Share News

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా..

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:59 PM

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా..

కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

పారిశ్రామిక ప్రగతి, ఉద్యాన సాగుకు ప్రాధాన్యత

సదస్సుకు హాజరైన మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌, ఎస్పీ

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ అమరావతి సచివాలయంలో జరిగింది. మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హాజరయ్యారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు, సంక్షేమం, అభివృద్ధి అమలు తీరుపై సమీక్షించారు. అదే క్రమంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల ద్వారా ఆదాయార్జన, ప్రగతి పనుల తీరుపై చర్చించారు. కరువు, వలసలకు నిలయమైన కర్నూలు జిల్లాలో పారిశ్రామిక ప్రగతి, ఉద్యానవన పంట సాగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆ దిశగా పక్కా ప్రణాళికతో వెళ్లాలని సూచించారు. గతేడాదిలో పోలిస్తే జీఎస్టీ, ఇతర పన్నులు రాబడి వృద్ధి సాధించింది. వివిధ అంశాలపై ప్రభుత్వం విడుదల చేసిన నివేదికపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

కర్నూలు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి)

వేసవిలో నీటి సమస్యపై...

వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగ నూరు మున్సిపల్‌ పట్టణాలు, గూడూరు నగర పంచాయతీలు ఉన్నాయి. వేసవి నీటి ఎద్దడి తలెత్తకుండా తాగునీటి సరఫరాకు తాత్కాలికంగా 76 బోరు బావులను గుర్తించారు. 60 ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. 49 బోర్లు ఫ్లషింగ్‌. 55 బోర్లు మరమ్మ తులు చేశారు. దాదాపు రూ.3.44 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అధిక వర్షాలు వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. మార్చి ఒకటో తేది నాటికి 20.31 టీఎంసీలు భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి.

అంగన్‌వాడీ సేవలు మెరుగుపడాలి

జిల్లాలో అంగన్‌వాడి కేంద్రాలు ద్వారా స్త్రీశిశు సంక్షేమ శాఖ గర్భిణీలు, బాలింతలు, ఐదేళ్లలోపు పిల్లలకు అందించే సేవలు పర్వాలేదు అంటూ ప్రజలు సర్వేలో వెల్లడించారు. గర్భిణీలు, బాలింతలకు పాలు, గుడ్లు, పోషక కిట్లు అందుతున్నాయా..? అంటే 76.9 శాతం అవునని, 23.1 శాతం లేదని, నాణ్యతపై 75.6 శాతం బాగుందని, 24.4 శాతం బాగోలేదని సమాధానం ఇచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచే ఉంటారా..? అంటే 64.6 శాతం మాత్రమే తెరిచే ఉంచుతున్నారంటే, 35.4 శాతం లేదని తెలిపారు. అంటే.. అంగన్‌వాడి సేవలు మెరుగు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పన్నులు వసూళ్లలో వెనకబాటు

జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగ నూరు మున్సిపా లిటీలు, గూడూరు నగర పంచా యతీలో వివిధ పనులు వసూళ్ల ఆశించిన స్థాయిలో జరగలేదు. ఆస్థి పన్ను రూ.105.12కోట్లు లక్ష్యం కాగా రూ.69.07 కోట్లు వసూలు చేశారు. నీటి పన్ను రూ.39.07 కోట్లకు గానూ 10.35శాతం వసూలుచేశారు. పంచాయతీల్లో కొంత ఫర్వాలేదు అని పిస్తుంది.

ఉగాదికి 7,949 గృహ ప్రవేశాలు

జిల్లాలో ఉగాది పర్వదినం రోజున 7,949 పక్కా ఇళ్లు నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 7,711 ఇళ్లు పూర్తి చేశారు. 238 ఇళ్లు పూర్తి దశలో ఉన్నాయి. వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం

కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాసు పుస్తకాలు (పీపీబీ) పంపిణీలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. జిల్లాలో 256 గ్రామాల్లో రీ-సర్వే పూర్తిచేశారు. 1,91,366 పాసు పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా 90,070 మాత్రమే రైతులకు పంపిణీ చేశారు.

‘పల్లె’సీమల ‘పండుగ’

‘పల్లె పండుగ’లో గ్రామాల్లో వివిధ సౌకర్యాలు కల్పనలో ముందున్నారు. 400 పశుశుల నీటి తొట్టెలు నిర్మాణం లక్ష్యం, 420 నిర్మించి 105 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. 585 గోకుల షెడ్లకు గానూ 566 నిర్మించారు. 4,500 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు లక్ష్యంగా కాగా 4,140 ఎకరాల్లో సాగు చేపట్టి 92 శాతం లక్ష్యం చేరుకున్నారు. ఫారం పాండ్స్‌ 4 వేలు నిర్మించాలని లక్ష్యం కాగా 3,630 నిర్మించారు. పల్లె ప్రగతి బాగుందంటూ సీఎం కితాబు ఇచ్చారు.

Updated Date - Mar 12 , 2026 | 11:59 PM