Share News

చోరీ కేసులో నిందితుల అరెస్టు

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:40 AM

కర్నూలు జిల్లాలో కలకలం రేపిన కాల్వబుగ్గ ఆలయ చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌, రూరల్‌ సీఐ చంద్రబాబు నాయుడు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు

చోరీ కేసులో నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

మరో ముగ్గురి కోసం గాలింపు,

4 కిలోల వెండి స్వాధీనం

కలకలం రేపిన కాల్వబుగ్గ ఆలయంలో దొంగతనం

కర్నూలు క్రైం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో కలకలం రేపిన కాల్వబుగ్గ ఆలయ చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌, రూరల్‌ సీఐ చంద్రబాబు నాయుడు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత నెల 17న కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి సుమారు 10 కేజీల వెండి నగలు చోరీ చేశారు. ఆ మరుసటి రోజు గుర్తించిన ఆలయ అధికారులు, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌, ఉలిందకొండ ఎస్‌ఐ ధనుంజయ, నాగులాపురం ఎస్‌ఐ అఖిల్‌, తాలుకా ఎస్‌ఐ మోహన్‌ కిషోర్‌రెడ్డి, స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. సీసీ పుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 2 వారాల పాటు కేసు దర్యాప్తు చేశారు. నిందితులంతా మహారాష్ట్ర చెందిన అర్జున్‌ పూనమ్‌ కుంబహర్‌, అక్షయ్‌ జైసింగ్‌ ఠాకూర్‌, జర్మల్‌, అమిత్‌, బహిరంగీలుగా గుర్తించారు. వీరిలో అర్జున్‌ పూనమ్‌, అక్షయ్‌ జైసింగ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 4 కిలోల వెండి నగలు రికవరీ చేశారు. దొంగతనానికి ఉపయోగించిన కట్టర్‌, గ్లౌజులు, స్కూట్‌ డ్రైవర్లు, కత్తులు, మారుతి వాహనాన్ని సీజ్‌ చేశారు.

ముందుగా రెక్కీ నిర్వహించి

మహారాష్ట్ర చెందిన ఈ నిందితులు ఆలయ పరిసరాలను ముందుగానే గూగుల్‌ మ్యాప్‌ ద్వారా గుర్తించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాత్రి సమయాల్లో అయితే ఆ ప్రాంతమంతా ఖాళీగా ఉంటుందని భావించి రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత చాకచక్యంగా చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు నెల్లూరు జిల్లా దుత్తలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లమ్మ గుడిలో దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. వీరిపై పలు కేసులు ఉన్నట్లు కూడా తేలింది. కేసును ఛేదించిన సీఐలు, ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు ప్రతాప్‌, సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు సమీర్‌, కిరణ్‌, మద్దిలేటి, రవీంద్రసింగ్‌, వెంకటరమణ, సోమే్‌షలను ఎస్పీ అభినందించారు. వారికి ప్రత్యేక రివార్డులు ప్రకటించారు. పరారిలో ఉన్నవారిని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

Updated Date - Apr 07 , 2026 | 12:40 AM