శాంతిభద్రతలకువిఘాతం కలిగిస్తే చర్యలు
ABN , Publish Date - May 25 , 2026 | 12:27 AM
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.
పోలీసు అధికారుల హెచ్చరిక
జిల్లావ్యాప్తంగా కార్డన్ సెర్చ్
నంద్యాల క్రైమ్, మే 24 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు అధికా రులు మాట్లాడుతూ.. ప్రజల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని, యువతను నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఈ సందర్భంగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, పాత నేరగాళ్లు, రౌడీషీటర్ల ఇళ్లతో పాటు అనుమా నాస్పద, సమస్యాత్మక ప్రాంతాల్లో ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు, అక్రమ మద్యం, నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా వెలుగోడు పోలీసు స్టేషన్ పరిధిలోని రేగడగూడూరు, నందికొట్కూరు పీఎస్ పరిధిలోని షికారిపేట, సుండి పెంట పీఎస్ పరిధిలోని లంబాడి తండా, జూపాడుబంగ్లా పీఎస్ పరిధిలోని తూడిచెర్ల, ఎన్.రాచర్ల పీఎస్ పరిధిలోని సీతమ్మ తండాలో పోలీసు బలగాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ అపరిచితులు, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు కానీ, 112, 100 నెంబర్లకు కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా పీఎస్‌లకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు, పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.