Share News

అక్రమాలకు పాల్పడితే వేటు తప్పదు

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:15 AM

రైతులు ఎన్నో కష్టనష్టాల్లో ఉన్నారని వారికి రుణాలు అందించడంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌ డి.విష్ణువర్ధన్‌ రెడ్డి హెచ్చరించారు

అక్రమాలకు పాల్పడితే వేటు తప్పదు
రైతుకు చెక్కు అందిస్తున్న డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి

డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి హెచ్చరిక

కర్నూలు అగ్రికల్చర్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రైతులు ఎన్నో కష్టనష్టాల్లో ఉన్నారని వారికి రుణాలు అందించడంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌ డి.విష్ణువర్ధన్‌ రెడ్డి హెచ్చరించారు. నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం బ్రాంచ్‌ మేనేజర్ల సమావేశంతో పాటు డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు, బకాయిల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. కేడీసీసీబీ చైర్మన్‌ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం బ్యాంకు పరిధిలో రూ.1100 కోట్ల డిపాజిట్లను సేకరించాలని, అదే విదంగా రూ.3,900 కోట్ల రుణాల నిల్వ వ్యాపారం కోసం రూ.5వేల కోట్లు, కొత్త రుణాల పంపిణీకి రూ.600 కోట్లు లక్ష్యాలుగా నిర్దేశించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం బ్యాంకు వ్యాపారాన్ని రూ.5వేల కోట్లకు పెంచాలని, వాణిజ్య బ్యాంకులకు దీటుగా పని చేసి రైతులకు అండగా నిలవాలని బ్యాంకు సిబ్బందిని ఆదేశించారు. ఆలూరు, ఆదోని, పత్తికొండ, డోన్‌, ఎమ్మిగనూరు బ్యాంకు బ్రాంచీలలో నిరర్తత ఆస్తులు ఎక్కువగా పేరుకుపోయాయని, రికవరీపై దృష్టి సారించాలని సూచించారు. సీఈవో రామాంజనేయులు మాట్లాడుతూ.. రైతుల నుంచి రుణబకాయిలు సాధించిన 19 సహకార సంఘాలకు, బ్రాంచీలకు రూ.99 కోట్లు దీర్ఘకాలిక రుణాల కింద రైతులకు రుణాలు ఇచ్చేందుకు చైర్మన్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తికావడంతో చైర్మన్‌ను సీఈవోతో పాటు డీజీఎంలు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కింద నందికొట్కూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా రుణం పొంది మరణించిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును చైర్మన్‌ ఆ రైతు కుటుంబ సభ్యులకు అందజేశారు.

Updated Date - Jun 07 , 2026 | 12:15 AM