సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:16 PM
ఆదోని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. డీఎస్పీ సీతారామరావు నేతృత్వంలో ఈ దాడులు కొనసాగాయి.
రూ.1.18లక్షల నగదు స్వాధీనం
ప్రైవేటు వ్యక్తుల దందా
అవినీతి పరులను వదలం
ఏసీబీ డీఎస్పీ సీతారామరావు
ఆదోని, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఆదోని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. డీఎస్పీ సీతారామరావు నేతృత్వంలో ఈ దాడులు కొనసాగాయి. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో భారీగా అవినీతి బయటపడింది. అక్కడికి ప్రవేశించిన ఏసీబీ బృందానికి కనిపించిన దృశ్యాలు వారిని నివ్వెర పోయేలా చేశాయి. ఎక్కడికక్కడ లెక్కలేని నగదు కట్టలు, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లగా ప్రైవేట్ వ్యక్తుల హవాను చూశారు. దాడులు జరుగుతున్న సమయంలో కార్యాలయంలో లెక్కకు మించి ఉన్న రూ.1.18లక్షల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇది కేవలం పట్టుబడిన సొమ్ము మాత్రమే. అసలు వసూళ్ల దందా దీనికి పది రెట్లు ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
బయట వ్యక్తుల ఆధీనంలో..
ప్రభుత్వ రికార్డులను నిర్వహించాల్సిన చోట ముగ్గురు డాక్యుమెంట్ రైటర్ల, నలుగురు అసిస్టెంట్లు, మరో ఇద్దరు బయటి వ్యక్తులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ అస్లాంబాషా ఏసీబీ అధికారులను చూడగానే వణికిపోయాడు. తన వద్ద ఉన్న రూ.23వేలకు పైగా నగదునే బయటికి విసిరి వేశాడు. దీన్ని బట్టి చూస్తే వీరు ఎంత నిర్భయంగా సామాన్యులను దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వీరి వెనుక ఉన్న పెద్దల హస్తం ఎవరిది? అన్నది ఆదోని పట్టణంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బ్రేకులు వేసిన ఏసీబీ
జీవో నంబర్ 396 పేరులో డాక్యుమెంట్ రైటర్లు పెన్‌డౌన్ ఆందోళనలు చేస్తున్న తరుణంలో... రిజిస్ర్టేషన్ల కోసం ప్రజలు అధిక సంఖ్యలో సబ్ రిజిస్ర్టార్ కార్యాలయానికి వచ్చారు. ప్రజల అమాయకత్వాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఈనెల చివరి వరకు ధర్నాలో పాల్గొంటుండడంతో శనివారం ఒకేసారిగా పెద్ద ఎత్తున రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పనులు త్వరగా కావాలంటే ముట్టజెప్పాల్సిందే అన్నట్లుగా సాగించిన ఈఅరాచకానికి ఏసీబీ దాడులు బ్రేక్ వేశాయి. మేం చూస్తూ ఊరుకోం.. సామాన్యుల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందేనని ఏసీబీ డీఎస్పీ సీతారా మరావు హెచ్చరించారు. అవినీతికి పాల్పడే అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. కార్యాలయంలోని రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించిన తర్వాత కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఉన్న టీ బంకులోనూ, కార్యాలయం బయట ప్రాంతంలో అధికారులు సోదాలు నిర్వహించారు.
ఉడాయించిన డాక్యుమెంట్ రైటర్లు
ఏసీబీ అధికారులను చూడగానే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న కొందరు వ్యక్తులు డబ్బులను బయటకు విసిరేశారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం పరిసరాల్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. కాగా బయటపడేసిన మొత్తాన్ని కూడా కొందరు ఎత్తుకెళ్లినట్ల సమాచారం. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా రన్న సమాచారంతో ఒక్కసారిగా డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులకు తాళాలు వేసి అక్కడ నుంచి ఉడాయించారు.
అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో..
ప్రభుత్వ భవనంలోకి అనధికార వ్యక్తులు ఎలా ప్రవేశించారు? అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా ఏళ్ల తరబడి ఎలా సాగుతోంది? ఈ సంచలన దాడుల తర్వాతనైనా ఆదోని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో మార్పు వస్తుందా? లేక మళ్లీ పాత రాజ్యం మొదలవుతుందా? అనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నలు..