కురువని మేఘం
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:01 AM
ఆకాశంలో మేఘాల హడావిడి తప్ప నేల మీద చినుకు రాలడం లేదు. దాదాపు ఇరవై రోజులకు పైగా ఇదే పరిస్థితి.
హోరెత్తిస్తున్న గాలులు
బెట్ట పరిస్థితులపై కర్షకుల దిగాలు
కోడుమూరు రూరల్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఆకాశంలో మేఘాల హడావిడి తప్ప నేల మీద చినుకు రాలడం లేదు. దాదాపు ఇరవై రోజులకు పైగా ఇదే పరిస్థితి. దీనికితోడు గాలుల హోరు. దీంతో పంటలు సాగు చేసిన రైతులు దిగాలు చెందుతున్నారు. వరుణదేవుడు కరుణించకపోతే పెట్టుబడి మట్టిపాలేనని ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది అతివృష్ఠితో పంటలు దెబ్బతినగా, ఈఏడాది ఎల్‌నినో ప్రభావం రైతన్న ఆశలను ఆవిరి చేస్తోంది. జల్లులు మినహా పంటకు బెట్ట తీరేలా పదునైన వానలు కురవడం లేదని రైతులు నిట్టూర్చుతున్నారు.
3,893 హెక్టార్లలో పంటలు
ఈ ఖరీఫ్‌లో ముందస్తు వర్షాలకు 3,893 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. పదునైన వానలు కురిస్తే విత్తు వేయడానికి రైతులు పొలాన్ని సిద్ధం చేసి ఉంచారు. దాదాపు 15,025 హెక్టార్ల మేర పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతేడాది ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 14,659 హెక్టార్లకు 15,593 హెక్టార్లు సాగైనట్లు ఏవో రవిప్రకాష్ గౌడు సంతోషం వ్యక్తం చేశారు. ఎల్‌నినో పరిస్థితులకు అనుకూలంగా తక్కువ వర్షపాతంతో పండే పంటలపై రైతులను సమాయత్తం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
బెట్ట నివారణకు చర్యలు తీసుకోండి : రవిప్రకాష్, వ్యవసాయాధికారి
పంటలు సాగు చేసిన రైతులు బెట్ట నివారణకు చర్యలు తీసుకోవాలి. ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎకరాకు 250 గ్రాముల యూరియాను 200 లీటర్ల నీటిలో కలిపి లేదా నానో యూరియా 500 మి.లీ పిచికారీ చేస్తే నాలుగైదు రోజులపాటు పంటకు బెట్ట తట్టుకునే శక్తి ఏర్పడుతుంది.
వర్షం కోసం ఎదురు చూస్తున్నాం
ఈ ఏడాది వర్షాధారం కింద పది ఎకరాల్లో పత్తి నాటాం. మొదట్లో ఒకటి రెండు పదునైన వానలు కురిశాయి. దీంతో పంట సాగుకు అనుకూల పరిస్థితులు కనిపించాయి. అయితే ఆ తర్వాత వానలు కురవలేదు. దీంతో పైరులు ఎదగడం లేదు. గాలుల తీవ్రత కూడా పెరిగింది. మొక్కలు వాడుముఖం పట్టాయి. వాన కోసం ఎదురు చూస్తున్నాం.
- వెంకటప్ప, రైతు వర్కూరు
రోజూ ఎదురుచూపే
మాది కొత్తూరు. ఖరీఫ్ కింద ఏడు ఎకరాలు కౌలు తీసుకుని పత్తి సాగు చేశాను. పెట్టుబడి రూ. 80 వేలు అయ్యింది. కౌలు రూ. 70 వేలు కౌలు చెల్లించాలి. పంట సాగు తర్వాత వర్షం జాడ లేకపోవడంతో పైరు వాడుముఖం పట్టింది. వర్షం కోసం రోజూ ఆకాశం వైపు చూస్తున్నా.
-దస్తగిరి, కౌలు రైతు, కొత్తూరు