బడ్జెట్‌లో ఇవన్నీ ఇవ్వాలి
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:08 PM
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ఏపీ బడ్జెట్-2026-27 అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లు
విశ్వవిద్యాలయాలకు రూ.39.5 కోట్లు
గ్రామీణ రోడ్లకు రూ.380 కోట్లు ఇవ్వాలి
కర్నూలు, ఆదోని మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి
నేడు అసెంబ్లీలో ఏపీ బడ్జెట్-2026-27 ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ఏపీ బడ్జెట్-2026-27 అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలుదీరిన తరువాత రెండో సంపూర్ణ బడ్జెట్ ఇది. ఉమ్మడి జిల్లా నుంచి వివిధ శాఖ అధికారులు ఇప్పటికే బడ్జెట్‌పై ప్రతిపాదనలు పంపారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.1,450 కోట్లు ఇవ్వాలని ఆ శాఖ అధికారులు జలవనరుల శాఖ ద్వారా ఆర్థిక శాఖకు పంపించారు. పద్దుల వారీగా అంకెల కూర్పు దాదాపుగా పూర్తయింది. వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అవుతుంది. ఈ తరువాత అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు టీజీ భరత్, ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా బడ్జెట్ కోసం వినతిపత్రాలు అందజేశారు. నిత్యం కరువు వలసలతో తల్లడిల్లే ఉమ్మడి కర్నూలు జిల్లాకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఆ వివరాపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, ఆంధ్రజ్యోతి
కరువు నేల తడవాలంటే రూ.1,420 కోట్లు ఇవ్వాలి
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ సాగునీటి వనరుల కింద 9.50 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, కాలువలకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలి. ఉమ్మడి జిల్లాలో ఆయా ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లు నిధులు అవసరం ఉంది. అందులో ప్రాజెక్టుల కోసం రూ.800 కోట్లు, భూ సేకరణకు రూ.200 కోట్లు, విద్యుత్తు బిల్లులు చెల్లింపుల కోసం రూ.150కోట్లు, హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని పత్తికొండ (పందికోన) జలాశయం, కుడి, ఎడమ కాలువల అసంపూర్తి పనులకు రూ.270 కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టులకు ముందుకు సాగాలంటే భూ సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. కరువు సీమలో సాగు జలాలు పరుగులు పెట్టాలంటే ఈ బడ్జెట్‌లో అవసరమైన మేరకు నిధులు ఇవ్వాలి.
విశ్వవిద్యాలయాలపై దృష్టి సారించాలి
జిల్లాలో ఆర్‌యూ, క్లస్టర్, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఉన్నాయి. రాయలసీమ వర్సిటీకి రూ.14.50 కోట్లు, క్లస్టర్ యూనివర్సిటీకి రూ.5 కోట్లు, ఉర్దూ వర్సిటీకి రూ.20 కోట్ల చొప్పున రూ.39.50 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మాణాలు పూర్తి చేయానికి రూ.16.5 కోట్లు అవసరం. జగన్నాథగట్టుపై 50.5 ఎకరాల్లో రూ.139 కోట్లతో చేపట్టిన క్లస్టర్ యూనివర్సిటీ శాశ్వత భవనాలు అసంపూర్తిగా ఉంటే, 192 ఎకరాల్లో రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల పునాదులతో వదిలేశారు. నిధులు ఇస్తేనే విద్యాలయాలు పురోగతి సాధిస్తాయి.
నిధుల దాహం తీరాలి:
ఉమ్మడి జిల్లాలో 804 పంచాయతీలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 3,39 లక్షలు, నంద్యాల జిల్లాలో 3.25 లక్షల జన నివాసాలు ఉన్నాయి. 25-30 శాతం ఇళ్లకు కూడా కుళాయి కనెక్షన్లు లేవు. జేజేఎం కింద కర్నూలు జిల్లాకు రూ.1,542 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.1,450 కోట్లకు పైగా నిధులు అవసరం ఉంది.
పల్లె రోడ్లపై దృష్టి పెట్టాలి:
ఏపీఆర్‌ఆర్‌ఎస్‌పీ పథకం కింద కర్నూలు జిల్లాలో 27 పనుల్లో 165 కిలో మీటర్ల రోడ్డు వేసేందుకు రూ.62.67 కోట్లు, నంద్యాల జిల్లాలో 46 పనుల్లో 178 కిలో మీటర్లు రోడ్లకు రూ.93.97 కోట్లు మంజూరు చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. నాబార్డు-29, నాబార్డు-30 కింద కర్నూలు జిల్లాలో 25 పనులకు రూ.78 కోట్లు, నంద్యాల జిల్లాలో 45 పనులకు రూ.146 కోట్లు కేటాయింపులు ఉన్నాయి. సకాలంలో ఈ బడ్జెట్‌లో నిధులు విడుదల చేయాలి. రోడ్డు భవనాలు శాఖ పర్యవేక్షణలోని కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు ప్రధాన రహదారిని కర్నూలు నుంచి ఆలూరు వరకు, కోడుమూరు-ఎమ్మిగనూరు వయా గోనెగండ్ల ప్రధాన రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలి. అసంపూర్తిగా ఉన్న కర్నూలు, ఆదోని మెడికల్ కాలేజీలకు నిధులు ఇవ్వాలి.
ప్రాజెక్టుల వారిగా ప్రతిపాదనలు రూ.కోట్లల్లో:
ప్రాజెక్టు ప్రతిపాదన
శ్రీశైలం ప్రాజెక్టు 100
టీబీపీ ఎల్లెల్సీ, వేదవతి, ఆర్డీఎస్ 300
కేసీ కాలువ 300
గాజులదిన్నె జలాశయం 40
అలగనూరు జలాశయం 25
గోరుకల్లు జలాశయం 35
భూ సేకరణకు 200
విద్యుత్తు బిల్లులు చెల్లింపులు 150
మొత్తం 1,150
హంద్రీనీవా పత్తికొండ జలాశయం 270
మొత్తం 1,420