొద్దిపాటి నిల్వలను పొదుపుగా విక్రయాలు సాగిస్తున్నారు. దీనికితోడు వాహనదారులు కూడా తమకు అవసరం లేనప్పటికీ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలోని అన్ని బంకుల వద్ద రద్దీ కనిపించింది. దీంతో చేసేది లేక బైకులకు రూ.200 మాత్రమే పెట్రోల్, మిగతా వాహనాలకు 10 లీటర్ల చొప్పున డీజల్, పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు. అదేక్రమంలో ప్రస్తుతం రబీ సీజన్‌కు సంబంధించిన పంటకోతలు ఉండటంతో పంట కోత యంత్రాలకు అవసరమయ్యే డీజిల్ కోసం ఆయా మండలాల ఏవోల వద్ద టోకెన్లను తీసుకుని డీజిల్ బంకుల వద్ద క్యాన్లలో డీజిల్‌ను తీసుకెళ్లాలని అఽధికారులు చెబుతున్నారు. అయితే రైతులకు కూడా పూర్తి స్థాయిలో డీజల్ లభించకపోవడంతో వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్డీవో తనిఖీలు
ఆత్మకూరు పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆర్డీవో వెంకటశివ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా బంకుల్లో ఉండే పెట్రోల్, డీజిల్ నిల్వలను పరిశీలించారు. అమ్మకాల ప్రక్రియ గురించి బంకుల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ అవసరానికి తగ్గట్లుగా మాత్రమే డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయాలని సూచించారు. ఆత్మకూరు డివిజన్‌లోని అన్ని పెట్రోల్ బంకులకు ఎప్పటిలాగే డీజిల్, పెట్రోల్ సరఫరా జరుగుతోందని, అయితే ప్రజలు అవసరంగా అధిక మోతాదులో పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైనట్లు స్పష్టం చేశారు. అదేక్రమంలో డిమాండ్ దృష్ట్యా డీజిల్, పెట్రోల్‌ను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈయన వెంట తహసీల్దార్ రత్నరాధిక, ఏడీఏ హేమలత, ఎస్‌ఐ నారాయణరెడ్డి, సివిల్ సప్లైస్ అధికారి శ్రీనివాసులు ఉన్నారు.
అందుబాటులో ఇంధన నిల్వలు
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని పెట్రోల్ బంకులను ఎస్పీ సునీల్ షెరాన్‌తో కలసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరానికి అనుగుణంగా అన్ని పెట్రోలు బంకు లకు సరిపడా ఇంధనం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా లోని 223 బంకుల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు కూడా అవసరాలకు సరిపడా మాత్రమే ఇంధనం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యాన్లు, డ్రమ్ముల్లో అధిక మొత్తంలో ఇంధనాన్ని నిల్వ చేయవద్దని సూచించారు. వ్యవసాయ అవసరాల కోసం హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు డీజిల్ కావాలంటే సంబంధిత వ్యవసాయ అధికారి, తహసీల్దార్ ధ్రువీకరించిన కూపన్ తప్పనిసరి అన్నారు. హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు 50 లీటర్లు, కార్లకు 15 లీటర్లు, బైక్‌లకు 3 నుంచి 5 లీటర్లు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అంబులెన్స్‌లు, పోలీస్ వాహనాలకు 1,500 నుంచి 2,500 లీటర్ల వరకు డెడ్ స్టోరేజ్ నిల్వ ఉంచుతున్నట్లు తెలిపారు. ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రధాన ఆయిల్ కంపెనీల పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బంకు వద్ద పోలీస్, రెవెన్యూ అధికారులను పర్యవేక్షణ కోసం నియమించా మన్నారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.