Share News

ఏఐ...ఆరోగ్య సంజీవని

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:31 PM

ఏఐ...ఆరోగ్య సంజీవని

 ఏఐ...ఆరోగ్య సంజీవని
ఆస్పరి ప్రాథమిక ఆర్యోగ కేంద్రం

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా డిజిటల్‌ వ్యవస్థ

పౌరుల అనారోగ్య వివరాలన్నీ నిక్షిప్తం

వైద్యులకు అందుబాటులో రోగుల వివరాలు

కుప్పంలో పైలెట్‌ ప్రాజెక్టు..

25న ఆస్పరి పీహెచ్‌సీలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు

సంజీవని.. ప్రజలకు వైద్య సేవలను సమర్థవంతంగా అందిందించే ఏఐ ఆధారిత డిజిటల్‌ ఆరోగ్య వ్యవస్థ. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, రోగ నిర్ధారణ నుంచి కోలుకునే వరకూ నిరంతర పర్యవేక్షణ, ముందస్తు పరీక్షలతో వ్యాధి తీవ్రత, వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం దీని ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 25వ తేదీ ఆస్పరి ప్రాథమిక ఆర్యోగ కేంద్రంలో ప్రారంభించ నున్నారు. ఈ నేపథ్యంలో సంజీవని ప్రాజెక్టు లక్ష్యం, ఆస్పరి పీహెచ్‌సీలో వేధిస్తున్న సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 91 పీహెచ్‌సీలు, రెండు ప్రభుత్వ సర్వజన వైద్యశాలు, మూడు ప్రాంతీయ ఆస్పత్రులు, 46 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 23 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 797 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్కుల్లో సంజీవని ప్రాజెక్టు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని సంస్కరించాలి.. వైద్య, ఆర్యోగ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి.. ఇందు కోసం పెద్దఎత్తున సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రజా ఆర్యోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రజలందరి అనారోగ్య వివరాలన్నింటినీ డిజిటల్‌ రికార్డుల రూపంలో నిక్షిప్తం చేసి, మెరుగైన, నాణ్యమైన ఆర్యోగ సేవలు అందించాలనే లక్ష్యంతో ‘సంజీవని ప్రాజెక్టు’కు రూపకల్పన చేశారు. టాటా డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ ద్వారా ఆ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. కుప్పం లో పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును దశలవారిగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 33 మండలాల్లోని ప్రాంతీయ ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) సహా 66 ప్రాథమిక ఆర్యోగ కేంరద్రాలు (పీహెచ్‌సీ), 484 విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లలో సంజీవని సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు ఆరవ విడత కార్యక్రమాన్ని ఈ నెల 25న ఆస్పరి పీహెచ్‌సీలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో అన్ని పీహెచ్‌సీల్లో టాటా డిజిటల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తారని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.

ఆరో విడత ఆస్పరిలో ప్రారంభం

సంజీవని ప్రాజెక్టును కుప్పంలో పైలెట్‌ ప్రాజెక్టుగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పటికే ఐదు విడతలుగా రాష్ట్రంలో విస్తరించారు. ఈ ప్రాజెక్టు ఆరో విడత కార్యక్రమాన్ని ఈ నెల 25న ఆలూరు నియోజకవర్గం ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఎం చంద్రబాబు ప్రారం భిస్తారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కామేశ్వర్‌ ప్రసాద్‌ ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.

సంజీవని ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు

ఇంటి వద్దకే వైద్య పరీక్షలు: ప్రజలు ల్యాబ్‌లకు వెళ్లే అవసరం లేకుండా నేరుగా ఇంటి వద్దే 42 నుంచి 74 రకాల వరదకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడే రిపోర్టులు అందజేయడంతో పాటు డిజిటలైజ్‌ చేస్తారు.

డిజిటల్‌ హెల్త్‌ ఫ్రొఫైల్స్‌: రాష్ట్రంలో 5.20 కోట్ల మందికి సమగ్ర డిజిటల్‌ హెల్త్‌ కార్డులు, రికార్డులు తయారుచేసి వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు.

ఏఐ సేవలు: ఏఐ సాంకేతికత ద్వారా ప్రజలు తమ ఇళ్ల నుంచే వర్చువల్‌గా వైద్య సల హాలు, సంప్రదింపులు పొందే అవకాశం ఉంది.

ముందస్తు వ్యాధి నిర్ధారణ: మధుమేహం (షుగర్‌), రక్తపోటు (బీపీ), గుండె సంబంధించిన సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాపాయం తప్పించడం.

డిజిటల్‌ రికార్డుల్లో సంక్షిప్తం: పరీక్షలు చేయించుకున్న ప్రతి పౌరుడి వివరాలను ఆధార్‌ లేదా హెల్త్‌ ఐడీ ఆధారంగా ‘సంజీవని సిటిజన్‌ వెల్‌నెస్‌ యాప్‌’ లేదా డిజిటల్‌ రికార్డుల్లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ అమలు చేసి ఉచిత వైద్య భద్రత కల్పించడం.

34,050 జనాభాకు ఏకైక పీహెచ్‌సీ ఇది

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 24న సంజీవని ప్రాజెక్టు ఆరో విడత కార్యక్రమాన్ని ప్రారంభించే ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (24 గంటలు పని చేసే కేంద్రం)ను పరిశీలిస్తే ఎన్నో సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఈ పీహెచ్‌సీలో వైద్య అధికారులు, ఆరుగురు స్టాఫ్‌ నర్సులు సహా నలుగురు సిబ్బంది పని చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారు. 24 గంటలు అత్యవసర వైద్యం, కాన్పులు వంటి సేవలు అందిస్తారు. రోజు సరాసరి 70-100 మంది ఓపీ, ప్రతి నెల సరాసరి 32-40 వరకు కాన్పులు (డెలివరీలు) జరుగుతాయని వైద్య అధికారి డాక్టర్‌ దుర్గాబాయి తెలిపారు. మండలంలోని 33 గ్రామాలు, 34,050 జనాభాకు ఉన్న ఆరు బెడ్స్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. గతంలో పాలకులు పట్టించుకోకపోవడం, జిల్లా యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో పలు సమస్యలు, సౌకర్యాల కొరత వెంటాడుతోంది.

తిష్టవేసిన సమస్యలు ఇవి:

ఆస్పరి పీహెచ్‌సీలో తాగునీటి సమస్య వేధిస్తోంది. బోరు ఉన్నా మరమ్మతులు కారణంగా పని చేయడం లేదు. నీటి కోసం వైద్యులు, రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. బోరును మరమ్మతులు చేయించి 24 గంటలు నీటి సరఫరా ఉండేలా చూడాలి. అర్థరాత్రి కాన్పు కోసం గర్భిణిలు వస్తే నీళ్లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని అక్కడి సిబ్బంది వాపోతున్నారు.

లేబర్‌, కాన్పులు, ఆఫరేషన్‌ థియేటర్‌ (ఓటీ)లకు ప్రత్యేక గదులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. అదనంగా మూడు గదులు నిర్మించాలని కోరుతున్నారు.

ప్రస్తుతం ఆరు బెడ్స్‌ మాత్రమే ఉన్నాయి. అవి కూడా సక్రమంగా లేవు. బెడ్స్‌ మెత్తపడిపోయాయి. కనీసం 10-15 బెడ్స్‌ ఏర్పాటు చేయాలని, ఆ బెడ్స్‌ కూడా ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో ఉండే బెడ్స్‌ వంటిని ఏర్పాటు చేయాలి.

రాత్రి విధులు నిర్వర్తించే వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు, సాఫ్ట్‌ సర్సులకు ప్రత్యేక క్వార్టర్లు నిర్మించాలి.

అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఆక్సిజన్‌, వెంటిలేషన్‌ సౌకర్యంతో పాటుగా అవసరమైన మేరకు అత్యవసర మందులు సరఫరా చేయాల్సి ఉంది.

సీఎం చంద్రబాబు పర్యటనకు ముందే కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి, జిల్లా యంత్రాంగం బోరు మరమ్మతులు చేయించడంతో పాటు ఆధునాతన సౌకర్యాలతో కూడిన నూతన బెడ్స్‌ ఏర్పాటు చేయాలి. 24న ఆస్పరి పీహెచ్‌సీకి రానున్న సీఎం చంద్రబాబు సమస్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఆస్పత్రుల వివరాలు:

వివరాలు కర్నూలు నంద్యాల

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 35 56

24 గంటలు పని చేసే సీహెచ్‌సీలు 35 52

ప్రభుత్వ సర్వజన వైద్యశాల 1 1

ప్రాంతీయ ఆస్పత్రులు 1 2

సామాజిక ఆరోగ్య కేంద్రాలు 12 11

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు 28 19

విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లు 428 369

పకడ్బందీ ఏర్పాటు చేయాలి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25వ తేదీన ఆలూరు నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమాన్ని జూలై 25న ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం బహిరంగ సభ పార్టీ క్యాడర్‌ సమావేశం కూడా నిర్వహించనున్నారన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

ఆస్పరి, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఈనెల 25న ఆస్పరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను బుధవారం ఆర్డీవో ఓబులేష్‌, డీఎంహెచ్‌వో కామేశ్వరప్రసాద్‌ పరిశీలించారు. వారు మాట్లాడుతూ సంజీవిని ప్రోగ్రాం ప్రారంభించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు వారు తెలిపారు. స్థానిక పీహెచ్‌సీలో ప్రజలకు అందుతున్న సేవలు వసతులు అందుబాటులో ఉన్న మందుల వివరాలను ఆరోగ్య సిబ్బందిని అడిగా తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోపం జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఆర్డీవో హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. వీరి వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో భాస్కర్‌, డీపీఎంవో శైలేష్‌, వైద్యులు రఘురామ్‌రెడ్డి, బాలకృష్ణ, దుర్గాభాయి, టీడీపీ నాయకులు కృష్ణయాదవ్‌, నరసప్ప, సంజన్న, రాఘవేంద్ర, అంపయ్య, సుదర్శన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 11:31 PM