Share News

రావణ వాహనంపై ఆది దంపతులు

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:47 PM

శ్రీగిరి క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి.

రావణ వాహనంపై ఆది దంపతులు
గ్రామోత్సవంలో విహరిస్తున్న స్వామి, అమ్మవార్లు

శ్రీశైలం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): శ్రీగిరి క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఐదవరోజైన శుక్రవారం ఉదయం స్వామివారి యాగశాలలో చండీశ్వరునికి షోడశోపచార పూజా క్రతువులు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై అధిష్టింపజేసి విశేష పూజలు, మంగళ హారతులు జరిపించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం మీదుగా క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామి ఆలయానికి చేరుకుని నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన కోలాటం, కళారూపాలు, చెంచుల డప్పు నృత్యాలతో సందడి చేశారు. రావణ వాహనంపై ఆశీనులైన స్వామి అమ్మవార్లను దర్శించుకోవడంతో సకల శుభాలు కలుగుతాయని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు భక్తులకు వివరించారు. గ్రామోత్సవంలో ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఏవీ రమణ, దేవకీ వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీనివాసులు, ఈఈ నర్సింహారెడ్డి, పీఆర్‌వో శ్రీనివాసరావు, ఏఈవోలు వెంకటేశ్వర్‌రావు, హరిదాసు, సాములు, పర్యవేక్షకులు అయ్యన్న, హర్యానాయక్‌, సీఎ్‌సవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:47 PM