Share News

చర్చలన్నీ నీటి చుట్టే

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:31 PM

ఉమ్మడి జిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు.

చర్చలన్నీ నీటి చుట్టే
మాట్లాడుతున్న కలెక్టర్‌ సిరి

పంటలు ఎండిపోతున్నాయని కొందరు..

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మరి కొందరు..

ఎల్‌నినో బాధిత ప్రజల తరపున ప్రజా ప్రతినిధుల ఆందోళన

ఉద్రిక్తంగా జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబర్‌ 17(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జలవనరుల శాఖల అంశాలపై సర్వసభ్యసమావేశం నిర్వహించారు. పదవీ కాలం ముగియనున్నందున జరిగిన చివరి సమావేశం ఎల్‌నినో నేపథ్యంలో తాగు, సాగు నీటి చుట్టూ జరిగింది. సభ్యుల వాదోపవాదాల ఉద్రిక్తతల నడమ జరిగిన ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లా కలెక్టర్లు డా.ఏ. సిరి, రాజకుమారి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, డీసీసీఎం చైర్మన్‌ నాగేశ్వరరావుయాదవ్‌, ఉమ్మడి జిల్లాల జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని 8 మండలాలు కోడుమూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, కౌతాళం, తుగ్గలి, నందవరం, కొలిమిగుండ్ల, నందికొట్కూరులో సుజల స్రవంతి కింద మదర్‌ ప్లాంట్లు రూ.14 కోట్లతో ఏర్పాటయ్యాయని అన్నారు. వాటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఉమ్మడి జిల్ల్లాలోని నీటిని నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో వినియోగించేందుకు రిజర్వాయర్ల నిర్మాణం అవసరమని చైర్మన్‌ పేర్కొన్నారు. అలాగే గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం 77 చెరువులకు నీరు నింపి ఉంటే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు.

జిల్లాలోని కేసీ కెనాల్‌, ఎస్‌ఆర్‌బీసీలకు నీటి వాటాలు ఉన్నప్పటికీ నీటిని వదులుకోలేని పరిస్థితిలో ఉన్నామని, ఎలాంటి వాటా లేని వెలుగొండకు సుమారు 4 టీఎంసీల నీటిని ఏ విధంగా వదిలారని చైర్మన్‌ అధికారులను ప్రశ్నించారు. కర్నూలు జిల్లా రైతులు అధికారులకు కనబడలేది అని అన్నారు. కృష్ణానది ద్వారా ప్రతి సంవత్సరం కూడ యావరేజ్‌గా సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 540 టీఎంసీల నీరు సముద్రలోకి వృథాగా పోతుందన్నారు. ఈ 540 టీఎంసీలలో కర్నూలు, నంద్యాలకు 100 టీఎంసీలు ఉపయోగించుకునే విధంగా రిజర్వాయర్లు నిర్మించుకోవాలన్నారు. దీని వల్ల భవిష్యత్తులో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఉమ్మడి జిల్లాలో 77 చెరువులను పూర్తిస్థాయిలో నింపుకుంటే జూలై వరకు కూడ తాగునీటి ఎద్దడి రాదన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో తాగునీటి కొతర తీవ్రంగా ఉన్నందున పైప్‌లైన్ల లీకేజీలను తక్షణమే గుర్తించి మరమ్మతు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఎమ్మెల్యే వర్సెస్‌ వైసీపీ ఎమ్మెల్యే, జడ్పీటీసీల మాటల యుద్ధం

సర్వసభ్య సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి, జడ్పీటీసీలకు మాటల యుద్ధం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఆదోని ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంపై కావాలనే వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు దీంతో జడ్పీటీసీలు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు తగదని జడ్పీటీసీలు హితవు పలికారు. తనకు సభలో మాట్లాడే హక్కు ఉందని ఆదోని ఎమ్మెల్యే అన్నారు. భారత ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలపాలనే తీర్మానం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇంతలో చైర్మన్‌ కలగజేసుకుని ప్రస్తుతం వ్యవసాయ శాఖపై చర్చజరుగుతుందని దాని గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలేగాని ప్రధాని జన్మదినం గురించి తరువాత మాట్లాడుకుందామని ఎమ్మెల్యేని సముదాయించారు. అయినా ఆయన వినకపోవడంతో పెద్ద రభసా జరిగింది. శాఖల పని తీరుపై సమావేశంలో సలహాలు, సూచనలు ఇవ్వాలని చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి కలగజేసుకున్నారు. దీంతో చైర్మన్‌కు ఎమ్మెల్యేకు కాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆస్సరి జడ్పీటీసీ దొరబాబు కలగజేసుకుని మీకు అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంది...మాకు కేవలం మూడు నెలలకు మాత్రమే ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఇంతలో దొరబాబుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదోని ఎమ్మెల్యే చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. సభా హక్కులను వైసీపీ జడ్పీటీసీలు ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్యే వాదించారు. దీంతో జడ్పీటీసీలంతా ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతలో చైర్మన్‌ కలగజేసుకుని సభలో ఎలాంటి వాదోపవాదాలు జరగకుండా సవ్యంగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం: డా.ఏ. సిరి, కర్నూలు కలెక్టర్‌

ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నా సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నాము. రైతులకు పంటల బీమా పరిహారం అందించేందుకు నిర్దేశించిన ప్రకారం నివేదికలు సమర్పిస్తున్నాం. పశుగ్రాసం సాగుతో పాటు పంట బీమా, పీఎండీఎస్‌ కార్యక్రమాలను కూడ అమలు చేస్తున్నాం. పైప్‌లైన్‌ మరమ్మతులు, లీకేజీల సమస్యలు 48 గంటల్లో పరిష్కరించాలి. ఎల్‌ఎల్‌సీ నీటితో ఎస్‌ఎస్‌ ట్యాంకులను నింపుతున్నాం. హంద్రీనీవా నీటితో 77 చెరువులను నింపుతున్నాం. వేదవతి ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 600 ఎకరాలకు అపార్డు పాస్‌ చేసి, ఇందు కోసం రూ.54 కోట్లకు పైగా పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాం.

ఈ క్రాప్‌లో నమోదు చేయించుకొనేలా చర్యలు: రాజకుమారి, నంద్యాల కలెక్టర్‌

ప్రతి రైతు పంటలను ఈ క్రాప్‌లో నమోదు చేయించుకునేలా చర్యలు చేపడుతున్నాం. శ్రీశైలం జలాశయంలో నీర తక్కువగా ఉండటంతో ప్రస్తుతం పరిస్థితుల్లో సాగు పంటలకు నీరు అందించే అవకాశం లేదు. అయితే తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్‌ ద్వారా నీరు అందిస్తున్నాం. జిల్లాలో సాగవుతున్న పంటల విస్తీర్ణం తదితర వివరాలను ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. డోన్‌ వాటర్‌ గ్రిడ్‌ ద్వారా 138 గ్రామాలకు తాగునీరు అందించేలా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 90 గ్రామాలకు నీరు అందిస్తున్నాం.

కరువు జిల్లాలుగా ప్రకటించాలి..బస్తిపాటి నాగరాజు, కర్నూలు ఎంపీ

ఎల్‌నీవో ప్రభావానికి తీవ్రంగా గురైన కర్నూలు, నంద్యాల జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలి. ఎల్‌నీవో ప్రభావం కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. జాబ్‌కార్డులు పెంచాలి. హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్‌ నుంచి అవకాశం ఉంటే చిన్న చిన్న చెరువులను నింపాలి.

ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు: పార్థసారథి, ఆదోని ఎమ్మెల్యే

ఎల్‌నినో ప్రభావంతో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి వైసీపీ జడ్పీటీసీలు, చైర్మన్‌ కావాలనే కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఈ విషయాన్ని తెలిసి కూడా జడ్పీటీసీలు కావాలనే రైతులు, ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జడ్పీటీసీలు అడిగిన సమస్యలను అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కరించే విధంగా కృషి చేయాలి.

గ్రామాల్లో శానిటేషన్‌ సిబ్బంది రావడం లేదు...మాన్వి దేవేంద్రప్ప, కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌

ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. అయితే దీనిని పరిష్కరించడానికి పంచాయతీ కార్యదర్శులు, శానిటేషన్‌ సిబ్బంది గ్రామాలకు రావడం లేదు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ పెద్ద హరివాణం, చిన్న హరివాణాలను తాగునీటి కోసం రూ. 5 కోట్లు మంజూరు చేశారు. పశువులకు నీరు అందించి వాటి దాహం తీర్చాలి.

డీసీఎంఎస్‌ ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తున్నాం: నాగేశ్వరరావుయాదవ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌

డోన్‌ నియోజకవర్గంలో ప్యాపిలి మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి. గ్రామాలలో చెరువులను నింపితే భూగర్భజలాలు పెరుగుతాయి. డోన్‌ ప్రాజెక్టు పనులను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కేఈ. క్రిష్ణమూర్తి హయాంలో ప్రారంభించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన అనంతరం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.

నిబంధనలు పాటించని ఎంపీపీ

జిల్లా పరిషత్‌ సర్వసభ్యసమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉంటారు. దీనిని అనేక నిబంధనలు ఉంటాయి. మండలాల సమస్యలను మాత్రమే సభ దృష్టికి తీసుకురావాలి. సమావేశాలకు సభ్యులు తమ బంధువులను తీసుకురాకూడదనే నిబంధన ఉంది. అయితే గురువారం జరిగిన సర్వ సభ్య సమావేశానికి దేవనకొండ ఎంపీపీ లక్ష్మీదేవి తన భర్తను తీసుకువచ్చారు. ఆయన మండల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

నీళ్లివ్వండి...మహాప్రభో... తాగునీటిపై జడ్పీటీసీల ఆందోళన..

ఉమ్మడి జిల్లాలోని కొన్ని గ్రామాలలో తాగునీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పశ్చిమ ప్రాంతంలోని కొన్ని మండలాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. దగ్గరలోనే నీరు ఉన్నా వాడుకోలేని పరిస్థితి నెలకొంది. కొన్నిమండలాల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మాణం చేపట్టాలని...ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలని జడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. డోన్‌, ఓర్వకల్లు, సి.బెళగల్‌, కోడుమూరు, తుగ్గలి, కొత్తపల్లి, వెల్దుర్తి, హాలహర్వి, దొర్నిపాడు, ఆస్పరి, మద్దికెర, మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందని జడ్పీటీసీలు చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఓర్వకల్లు, డోన్‌, ప్యాపిలి, దేవనకొండ, వెల్దుర్తి మండలాల్లో చెరువులను నింపాలని జడ్పీటీసీలు కోరారు.

ఐదు తీర్మానాలు..

కర్నూలు, నంద్యాల జిలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఉమ్మడి జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలి.

వీబీజీ రాంజీ పనిదినాలు పెంచాలి

కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని, పంటల బీమా పథకాన్ని వర్తింప చేయాలి, బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వాలి.

కర్నూలు, నంద్యాల జిల్లాలో తాగునీటి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి

శ్రీశైలం, గోరుకల్లు ఇతర ప్రాజెక్టులలో భూముల కోల్పోయిన రైతులకు జీఓనెం.98 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈఓ జి. సుధాకర్‌రెడ్డి, జడ్పీ డిప్యూటీ వెంకటసుబ్బారెడ్డి, జడ్పీటీసీ, ఎంపీపీలు, జడ్పీ పరిపాలన అధికారులు జితేంద్ర, మురళీమోహన్‌రెడ్డి, బసవశేఖర్‌, సరస్వతమ్మ, సి.రాంగోపాల్‌ పాల్గొన్నారు.

గురువారం ఉదయం జడ్పీ మినీ సమావేశభవనంలో 1వ స్థాయి సంఘ సమావేశం జరిగింది. అభివృద్ధికి సంబంధించి జడ్పీటీసీ సభ్యులు సుమారు రూ.6 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపారు.

Updated Date - Sep 17 , 2026 | 11:31 PM