Share News

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:26 AM

ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి రాజకీయ బలప్రదర్శన, శాంతి భద్రతలకు సవాల్‌గా మారింది.

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు

కార్యకర్త ఫోన్‌ చేసి చెప్పాడని టీడీపీ వర్గీయులపై దండయాత్ర

ఇసుక గొడవకు రాజకీయ రంగు పూసిన ఎమ్మెల్యే

అరెస్టులకు నిరసనగా వైసీపీ కార్యకర్తల ధర్నా

టీడీపీ శ్రేణులు, దళితులపై దాడులకు నిరసనగా టీడీపీ నాయకుల ఆందోళన

ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి రాజకీయ బలప్రదర్శన, శాంతి భద్రతలకు సవాల్‌గా మారింది. కార్యకర్త ఫోన్‌ చేశారని ఏకంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని వంద మందికి పైగా అనుచరులతో బలప్రదర్శన చేయడం ఓ పల్లెపై దండయాత్రకు దిగినట్లు విమర్శలకు తావిస్తోంది. గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన శాసనసభ్యుడే పచ్చని పల్లె సీమలో అశాంతికి ఆజ్యం పోయడం రాజకీయ చర్చకు తెరతీసింది. ఎమ్మెల్యే చేపట్టిన దాడుల్లో టీడీపీ వర్గీయులు గాయపడి ఆసుపత్రిపాల య్యారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే విరూపాక్షితో సహా ఆయన అనుచరులు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే.. వైసీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని, వైసీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో.. శాసనసభ్యుడే బీసీలు, దళితులుపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆలూరులో రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే సృష్టించిన వివాదం ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ వేడిని రాజేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

కర్నూలు/చిప్పగిరి/ఆలూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల గ్రామాల్లో అక్రమ ఇసుక విషయమై వైసీపీ కార్యకర్త సంగాల గిరి, టీడీపీ కార్యకర్త గురునాథ్‌ మధ్య ఫోన్‌లో జరిగిన వివాదం ఇరుపార్టీల గొడవకు కారణమైంది. వాస్తవాలు విచారించుకోకుండా తమ పార్టీ కార్యకర్త ఫోన్‌ చేశాడనే ఒకే ఒక్క కారణంతో.. పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య వాదించినా వినకుండా ఎమ్మెల్యే విరూపాక్షి దాదాపు 100 మందికి పైగా అనుచరులతో శనివారం రాత్రి నేమకల్లు, సంగాల గ్రామాలపై దాడులకు దిగారు. టీడీపీ వర్గానికి చెందిన నక్కలదొడ్డి శేఖర్‌, గురునాథ్‌, నాగరాజు ఇళ్లపై మూకుమ్మడి దాడులకు దిగారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా చెప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, అదే బీసీ, దళితుల ఇళ్లపై దాడులకు పాల్పడటం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే తన అనుచరులు సృష్టించిన భీభత్సం వల్ల అన్నదమ్ముల్లా ఉండాల్సిన గ్రామం రెండు వర్గాలుగా విడిపోయింది. వైసీపీ వర్గీయుల దాడిలో సంగాలకు చెందిన నక్కలదొడ్డి శేఖర్‌, సుచిత్ర తదితరులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనతో నిన్నమొన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న గ్రామాలు ఒక్కసారిగా రాజకీయ అలజడికి, భయాందోళనలకు గురయ్యాయి.

వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేఖర్‌, సుచిత్రలను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నియోజకవర్గం ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాసు రెడ్డి తదితరులు పరామర్శించి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం

టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

ఆలూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యకర్తలపై ఎక్కడ అన్యాయం, దాడులు జరిగితే సహించబోమని వారికి అండగా ఉంటామని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నా రు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల పట్ల గౌరవంగా ఉండాలని మహిళలను వేధించినా, దాడులు చేసినా సహించబోరని అన్నారు. నేమకల్‌లో టీడీపీ నాయ కులు శేఖర్‌, ఆయన భార్యపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన అను చరులతో వచ్చి గుండాల వలే దాడి చేయడంపై పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుందన్నారు. చట్ట ప్రకారం ఆలూరు ఎమ్మెల్యేను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. ఎక్కడ కార్య కర్తకు అన్యాయం జరిగిన సహించేది లేదని తెలిపారు. ఎంతవరకైనా వెళ్తామన్నారు. బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలా మహిళలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

దాడులకు పాల్పడి ధర్నాలు చేస్తారా..

చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల గ్రామా ల్లో శనివారం రాత్రి ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయ న కొడుకు చంద్రశేఖర్‌, సోదరుడు శ్రీరాములుతో పాటు వైసీపీ శ్రేణులు నిర్వహించిన దాడుల్లో గాయపడిన టీడీపీ కార్యకర్త శేఖర్‌ భార్య నక్కలదొడ్డి పల్లవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సహా 34 మంది అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఆదివారం తెల్లవారు జామున పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో ఆలూరు సీఐ రవిశంకర్‌ రెడ్డి, చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు, పోలీసు సిబ్బందితో వెళ్లి ఎమ్మెల్యే విరుపాక్షిని, మరి కొందరిని అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త బుట్టా రేణుక, వైసీపీ నాయకులు బీవై రామయ్య, రామచంద్రారెడ్డితో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు చిప్పగిరి చేరుకున్నారు. ఎమ్మెల్యేపై అక్రమంగా కేసుల పెట్టి అరెస్టు చేశారంటూ ఽధర్నాకు దిగారు. అయితే.. దాడులకు పాల్పడిన వైసీపీ నాయకులే అక్రమ కేసులంటూ ధర్నాకు దిగడం ఎంత వరకు సమంజసమంటూ టీడీపీ నాయకులు, స్థానికులు నిలదీశారు.

ఎమ్మెల్యే అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

నేమకల్లు, సంగాల గ్రామాల సంఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి సహా 34 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 16 మందిని పోలీసులు అరెస్టు చేసి ఆలూరు న్యాయాధికారి హేమ ఎదుట హాజరు పరిచారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు మండల ప్రజలు వైసీపీ కార్యకర్తలు ఆలూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. న్యాయాధికారి 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించడంతో విరుపాక్షి సహా 16 మందిని సబ్‌ జైలుకు తరలించారు. కాగా ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎమ్మెల్యే విరూపాక్షి దాడులను ప్రోత్సహించడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొని బీసీలు, దళితులపై పాల్పడటం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ ఆలూరు అంబేడ్కర్‌ సర్కిల్‌లో టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదలు చేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.

అక్రమంగా కేసు పెట్టారు: ఎమ్మెల్యే విరూపాక్షి

ఆలూరు: చిప్పగిరి మండలం నేమకల్‌, సంగాల గ్రామాల్లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేసి భారీ బందోబస్తు నడుమ పోలీసులు ప్రత్యేక వాహనంలో కర్నూలు సబ్‌జైలుకు తరలిస్తున్న సమయంలో ఆనయ మాట్లాడుతూ అక్రమంగా తనను ఈ కేసులో ఇరికించారని అన్నారు. కార్యకర్తలు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు రవిశంకర్‌రెడ్డి ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేశారు. దాడికి గురైన నక్కనదొడ్డి పల్లవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 191 క్లాస్‌ 2, 3, 109 క్లాస్‌ 1, 115 క్లాస్‌ 2, 79, 351 క్లాస్‌ 2 ఆర్‌/డబ్ల్యూ 190 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు కుమారుడు చంద్రశేఖర్‌, సోదరుడు శ్రీరాములతో మొత్తం 32 మందిపై కేసులు నమోదు చేసిన చిప్పగిరి పోలీసులు 16 మందిని ఆదివారం రాత్రి ఆలూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి హేమ వారిని 14 రోజులపాటు రిమాండ్‌కు ఆదేశించారు.

టీడీపీ నాయకులపై ఎమ్మెల్యే సోదరుడు ఫిర్యాదు

చిప్పగిరి మండలం నేమకల్‌ సంగాల గ్రామాల్లో శనివారం రాత్రి టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటనలో ఐదుగురు టీడీపీ నాయకులపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు వెంకటేష్‌ ఆదివారం చిప్పగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారి స్తున్నట్లు ఎస్‌ఐ నరసింహులు తెలిపారు.

Updated Date - Aug 03 , 2026 | 12:26 AM