వేదవతికి పాలనా అనుమతి
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:03 AM
వేదవతి ప్రాజెక్టుకు 2019లో ఆనాటి సీఎం చంద్రబాబు రూ.1,942.38 కోట్లు మంజూరు చేయడమే కాకుండా పరిపాలన అనుమతులు, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణ పనులకు అంకురార్పణ గావించారు.
రూ.1,942.80 కోట్లు మంజూరు..
జీవో ఆర్‌టీ నం.497 జారీ
2028లోగా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యం
వేదవతి ప్రాజెక్టుకు 2019లో ఆనాటి సీఎం చంద్రబాబు రూ.1,942.38 కోట్లు మంజూరు చేయడమే కాకుండా పరిపాలన అనుమతులు, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణ పనులకు అంకురార్పణ గావించారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కరువు రైతుకు శాపంగా మారింది. 2024 జూన్‌లో సీఎం చంద్రబాబు సారథ్యంలో మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో వేదవతి ప్రాజెక్టుపై రైతుల్లో ఆశలు చిగురించాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్లు తరువాత రాష్ట్రంలో ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో ఈ ప్రాజెక్టును చేర్చారు. పర్యావరణ అనుమతుల కోసం డీపీఆర్‌కు ఉత్తర్వులు ఇచ్చారు. గురువారం రూ.1,942.80 కోట్లు మంజూరు, పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరువు రైతులకు చంద్రబాబు తీపి కబురు అందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతపై ఆంధ్రజ్యోతి పలు కథనాలు ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఆ వివరాలపై ప్రత్యేక కథనం.
కర్నూలు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా సరిహద్దులో ఆలూరు, ఆదోని నియోజకవర్గాల మీదుగా వేదవతి (హగరి) నది ప్రవహిస్తోంది. యేటా 30-45 టీఎంసీల వరద జలాలు తంగభద్రలో కలుస్తున్నాయని దివంగత రిటైర్డ్ ఇంజనీరు సుబ్బరాయుడు అంచనా వేశారు. ఆ వరద నీటిని ఒడిసిపట్టి ఆలూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు ఇవ్వవచ్చని రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) ఇవ్వాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.2 కోట్లు నిధులు విడుదల చేశారు. వేదవతి నది ద్వారా, నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా హంద్రీనీవా కాలువ నుంచి మొత్తం ఎనిమిది టీఎంసీలు వెత్తిపోసి సాగు, తాగునీరు ఇవ్వడానికి అనుకూలతలు ఉన్నాయంటూ 2016లో నాటి ప్రభుత్వానికి ఇరిగేషన్ అధికారులు నివేదిక పంపారు. ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు, రూ.1,942.38 కోట్లు నిధులు మంజూరు చేస్తూ 2019 జవనరిలో జీవో.ఆర్‌టీ.నెం.77 జారీ చేసింది. ఫిబ్రవరిలో టెండర్లు పిలవగా హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ర్ఫాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ 4.69 శాతం అధిక (ఎక్సెస్) రేట్లకు దక్కించుకొని నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఆ తరువాత వచ్చిన జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల నిర్లక్ష్యంగా వదిలేసింది. గంపెడు మట్టి కూడా తీయలేదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కాంట్రాక్ట్ సంస్థకు బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో ఆ సంస్థ చేతులెత్తేసింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక మోక్షం
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నర ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. ఆ సమయంలో కరువు రైతులకు వేదవతి ప్రాజెక్టు ఆవశ్యకతపై ఆంధ్రజ్యోతి పలు కథనాలు ద్వారా వెలుగులోకి తెచ్చింది. అదే క్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి సహా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు సీఎం చంద్రబాబు, యువనేత, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, జిల్లా ఇన్‌చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి మే 9న రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన 35 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. అందులో వేదవతి ప్రాజెక్టును కూడా చేర్చి ఆశలకు జీవం పోశారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు పర్యావరణ అనుమతుల సాధించే బాధ్యత, డీపీఆర్ తయారీ బాధ్యతలు వాప్కోస్ సంస్థకు అప్పగిస్తూ జూన్ 13న ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 25న ఆస్పరిలో జరిగిన ‘సంజీవని’ గ్రామ సభలో ఆలూరు నియోజకవర్గం ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ వేదవతి ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా 2028 ఆఖరులోగా పనులు పూర్తి రైతులకు అంకితం ఇస్తానని సుస్పష్టమైన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.1,942.80 కోట్లు మంజూరు.. పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో ఆర్‌టీ నం.497 జారీ చేశారు.
ప్రాజెక్టు నిర్మాణం ఇలా
వేదవతి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో వేదవతి నది ఒడ్డున స్టేజ్-1 పంప్‌హౌస్ నిర్మాణం చేస్తారు. అక్కడి హోలేబీడు గ్రామం వద్ద 2.037 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే హాలహర్వి రిజర్వాయరు వరకు ప్రెజర్ మెయిన్ పైపులైన్-1, అక్కడి నుంచి మొలగవెళ్లి జలాశయం వరకు ప్రెజర్ మెయిన్ పైపులైన్-2 నిర్మాణం చేస్తారు. అలాగే.. మద్దికెర మండలం బూరుజుల సమీపంలో హంద్రీ నీవా కాలువ 128 కిలోమీటర్ల వద్ద స్టేజ్-2 పంప్ హౌస్ నిర్మాణం, అక్కడి నుంచి నుంచి 1.27 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన మొలగవెళ్లి జలాశయం వరకు ప్రెజర్ మెయిన్ పైపులైన్-3 నిర్మాణం చేస్తారు. జలాశయాల నుంచి మెయిన్ కెనాల్స్, పంట కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు వంటి నిర్మాణాలు చేయాల్సి ఉంది. 2018 జూన్ ఆఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. హాలహర్వి, మొలగవళ్లి జలాశయాలు, 30 కిలో మీటర్లు 1,2,3 ప్రెజర్ మెయిన్ పైపులైన్లు, 19 కిలో మీటర్లు గ్రావిటీ కెనాల్ నిర్మాణాలు, వేదవతి నది, హంద్రీనీవా కాలువ వద్ద ప్రధాన పంపింగ్ కేంద్రాలు సహా వివిధ నిర్మాణాల కోసం 4,781 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 276.46 ఎకరాలు ఎస్‌డీసీ సర్వే, 427.97 ఎకరాలు ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తి చేశారు. 43.33 ఎకరాలకు డ్రాప్ట్ డిక్లరేషన్ స్టేజ్‌లో ఉంది. అవార్డు స్టేజ్‌లో కేవలం 17.24 ఎకరాలు మాత్రమే ఉంది. డీపీఆర్ తయారీ సమయంలో ఎకరాకు రూ.8 లక్షలు చొప్పున రూ.382.48 కోట్లు నిధులు అవసరమని ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం భూములు కోల్పోతున్న గ్రామాల్లో ఎకరం రూ.15-20 లక్షల వరకు పలుకుతుందని రైతులు అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన భూ సేకరణ అధిగమిస్తే కరువు పల్లెసీమలకు వేదవతి గొప్ప వరమని రైతులు పేర్కొంటున్నారు.
రైతుల గుండెల్లో చంద్రబాబు నిలిచిపోయారు
వేదవతి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టులపై ఎప్పుడు సమీక్షలు జరిగినా వేదవతి ప్రాజెక్టుపై మాట్లాడుతారు. త్వరంలో పనులు మొదలు పెట్టేందుకు కాంట్రాక్ట్ సంస్థతో ప్రభుత్వం ఇప్పటికే మాట్లాడింది. ఆస్పరి సంజీవని గ్రామ సభలో ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.1,942.80 కోట్లు మంజూరు.. పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం.
- వైకుంఠం జ్యోతి, టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి, ఆలూరు