Share News

ఓటు వేసిన హత్య కేసు నిందితులు

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:09 AM

జంట హత్య కేసు నేపథ్యంలో.. ఆ కేసులో నిందితులు, వారి బంధువులు గ్రామానికి దూరంగా తలదాచుకుంటున్నారు. కొందరు బతుకుదెరువు కోసం పట్నాలు, నగరాలకు వలస వెళ్లారు. గ్రామంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేయాలనే ఆకాంక్షతో గ్రామానికి వెళ్లాలని అనుకున్నారు. అయితే.. గ్రామంలో పరిస్థితులు వారికి అడ్డుకట్టగా మారాయి. ఓటు హక్కు వినియోగించుకోవాలనే సంకల్పాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి అభీష్టానికి పోలీసులు అండగా నిలిచారు. ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి, భద్రత నడుమ 75 మందిని పోలింగ్‌ కేంద్రానికి తీసుకువెళ్లి ఓటు వేయించారు.

ఓటు వేసిన హత్య కేసు నిందితులు
కందనాతిలో పోలింగ్‌ కేంద్రం వద్ద నిందితులు

కందనాతిలో అన్నదమ్ములు దారుణ హత్య కేసు

25 మందిపై కేసు

ఊరికి దూరంగా నిందితులు, బంధువులు

పోలీస్‌ రక్షణలో ఓటేసిన 75 మంది

కర్నూలు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జంట హత్య కేసు నేపథ్యంలో.. ఆ కేసులో నిందితులు, వారి బంధువులు గ్రామానికి దూరంగా తలదాచుకుంటున్నారు. కొందరు బతుకుదెరువు కోసం పట్నాలు, నగరాలకు వలస వెళ్లారు. గ్రామంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేయాలనే ఆకాంక్షతో గ్రామానికి వెళ్లాలని అనుకున్నారు. అయితే.. గ్రామంలో పరిస్థితులు వారికి అడ్డుకట్టగా మారాయి. ఓటు హక్కు వినియోగించుకోవాలనే సంకల్పాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి అభీష్టానికి పోలీసులు అండగా నిలిచారు. ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి, భద్రత నడుమ 75 మందిని పోలింగ్‌ కేంద్రానికి తీసుకువెళ్లి ఓటు వేయించారు. సాధారణంగా ఎన్నికల వేళ ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ.. ఇక్కడ ఓటు వేయాలనే వారి సంకల్పానికి పోలీసులే బాటలు వేశారు. చట్టాన్ని అమలు చేసే బాధ్యతతో పాటు.. పౌరుల ప్రజాస్వామ్య హక్కును గౌరవించిన ఈ ఘటన అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో ఈ ఏడాది జనవరి 5న పాత కక్షలు కారణంగా ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. 2024 ఫిబ్రవరి 24న గ్రామంలో దేవర మహోత్సవం సమయంలో కుళాయి నీళ్లు పట్టుకునే క్రమంలో జరిగిన గొడవలో తండ్రి కొడుకులు గాయపడి.. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో 12 మందిపై కేసు నమోదు చేశారు. దీనికి ప్రతికారంగా ఈ ఏడాది జనవరి 5న ఇద్దరు అన్నదమ్ములను దారుణంగా హతమార్చారు. మరో సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ జంట హత్యల కేసులో పోలీసులు 25 మందిపై కేసు నమోదు రిమాండ్‌ పంపగా, బెయిల్‌పై విడుదల అయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులు, వారి బంధువుల కుటుంబాలు గ్రామంలోకి వెళ్లకుండా దూరంగా ఉంటున్నాయి. కొందరు బతుకుదెరువు కోసం బెంగళూరు, హైదరాబాద్‌, గుంటూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. మరికొందరు, వృద్ధులు బోడబండ, ఆగ్రహారం, కర్నూలు వంటి ప్రాంతాల్లో బంధువుల ఇళ్లలో ఉంటున్నారరు. తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రావడంతో తమ గ్రామానికి వెళ్లి తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని అనుకున్నారు. పల్లెలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఊరికి వెళ్లలేకపోయారు.

ఓటు వేయాలనే సంకల్పంతో..

ఊరికి వెళ్లాలి.. ఎలాగైనా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనే వారి ఆలోచనను ఎమ్మిగనూరు రూరల్‌ సీఐ చిరంజీవికి విన్నవించారు. అయితే.. ఆయన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, డీఎస్పీ శ్రీనివాసులుకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు వారు ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌, గుంటూరు ప్రాంతాలకు వలస వెళ్లిన జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు, వారి బంధువులను ఎమ్మిగనూరు తాలుకా పోలీస్‌ స్టేషన్‌కు రప్పించారు. 75 మందిని రెండు ప్రత్యేక వాహనాల్లో కందనాతిలోని పోలింగ్‌ కేంద్రానికి భారీ బందోబస్తుతో నేరుగా తీసుకెళ్లారు. వారు ఓటేసిన తరువాత అవే వాహనాల్లో ఎమ్మిగనూరు తీసుకొచ్చి.. అక్కడి నుంచి వారుండే ప్రాంతాలకు పంపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదేనని ఆ 75 మంది చాటి చెప్పారు. అదే క్రమంలో పౌరుల ఓటు వేయాలనే ప్రజాస్వామ్య హక్కును గౌరవించి ఊరికి దూరంగా ఉన్న వారికి రక్షణగా నిలవడంతో పాటు ఓటు వేయించిన పోలీసులు తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంపై ఎమ్మిగనూరు తాలుకా సీఐ చిరంజీవి దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా.. గ్రామానికి దూరంగా ఉన్నవారి ఓటు హక్కు వినియోగించుకోవాలనే వారి విన్నపాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి.. వారి ఆదేశాలతో ప్రత్యేక వాహనాలు, భద్రతతో ఓటు వేయించామని పేర్కొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 12:09 AM