Share News

నిందితురాలి అరెస్టు

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:44 AM

బస్సులు, దేవాలయాల వంటి రద్దీగా ఉండే ప్రాంతాలను ఆమె టార్గెట్‌ చేసుకుంటుంది. బస్సులో బ్యాగులు కట్‌ చేయకుండా చాకచక్యంగా జిప్‌ తొలగిస్తుంది. బ్యాగులో ఉన్న విలువైన వస్తువులను చోరీ చేస్తుంది.

నిందితురాలి అరెస్టు
రికవరీ చేసిన సొత్తును పరిశీలిస్తున్న ఎస్పీ

30 తులాల బంగారు నగలు స్వాధీనం

సీసీ కెమెరాల ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు

కర్నూలు క్రైం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): బస్సులు, దేవాలయాల వంటి రద్దీగా ఉండే ప్రాంతాలను ఆమె టార్గెట్‌ చేసుకుంటుంది. బస్సులో బ్యాగులు కట్‌ చేయకుండా చాకచక్యంగా జిప్‌ తొలగిస్తుంది. బ్యాగులో ఉన్న విలువైన వస్తువులను చోరీ చేస్తుంది. ఇలా ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు చోట్ల చోరీలకు పాల్పడింది. చివరకు పోలీసులు దృష్టి పెడితే సీసీ కెమెరాలకు చిక్కింది. నిందితురాలు వాణిశ్రీని అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి 30తులాల విలువైన బంగారు నగలు రికవరీ చేశారు. నిందితురాలి వివరాలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. తిరుపతికి చెందిన ఓ మహిళ అనంతపురంలో జరిగిన ఓ వివాహానికి హాజరై అక్కడి నుంచి మంత్రాలయం వచ్చింది. రాఘవేంద్రస్వామిని దర్శనం చేసుకుని కర్నూలు వచ్చింది. కర్నూలులో బ్యాగ్‌ను పరిశీలిస్తే జిప్‌ తొలగించి ఉంది. బ్యాగులో ఉన్న 24 తులాల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును చాలెంజింగ్‌ తీసుకున్నారు. మంత్రాలయానికి సుమారు 50వేల నుంచి లక్ష మంది భక్తులు నిత్యం దర్శనార్థం వస్తుంటారు. ఇంత రద్దీలో దొంగను పట్టుకోడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించారు. మంత్రాలయం మఠంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఓ మహిళ బాధితురాలిని వెంబడిస్తున్నట్లుగా గుర్తించారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు సీ.క్యాంపులో మిడ్తూరు మండలం బైౖరాపురం గ్రామానికి చెందిన కదిరి జయమ్మ అనే మహిళ పర్సులోని గొలుసు చోరీకి గురైంది. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన త్రీటౌన్‌ పోలీసులు నిందితురాలు ఆచూకీ గుర్తించారు. నంద్యాల జిల్లా సిద్ధాపురం గ్రామం చెందిన వాణిశ్రీగా గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే మంత్రాలయం కేసు కూడా వెలుగు చూడటంతో అక్కడ చోరీ కేసులో ఈమె నిందితురాలుగా తేల్చారు. పాణ్యం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో, నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో రెండు చోరీ కేసులు కూడా వెలుగు చూశాయి. ఈ మూడు కేసుల్లోనూ సీసీ కెమెరాలు పరిశీలించి వాణిశ్రీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఆమె నుంచి 30 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో సీసీ కెమెరాలే కీలక ఆధారాలుగా నిలిచాయని ఎస్పీ వెల్లడించారు. కేసు చేధించిన పోలీసు బృందాలను ఎస్పీ అభినందించారు.

Updated Date - Sep 17 , 2026 | 12:44 AM