కొడుకును హత్య చేసిన కేసులో అరెస్టు
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:11 AM
కొడుకును హత్య చేసిన కేసులో తండ్రి వసుంధరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు.
కోవెలకుంట్ల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కొడుకును హత్య చేసిన కేసులో తండ్రి వసుంధరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. శుక్రవారం కోవెలకుంట్ల పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నిందితుడ్ని హాజరు పరిచారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... కోవెలకుంట్ల మండల పరిధిలోని కంపమల్ల గ్రామానికి చెందిన మేకల వసుంధరరావు కుమారుడు వంశీకృష్ణ బెంగుళూరులో చదువుతూ ఉండేవాడు. గత కొంతకాలంగా వంశీకృష్ణకు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. అయితే వంశీకృష్ణకు తల్లిదండ్రులపై దాడులకు పాల్పడుతూ ఉండేవాడు. ఈ గొడవలో వసుంధరరావు కర్రతో కొడుకు తలపై కొట్టడంతో వంశీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కేసులో నిందితుడైన వసుంధరరావును శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించిన్నట్లు సీఐ తెలిపారు.
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు
ఆళ్లగడ్డ, జూలై 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఈనెల 14న వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిందితుల అరెస్టు చూపించి వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సమీర్‌పై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం జాతీయ రహదారిలోని దోశ హౌస్ వద్ద నలుగురు వ్యక్తులు పోలీసు వాహనాన్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా టౌన్ సీఐ నాగరాజరావు, ఎస్‌ఐ చిన్నపీరయ్య, సిబ్బంది పట్టుకొని విచారించారు. ఈ విచారణలో సమీర్ ను కత్తులతో దాడి చేసి పారిపోయిన కేసులో నిందితులుగా గుర్తించారు. వెంటనే నిందితులు మునగల పెద్ద ఎల్లాలు, వెంకట సుధీర్, దూదేకుల హుస్సేన్, తలారి సురేంద్రను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, ఒక పిడి బాకు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విషయంలో గొడవల కారణంగానే సమీర్‌పై కత్తితో దాడి చేసినట్లు తెలిపారని డీఎస్పీ చెప్పారు. ఎస్‌ఐ శ్రీనివాసగౌడ్, కోర్టు కానిస్టేబుల్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.