Share News

ఆక్రమణలో ఆలూరు చెరువు

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:50 PM

ఆలూరు చెరువు ఉనికి ప్రమాదంలో పడింది. ఒకప్పుడు 163 ఎకరాల విస్తీర్ణంలో కళకళలాడిన ఈ చెరువు ప్రస్తుతం ఆక్రమణ కారణంగా కేవలం 80 ఎకరాలకు కుచించుకుపోయింది.

ఆక్రమణలో ఆలూరు చెరువు
ముళ్లకంప చెట్లతో నిండిపోయిన ఆలూరు చెరువు

80 ఎకరాలు కబ్జా

చెరువు అభివృద్ధి ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి కలెక్టర్‌కు వినతి

ఆధునికీకరిస్తే ఆలూరు ప్రజలకు శాశ్వతంగా తాగునీరు

ఆలూరు చెరువు ఉనికి ప్రమాదంలో పడింది. ఒకప్పుడు 163 ఎకరాల విస్తీర్ణంలో కళకళలాడిన ఈ చెరువు ప్రస్తుతం ఆక్రమణ కారణంగా కేవలం 80 ఎకరాలకు కుచించుకుపోయింది. ఎక్కడిక క్కడ కబ్జా చేయడంతో నీటి నిల్వ సామర్థ్యం ఘోరంగా పడిపోయింది. ఆలనాపాలన లేక పిచ్చిమొక్కలతో నిండిపోయింది. చెరువును పునరుద్ధరించాలని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా ఉన్నతాధికారులకు ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. ఆలూరు చెరువు ఆధునికీకరణ పనులు చేపట్టాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి కలెక్టర్‌ డా.ఏ. సిరి దృష్టికి తీసుకెళ్లారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

కర్నూలు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రానికి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలూరు నియోజకవర్గం కేంద్రమే అయినప్పటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. వనరులు సద్వినియోగం చేసుకుని మేజర్‌ గ్రామ పంచాయతీకి తాగునీరు సరఫరా చేయడంలో అధికారులు ఘోర వైఫల్యం చెందారు. గ్రామానికి ఆనుకుని పెద్ద చెరువు ఉంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలూరు చెరువు 163 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, జలవనరుల శాఖ ఇంజనీర్లు తెలిపారు. నీటి నిల్వ సామర్థ్యం 19 ఎంసీఎఫ్‌టీ (0.019 టీఎంసీ)లు ఈ చెరువు కింద 107 ఎకరాల ఆయకట్టు కూడా ఉంది. ఇదంతా గతం.. ప్రస్తుతం అక్రమార్కుల కబ్జాలకు అడ్డాగా మారింది. ఈ చెరువును ఆక్రమణల నుంచి కాపాడి, ప్రజలకు సాగు, తాగునీరు అందించేలా, పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచే పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని పలువురు కోరుతున్నారు.

కబ్జాలో 80 ఎకరాలు

ఒకప్పుడు వర్షం నీటిని ఒడిసిపట్టి ఈ చెరువు ద్వారా తాగు, సాగునీరు అందించేవారు. అయితే.. ఈ చెరువుకు వర్షం నీరు మళ్లించే వంకలు, వాగులు (ఫీడర్‌ చానల్స్‌) ఆక్రమణకు గురయ్యాయి. ఫలితంగా పాతికేళ్లుగా చెరువులోకి ఆశించిన స్థాయిలో వరద చేరడం లేదు. దీంతో చెరువు నీటి నిల్వ ప్రాంతం (ఫోర్‌ షోర్‌ ఏరియా) ముళ్ల కంపలతో నిండిపోయింది. చెరువు బస్టాండు పక్కనే ఉండటంతో, గ్రామం విస్తరిస్తుండటంతో ఇక్కడ భూముల విలువ చుక్కలు తాకాయి. సెంటు స్థలం రూ.10-15 లక్షలు పైగా పలుకుతోంది. దీంతో అక్రమార్కుల కన్ను చెరువు భూములపై పడింది. రాజకీయ నాయకులు కూడా వారికే అండగా నిలవడంతో ఇష్టారాజ్యంగా ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 80 ఎకరాలకు కబ్జా అయి ఉంటుందని జలవనరుల శాఖ అధికారులు అంటున్నారు. అక్రమార్కులకు రాజకీయ అండ ఉండటంతో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గత వైసీపీ హయాం లో నాటి ప్రజాప్రతినిధి అండతో ఆ పార్టీ కార్యకర్తలు ఎక్స్‌కవేటర్లతో చదును చేసి చెరువు కబ్జాకు ప్రయత్నించగా ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో ఆక్రమణకు అడ్డుకట్ట పడింది.

సరిహద్దులు గుర్తించి, రక్షణ చర్యలు చేపడితే

ఆలూరు చెరువు పిచ్చిమొక్కలు, ముళ్ల కంప చెట్లు పెరిగి ఆనవాళ్లు కోల్పోతుంది. చెరువు కట్ట బలహీనంగా మారింది. ఆ చెరువు ఆధునికీకరణ, సుందరీకరణ పనులు చేపట్టి చెరువును కాపాడాలని కోరుతూ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ప్రభుత్వాన్ని విన్నవించారు. రూ.50 లక్షలు మంజూరు చేయాలని కలెక్టర్‌ డా.ఏ. సిరికి వినతి పత్రం పంపారు. చెరువును ఆధునికీకరిస్తే పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచే పర్యాటక కేంద్రంగా, వాకింగ్‌ కేంద్రంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆలూరు ట్యాంక్‌బండ్‌ రోడ్డుగా అభివృద్ధి చెందుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇది సాకారం కావాలంటే.. తక్షణమే కలెక్టర్‌ స్పందించి చెరువు సరిహద్దులు గుర్తించాలి. ఆక్రమణలు తొలగించి చెరువును పూర్వస్థితికి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఇలా చేస్తే తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్‌:

ఈ చెరువు నీటి నిల్వ సామర్థ్యం 19 ఎంసీఎఫ్‌టీ (0.019 టీఎంసీలు) స్థాని క క్యాచ్‌మెంటు ఏరియా (స్థానిక వాగు లు) ద్వారా కూడా దీనికి నీరు చేరుతుంది.

ఆలూరు జనాభా 12వేలు పైగా ఉంది. ఒక ఎంసీఎఫ్‌టీ అంటే దాదాపు 2.80 కోట్ల లీటర్ల నీరు. 19 ఎంఎసీఎఫ్‌టీల నీటిని నిల్వ చేస్తే మరో 50 ఏళ్ల వరకు ఆలూరు ప్రజలకు శాశ్వతంగా తాగునీరు ఇవ్వవచ్చు. ప్రస్తుతం వారం పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందడం లేదు.

ఆలూరు చెరువు ఆక్రమణలు తొలగించి హంద్రీ నీవా కాలువ నుంచి లేదా టీబీపీ ఎల్లెల్సీ కాలువ నుంచి పైపులైన్‌ ద్వారా నీరు నింపితే దశాబ్దాల కన్నీటి కష్టాలకు చెక్‌ పెట్టవ చ్చని, ఆలూరు సహా హత్తిబెళగల్‌, అరికెర, మొలగవెళ్లి గ్రామాలకు కూడా తాగునీరు ఇవ్వవచ్చని ఇంజనీరింగ్‌ నిపుణులు అంటున్నారు. అయితే.. అందుకు రూ.45 కోట్లు నిధులు అవసర మని అంటున్నారు. ఆలూరు చెరువును ఆధునికీకరించి పైపులైన్‌ ద్వారా హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణాజ లాలు మళ్లిస్తే.. దశాబ్దాల కన్నీటి కష్టాలకు చెక్‌ పెట్టవచ్చు.

Updated Date - Jul 13 , 2026 | 11:50 PM