దోపిడీ కేసులో నలుగురి అరెస్టు
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:55 PM
దోపిడీ కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.6.17 లక్షల నగదు, ఒక మోటారు సైకిల్, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ఖాదర్‌బాషా వివరాలు వెల్లడించారు
రూ.6.17 లక్షల నగదు, మోటారు సైకిల్, 4 సెల్ఫోన్ల స్వాధీనం
నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): దోపిడీ కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.6.17 లక్షల నగదు, ఒక మోటారు సైకిల్, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ఖాదర్‌బాషా వివరాలు వెల్లడించారు. భూమి కొనుగోలు రిజిస్ర్టేషన్ నిమిత్తం ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఆమె మరిది వెంకట్రాముడు, మామ నరసింహుడితో కలిసి ఈ నెల 14న మోటారుసైకిల్‌పై కోవెలకుంట్లకు రూ.7,05లక్షలు బ్యాగులో పెట్టుకొని బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న పొరుగింటిలో ఉండే చంద్రమౌళి ఎలాగైనా ఆ డబ్బును దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉయ్యాలవాడ మండలం కొండపల్లికి చెందిన నాగిరెడ్డి, వంశీరెడ్డి, కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంట్లకు చెందిన బొబ్బేరి రాఘవేంద్రకు విషయం చెప్పాడు. బాధితులు బయలుదేరినప్పటి నుంచి చంద్రమౌళి మిగతా వారికి సమాచారం ఇచ్చాడు. కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న టోల్గేట్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి లక్ష్మీదేవి వద్ద ఉన్న నగదు ఉన్న బ్యాగును లాక్కెళ్లారు. ఈ క్రమంలో లక్ష్మీదేవి కిందపడడంతో గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అదే రోజు కోవెలకుంట్ల పోలీ్‌సస్టేషన్‌లో సీఐ హనుమంతనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 16న కోవెలకుంట్ల - బనగానపల్లె రోడ్డులోని అమడాల గ్రామం క్రాస్‌రోడ్ దగ్గరున్న రైల్వే బ్రిడ్జి దగ్గర దోపిడీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రూ.6.17 లక్షల నగదు, ఒక మోటారుసైకిల్, 4 సెల్ఫోన్లు, ఒక హెల్మెట్ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులపై గతంలోనే దొంగతనం కేసులు ఉన్నాయని, చంద్రమౌళిపై హత్య కేసు కూడా ఉందని ఏఎస్పీ తెలిపారు. కోవెలకుంట్ల సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, కానిస్టేబుళ్లను ఏఎస్పీ అభినందించారు.