14 ఏళ్ల తర్వాత...
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:20 PM
స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగానే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
త్వరలో సహకార సంఘాల ఎన్నికలు
14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ..
2 లక్షల మంది రైతులకు సభ్యత్వం
ఈకేవైసీ వేగవంతం చేస్తున్నాం - డీసీవో షర్మిల
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగానే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఆ సంఘాల్లో సభ్యులైన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పరిధిలో దాదాపు 2 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో 43 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో 76,066 మంది సభ్యులుగా ఉన్నారు. నంద్యాల జిల్లాలోని 56 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో 1.20 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ సభ్యులుగా ఉన్న రైతులతో ఈకేవైసీ చేయించేందుకు సంబంధిత సంఘాల సీఈవోలు చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా సభ్యులను చేర్చే విషయంలో గ్రామాల్లోని రైతులకు సీఈవోలు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఒక్కో సంఘం పరిధిలో ఏటా రూ.కోటి దాకా పంట రుణాలు, అదే విధంగా రూ.కోటి నుంచి రూ.3 కోట్ల దాకా దీర్ఘకాలిక రుణాలను రైతులకు అందిస్తుండటంతో సంఘాల్లోని పాలకవర్గాలకు ప్రాధాన్యత ఉంది. ఈ ఎన్నికలో చైర్మన్లతో పాటు డైరెక్టర్లుగా ఎన్నికైతే తమకు పరపతి పెరుగుతుందనే ఆలోచనతో గ్రామాల్లోని చోటామోటా నేతలు ఈ పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేస్తోంది. కొద్దిరోజుల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు కూడా పూర్తి కావస్తుండటంతో ఇక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించింది. దీనికి సంబందించి జిల్లా సహకార శాఖ యంత్రాంగానికి సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ గత శనివారం మెమో జారీ చేశారు. గ్రామస్థాయిలో సహకార రంగంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా సహకార సంఘాలు పెద్ద తరహా ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘంతో పాటు రాష్ట్ర స్థాయిలో సహకార బ్యాంకులు ఉన్నాయి. సహకార సంఘాల అధ్యక్షులు సభ్యులుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, అలాగే డీసీఎంఎస్ పాలకవర్గాలను, డీసీసీబీ అధ్యక్షుడు, సభ్యులుగా రాష్ట్రస్థాయిలోని ఆప్కాబ్ పాలకవర్గాలను ఎన్నుకునే విధానంలో ఇక ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల వారీగానే డీసీసీబీ, డీసీఎంఎ్సలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలోని సహకార సంఘాలకు చివరిసారిగా 2013 జనవరిలో ఎన్నికలు జరిగాయి. పాలకవర్గాల గడువు 2018 జనవరితోనే ముగిసిపోవడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏడాదిన్నర పాటు ఆ పాలకవర్గాలనే కొనసాగించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికలపై ఏ మాత్రం శ్రద్ధ్ద తీసుకోలేదు. ఐదేళ్ల పాలన ముగిసే వరకు ఎమ్మెల్యేల సిఫారసుతో నామినేట్ అయిన త్రిసభ్య కమిటీలను కొనసాగించింది. ఇక రైతులు ఎన్నుకునే పాలకవర్గం అధికారంలోకి రావడంతో తమకు న్యాయం జరుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సభ్యులతో ఈకేవైసీ వేగవంతం చేయిస్తున్నాం
గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో పాలకవర్గాలను ఎన్నుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్ కార్యాలయం నుంచి జారీ చేసిన మెమోలు అందాయి. ప్రస్తుతం సభ్యుల గుర్తింపు కోసం ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాము. కర్నూలు జిల్లాలో 43 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పరిధిలో 76,066 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటి దాకా 65,437 మంది రైతులతో ఈకేవైసీ చేయించాము. కొత్తగా సభ్యులు కాదలిచిన వారు రూ.300 రుసుం చెల్లించి సభ్యులుగా చేరవచ్చు.
- షర్మిల, జిల్లా సహకార శాఖ అధికారి