Share News

వైసీపీ కబ్జాలో అహోబిలం

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:28 PM

అహోబిలంలో వైసీపీ నాయకుల భూ కబ్జాల దందా బట్టబయలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడ్డారు.

వైసీపీ కబ్జాలో అహోబిలం
తెలుగు గంగ కాలువ గట్టు పై వైసీపీ నాయకుడు నిర్మించిన లాడ్జీలు

అటవీ, దేవదాయ, నీటిపారుదల భూముల్లో అక్రమ నిర్మాణాలు

కాలువను ఆక్రమించి బహుళ అంతస్తుల లాడ్జీలు

రూ. 15 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాల ఆక్రమణ

ఏమీ పట్టని పంచాయతీ అధికారులు

అహోబిలంలో వైసీపీ నాయకుల భూ కబ్జాల దందా బట్టబయలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడ్డారు. వీరికి అప్పటి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల కట్టడాలను నిర్మించినా అధికారులు నోరు మెదపలేదు. గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతి లేకుండా నిర్మించిన వందకు పైగా లాడ్జీలు, హోటళ్లలో ఎక్కువ వైసీపీ నాయకులవే. గ్రామ పంచాయతీ పరిధిలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలంటే హుడా అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ వైసీపీ నాయకులు ఇవేవీ పట్టించుకోలేదు. దొరస్వామి తిప్పపై ఓ వైసీపీ నాయకుడు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమించుకొని దర్జాగా మామిడి చెట్లు పెంచుకుంటున్నాడు. మరో ఓ వైసీపీ నాయకుడు ఆహోబిల క్షేత్రంలోని కోనేరులకు నీరు సరఫరా చేసే కాల్వను మూసి వేసి మూడు అంతస్తుల లాడ్జిని నిర్మించాడు.

ఆళ్లగడ్డ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయంలో అహోబిల క్షేత్రంలో ఆ పార్టీ నాయ కులు, వారి అనుచరులు పంచాయతీ, ప్రభుత్వ స్ధలాలను కబ్జా చేశారు. మఠం వారి చెరువు నుండి అహోబిలంలోని కోనేరులకు నీరు సర ఫరా చేసేందుకు అప్పట్లో కాలువను నిర్మించారు. కోనేరులతోపాటు ఆలయ పరిధిలోని కొంత మంది రైతులకు సాగు నీరు కూడా ఈ కాలువ అందించేది. అయితే ఈ కాలువపై ఓ వైసీపీ నాయకుడు మూడంతస్తుల లాడ్జీని నిర్మించాడు. ఈ బహుళ అంతస్తుల భవనానికి ‘కుడా’ నుంచి అనుమతి తీసుకోలేదు. మైనర్‌ ఇరిగేషన్‌ స్థలంలో అక్రమంగా భారీ భవంతి నిర్మించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

తెలుగు గంగ కరకట్టపై విలాసవంతమైన భవనాలు

అహోబిలం ఇందిరమ్మ కాలనీ పరిధిలోని తెలుగు గంగ కాలువ కరకట్టను ఓ వైసీపీ నాయకుడు అక్రమించుకొని ఏడు విలాసవంతమైన భవనాలు నిర్మించాడు. వాటిని అన్ని హంగులతో లాడ్జీలుగా మార్చాడు. అయితే తెలుగుగంగ కాలువ కట్టపై అక్రమ నిర్మాణాలు చేపట్టినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకుఽ తావిస్తోంది. అలాగే క్రిష్ణాపురం నుంచి అహోబిలం దేవస్థానానికి వచ్చే రహదారిలో గ్రామ కంఠానికి చెందిన ఎకరా స్థలాన్ని కబ్జా చేసి కళ్యాణ మండ పం నిర్మాణానికి పునాది కూడా వేశారు. అయితే ఈ వ్యవహారంలో కొందరు కోర్టును ఆశ్రయించడంతో నిర్మాణ పనులు నిలిచి పోయాయి. ఈ అక్రమ కట్టడాల వ్యవహారంలో కింది నుండి పై స్థాయి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే అధికారులు వీటిపై చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

గర్భగుడి గోపురం కంటే ఎత్తుగా నిర్మాణాలు

అహోబిలం ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో గర్భ గుడి గోపురం కంటే ఎత్తుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ నిబంధనలు ఇక్కడ అమలు కావడం లేదు. నిరుపేద గిరిజనులకు నివాస గృహాల కోసం ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టాలను సైతం కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. దేవస్ధానం చూట్టు వందకు పైగా హోటళ్లను నిర్మించి ఏసీ, నాన్‌ ఏసీ బోర్డులు పెట్టి లాడ్జీలు నిర్మించారు. వీటికి విద్యుత్‌ శాఖ అధికారులు ప్రత్యేక విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేసి ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చి మీటర్లు బిగించారు. ఈ పనులకు కూడా రూ. లక్షల్లో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాలన్నింటికీ గ్రామ పంచాయతీ నుంచే తాగునీరు అందిస్తున్నారు. పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. . అయితే ఈ భవనాల యజమానులు ఉచిత సేవలు పొందడమే తప్ప పంచాయతీకి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. వైసీపీ నాయకుల అండదండలతో పంచాయతీ, అటవీ, దేవస్థానం, ఇరిగేషన్‌ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఖాళీ జాగా కనిపించిందా? వేసెయ్‌ పాగా

ఎగువ అహోబిలం క్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఓ వైసీపీ నాయకుడు ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా పాగా వేసేస్తున్నాడు. ప్రతి శనివారం పండగలు ఇతర ప్రత్యేక రోజులలో ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహస్వామి, అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా వస్తుంటారు. దీన్ని అసరాగా చేసుకొని ఈ రహదారి వెంట పంచాయతీ స్ధలాన్ని కొందరు అక్రమించుకొన్నారు. ఈ స్ధలాల్లో వ్యాపార సముదాయానికి సంబంధించిన రేకుల షెడ్లును నిర్మించు కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పంచాయతీ స్ధలంలో అక్రమ ణలు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

పేదల ఇండ్లను లాడ్జీలుగా మార్చి

అహోబిల క్షేత్రం పరిధిలో ఓ నిరుపేదలకు ఇంటి స్ధలాన్ని ఇచ్చి ఇం టి నిర్మాణాన్ని చేపట్టింది. అయితే ఓ వ్యక్తి ఈ ఇంటిని కొనుగోలు చేసి లాడ్జీ కం హోటల్‌గా మార్చి వ్యాపారం చేస్తున్నాడు. తమిళనాడుకు చెంది న చాలా మంది ఇలా ఇండ్లను కొని అక్రమంగా లాడ్జీలను ఏర్పా టు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికా రులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

పదేళ్లయినా అమలు కాని మాస్టర్‌ ప్లాన్‌

అహోబిలం క్షేత్రంలో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా వస్తుంటారు. ఇందుకు అనుగుణంగా పది సంవత్సరాల కిందట పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేశారు. అహోబిలంలో పండగలు, బ్రహ్మోత్సవాలు, వారాంతాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్వామి ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పలు అభివృద్ధి పనులు చేపట్టాలని మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేశారు. ఈ ప్లాన్‌ అమలుకు దేవస్థానం పరిధిలో 210 సర్వే నంబర్‌లో ఉన్న వారిని ఖాళీ చేయించడంతోపాటు దేవస్ధానం పురాతన మండపాలను తొలగించి వసతి గృహాలు, కాటేజీలు, టికెట్‌ కౌంటర్లు ఉద్యానవనాలు నిర్మించాలని మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేశారు. అయితే ఇంతవరకు ఈ ప్లాన్‌ అమలు కాకపోవడంతో ఆలయ పరిధిలో అక్రమణలు పెరిగిపోయాయి.

చర్యలు తీసుకుంటాం

పంచాయతీ పరిధిలో ఎలాంటి నిర్మాణానికైనా పంచాయ తీ అనుమతి తప్పని సరి. పంచాయతీ పరిధిలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు లేవు. అలాగే మరి కొన్ని నిర్మాణాలు అటవీ, రెవెన్యూ, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారుల పరిధిలో ఉన్నాయి. అలా కాకుండా పంచాయతీ అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం

-సుదర్శన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి(అహోబిలం)

Updated Date - Jul 17 , 2026 | 11:28 PM