పోలీసుశాఖలో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:19 PM
పోలీసుశాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సంతో్‌షకుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ నాయకుల ధర్నా
కర్నూలు ఎడ్యుకేషన్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీసుశాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సంతో్‌షకుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. ఖాళీగా ఉన్న పోలీసు పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయకుండా పదుల సంఖ్యలో నోటిఫికేషన్లతో సరిపెట్టడుతున్నారని అన్నారు. పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న 20వేల పోస్టుల్లో గానూ రాష్ట్ర డీజీపీ కోరిన ప్రకారం 11,639 పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టులు భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పంపుతున్నామని చెప్పారని, వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. అయితే కేవలం 2050 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగుల జేఏసీ నాయకులు నాగార్జున, మహబూబ్ బాషా, జిల్లా ఆఫీస్ బేరర్స్ హనుమేష్, భీసన్న, రాజు, రాజీవ్, జిల్లా సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.