స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:02 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా సరే గొడవలు సృష్టిస్తే సహించే ప్రసక్తే లేదని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ హెచ్చరించారు.
ఎవరికి ఇబ్బంది కలిగించినా మా విధి నిర్వహణ మాకు తప్పదు
మాజీ సీఎం ఆరోపణలకు ఆధారాలుంటే కోర్టుకు వెళ్లమనండి
కర్నూలు, కడప రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్
పత్తికొండ/చిప్పగిరి, అక్టోబరు 28,(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా సరే గొడవలు సృష్టిస్తే సహించే ప్రసక్తే లేదని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత ఎన్నికలను నిర్వహించడమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. గురువారం డీఐజీ పత్తికొండ సబ్ డివిజన్‌లో పర్యటించారు. డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలలో 11 మండలాలపై నిఘా ఉంచామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంశాలపై సిబ్బందితో మాట్లాడతామన్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా గొడవలు సృష్టించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించే అధికారం ఉంటుందన్నారు. ఈ విషయంపై ఆలూరు ఎమ్మెల్యే సీన్ క్రియేట్ చేయడం సరికాదన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ వంశీధర్‌గౌడ్, సీఐలు పెద్దయ్యనాయుడు, నాగరాజురావు తదితరులు ఉన్నారు.
ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించొచ్చు
ఇటీవల మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. రాజకీయ నాయకులకు మాట్లాడేందుకు పరిమితులు అంటూ ఉండవని, అందుకే వారు చేసిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకు తన విధి నిర్వహణ నచ్చకపోతే అందుకు తనది బాధ్యత కాదన్నారు. ఆయన ఆరోపణలు చేసినంత మాత్రాన తన విధి నిర్వహణ మారబోదన్నారు. అంతేకాకుండా జగన్ చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చన్నారు.