భృంగి వాహనంపై ఆది దంపతులు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:26 PM
శ్రీగిరి క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
శ్రీశైలంలో రెండోరోజు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు
కనుల పండువగా సాగిన గ్రామోత్సవం
శ్రీశైలం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): శ్రీగిరి క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ పరిసరాలతో పాటు పరివార దేవతాలయాలన్నీ విద్యుద్దీపకాంతులతో శోభాయమానంగా కనువిందు చేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు విశేష పూజాదికాలు నిర్వహించారు. ఉదయం స్వామివారి యాగశాలలో చండీశ్వరునికి విశేష పూజలు, లోకకల్యాణార్థం జపాలు, పారాయణాలు, పంచావరణార్చనలు, మండపారాధనలు, రుద్రహోమం, అమ్మవారికి చండీహోమం, ప్రదోషకాల పూజలు, జపానుష్టానాలు, హోమాలు జరిపించారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన పుష్పవేదికపై ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై ఆశీనులజేసి షోడశోపచార పూజా క్రతువులు జరిపించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భృంగి వాహనాధీశులైన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామివార్లు గంగాధర మండపం నుంచి నందిమండపం మీదుగా క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామి ఆలయం వద్ద మంగళ హారతులు అందుకున్నారు. గ్రామోత్సవం కోలాటం, కళారూపాలు, చెంచుల డప్పు నృత్యాలతో సందడిగా సాగింది. భృంగి వాహనంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడంతో పాపాలు హరించి పనుల్లో ఏకాగ్రత లభిస్తుందని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు భక్తులకు వివరించారు. గ్రామోత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, ఏవీ రమణ దంపతులు, దేవకి వెంకటేశ్వర్లు దంపతులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఈవో శ్రీనివాసరావు, ఈఈ నర్సింహరెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈవోలు వెంకటేశ్వర్‌రావు, హరిదాసు, సాములు, పర్యవేక్షకులు అయ్యన్న, హర్యానాయక్, సీఎస్‌వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.