Share News

అర్హులకు ఆసరాగా కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:49 PM

కర్నూలు నగరం వీకర్స్‌ సెక్షన్‌ కాలనీలో భర్తను కోల్పోయిన ఓ మహిళకు వితంతు పింఛన్‌ అసరాగా ఉంది.

అర్హులకు ఆసరాగా కూటమి ప్రభుత్వం
కొత్త పింఛన్లపై ఆశలు!

నేటి నుంచి కొత్త పింఛన్లకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

జిల్లాలో లక్ష మందికి పైగా కొత్తగా లబ్ధి చేకూరే అవకాశం

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

కర్నూలు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరం వీకర్స్‌ సెక్షన్‌ కాలనీలో భర్తను కోల్పోయిన ఓ మహిళకు వితంతు పింఛన్‌ అసరాగా ఉంది. సొంతిల్లు లేకపోవడంతో ఆమె ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఆ ఇంటి విద్యుత్‌ మీటర్‌కు ఆమె అధార్‌ అనుసంధానం కావడం, మూడు వందలకు పైగా యూనిట్లు విద్యుత్‌ వాడుతున్నారని గత వైసీపీ ప్రభుత్వం ఆమె పింఛన్‌ను రద్దు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ కనెక్షన్‌కు ఆధార్‌ నంబరు తీసేయించినా.. కొత్తగా దరఖాస్తుకు అవకాశం లేకపోవడంతో రెండేళ్లు పింఛన్‌ కోసం నిరీక్షించాల్సి వచ్చింది. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల దరఖాస్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆమె పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అభించింది. నేటి నుంచి అర్హులైన లబ్ధిదారుల నుంచి కొత్త పింఛన్‌కు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (ఎస్‌జీఎ్‌సడబ్ల్యూ) కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల పరిధిలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న ‘ఎన్టీర్‌ భరోసా పింఛన్‌ పథకం’ కింద వివిధ కేటగిరీల కింద దాదాపు దాదాపు 2.36 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. సామాజిక భద్రతలో భాగంగా వారికి నెలనెల ఒకటో తారీఖునే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులు ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకు ప్రతి నెల పింఛన్‌ రూ.200 మాత్రమే వచ్చేది. సీఎం చంద్రబాబు సారథ్యంలో కొలువుదీరిన టీడీపీ ప్రభుత్వం ఐదు రెట్లు పెంచి రూ.1,000 చేశారు. తరువాత రూ.2 వేలకు పెంచారు. 2019 ఎన్నికల ముందు పింఛన్‌ రూ.3 వేలకు పెంచుతానని స్పష్టమైన హామీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్‌ అధికారంలోకి వచ్చాక దశల వారిగా పెంచుకుంటూ పోతానంటూ మాయ చేశారు. 2024 ఎన్నికల ముందు వృద్ధాప్య పింఛన్‌ రూ.4 వేలు, దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచుతామని ‘సూపర్‌ సిక్స్‌’లో స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారం రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి చంద్రబాబు అధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పింఛన్‌ పెంచింది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, ట్రాన్స్‌జెండర్స్‌, జానపద/డప్పు కళాకారులు, ఎయిడ్స్‌ బాధితులకు రూ.4 వేలు, దివ్యాంగుల (సాధారణ దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు)కు రూ.6 వేలు, తీవ్ర వైకల్యం కలిగి మంచానికి, వీల్‌ ఛైర్‌కు పరిమితమైన బాధితులకు రూ.15 వేలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ అందిస్తున్నారు. నెలనెలా దాదాపుగా రూ.105 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఒకటో తారీఖునే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారు.

కొత్త వారికి అవకాశం:

అర్హత ఉండి వివిధ కారణాలు వల్ల పింఛన్‌ అందుకోని వారు జిల్లాలో దాదాపుగా లక్ష మందికిపైగా ఉన్నారు. వీరంతా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌కు దూరంగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో పింఛన్‌ కోల్పోయిన బాధితులు ఎందరో ఉన్నారు. వారందరికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. నేటి నుంచి 16వ తేది వరకు ఏడు రోజులు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ అకాశాన్ని సద్వినియోగం చేసుకొని సామాజిక భద్రత పొందాలని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 11:49 PM