Share News

నీళ్లన్నీ దిగువకు

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:46 PM

శ్రీశైలం జలాశయానికి రెండు నెలల క్రితం పైనుంచి వచ్చిన వరద నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి.

నీళ్లన్నీ దిగువకు
అక్టోబరులో తగ్గిపోయిన నీటినిల్వతో శ్రీశైలం రిజర్వాయర్‌

త్వరలో శ్రీశైలం జలాశయం ఖాళీ

ఆగని టీఎస్‌ జెన్కో విద్యుదుత్పత్తి

భవిష్యత్‌ అవసరాలు ప్రశ్నార్థకం

840 అడుగులకు చేరిన నీటి మట్టం

శ్రీశైలం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి రెండు నెలల క్రితం పైనుంచి వచ్చిన వరద నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఎడమగట్టు తెలంగాణ జల విద్యుతుత్పత్తి కేంద్రంలో నిత్యం వేల క్యూసెక్కులను వినియోగించి దిగువకు విడుదల చేస్తుండటంతో రిజర్వాయర్‌ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. రిజర్వాయర్‌పై ఆధారపడిన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాగు, తాగు నీటి అవసరాల కోసం కొద్ది కొద్దిగా వినియోగించుకోవలసిన కనీస బాధ్యతను కూడా విస్మరించిన జెన్కో కేఆర్‌ఎంబీ ఆదేశాలు నిబంధనలను పాటించకుండా ఇప్పటికీ విద్యుదుత్పత్తిని కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే రిజర్వాయర్‌ ఆధారిత ప్రాంత ప్రజల భవిష్యత్‌ అవసరాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా కుడిగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్పత్తిని నెల కిందే పూర్తిగా నిలిపివేశారు. శుక్రవారం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో 35,315 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 840.60 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 62.68 టీఎంసీల నీటినిల్వలు మాత్రమే ఉన్నట్లు నమోదయ్యింది.

Updated Date - Oct 16 , 2026 | 11:46 PM