Share News

అటవీ శాఖలో అక్రమార్కుడిపై చర్యలు

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:01 AM

రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని ఓ ఉద్యోగి రూ.కోట్లు కొట్టిసిన వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అటవీ శాఖలో అక్రమార్కుడిపై చర్యలు
ఆత్మకూరు అటవీ డివిజన్‌ కార్యాలయం

రిటైర్డ్‌ ఏఓ చాంద్‌బాషాపై నేరారోపణ

దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

రూ.11.47 కోట్ల అవకతవకలపై కేసు

ఆత్మకూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని ఓ ఉద్యోగి రూ.కోట్లు కొట్టిసిన వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమాలకు పాల్పడిన రిటైర్డ్‌ అడ్మినిస్ర్టేషన్‌ ఆఫీసర్‌ ఏఎస్‌ చాంద్‌బాషాపై నేరారోపణ పత్రాన్ని (ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జ్‌) తెరవాలని ఆదేశిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి చాంద్‌బాషా చేసిన అక్రమాలు గత ఏడాదిలో బయటపడగానే ఆయనపై అటవీశాఖ అధికారులు ఆత్మకూరు పోలీసు స్టేషన్‌ ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కానీ శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు ఆయన రిటైర్డ్‌ కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఓసీని తెరచి తదుపరి విచారణ జరపాలని నిర్ణయించింది. దీంతో చాంద్‌బాషా అవకతవకలపై ముమ్మర దర్యాప్తు జరిగేందుకు అవకాశం ఉంది.

అసలేం జరిగిదంటే

ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ పరిధిలో ఏళ్ల తరబడి అడ్మినిస్ర్టేషన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన ఏఎస్‌ చాంద్‌బాషా 2024 జూలైలో పదవీవిరమణ పొందారు. అయితే ఆయన పనిచేసిన కాలంలో ఫారెస్టు చెక్‌పోస్టుల నుంచి వచ్చిన ఆదాయాన్ని, వివిధ రూపాయాల్లో అటవీశాఖకు సమకూరిన నిధులను ఆంధ్రప్రదేశ్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ ఫండ్‌ (ఏపీటీసీఎ్‌ఫ)కు, ఇతర సంస్థలకు ఆర్టీజీఎస్‌ ద్వారా నగదు బదిలీ చేసే ప్రక్రియలో చేతివాటం ప్రదర్శించి కోట్ల రూపాయలు స్వాహా చేశాడు. తొలుత రూ.4.35కోట్లు దారి మళ్లినట్లు గుర్తించగా ఆ తర్వాత రూ.11.47కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలింది. దీంతో ఈ వ్యవహారంపై గత ఏడాది అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు చాంద్‌బాషాతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన చాంద్‌బాషా ఆతర్వాత ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయి రిమాండ్‌ వెళ్లిన ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

రూ.11.47కోట్ల అవకతవకలు

ఆత్మకూరు అటవీశాఖను కుదిపేసిన చాంద్‌బాషా వ్యవహారానికి సంబంధించి గత ఏడాది మే 19వ తేదిన అప్పటి పీసీసీఎఫ్‌ ఏకే నాయక్‌ ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించారు. ఇందులో ఎస్‌ఎన్‌టీఆర్‌ ఎఫ్‌డీపీటీ బీ.ఏ.కృష్ణమూర్తి, విజిలెన్స్‌ డీఎ్‌ఫఓ ఎన్‌.శివకుమార్‌, నంద్యాల సర్కిల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పద్మావతి, ఆత్మకూరు, నంద్యాల డివిజన్లకు చెందిన అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్లు చంద్రశేఖరరాజు, జీఎస్‌ రవికుమార్‌, రమే్‌షలను నియమించారు. వీరు కొన్ని నెలల పాటు చాంద్‌బాష హయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి ఏకంగా రూ.11,47,27,244 అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో రూ.7,72,49,491 డబ్బు వివిధ మార్గాల్లో దారి మళ్లినట్లు నిర్ధారించగా మిగిలిన రూ.3,74,77,753 డబ్బుకు సంబంధించిన లావాదేవీలేవి బయటకు రాలేదు. దీంతో వీటి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులకు తలనొప్పిగా మారింది. కాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయనపై నేరారోపణ పత్రాన్ని (ఏఓసీ) తెరవగానే దర్యాప్తు మరింత వేగవంతంగా జరిగేందుకు అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ కుంభకోణంలో వెనక ఎవరెవరు ఉన్నారో కూడా గుర్తించేందుకు అవకాశం లేకపోలేదు.

Updated Date - Jul 10 , 2026 | 12:01 AM