Share News

నంద్యాల సబ్‌ రిజిస్ర్టార్‌ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:32 PM

కర్నూలు నగర శివారులో పెద్దపాడు సమీపంలో ఉన్న మైత్రి హోమ్స్‌లో సబ్‌ రిజిస్ర్టార్‌ గోపాల్‌ ప్రసాద్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

నంద్యాల సబ్‌ రిజిస్ర్టార్‌ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
ఈశ్వర గోపాల్‌ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు

రూ.5 కోట్ల మేర అక్రమ ఆస్తుల గుర్తింపు

ఆరు చోట్ల ఏకకాలంలో దాడులు

నగదు, బంగారం, కీలక పత్రాల స్వాఽధీనం

కర్నూలు క్రైం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర శివారులో పెద్దపాడు సమీపంలో ఉన్న మైత్రి హోమ్స్‌లో సబ్‌ రిజిస్ర్టార్‌ ఈశ్వర గోపాల్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్సీ సీతారామరావు ఆధ్వర్యంలో సబ్‌ రిజిస్ర్టార్‌కు సంబంధించిన ఆరుచోట్ల తనిఖీలు చేశారు. డీఎస్పీ సీతారామరావు తెలిపిన వివరాల మేరకు... ఈశ్వర గోపాల్‌ తండ్రి ఏపీఎస్పీ బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తూ మృతి చెందాడు. 2012 మే 16న కారుణ్య నియామకం కింద ఈశ్వర గోపాల్‌కు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం లభించింది. అనంతరం 2018 సెప్టెంబర్‌ 15న సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. కోసిగి, కర్నూలు, కల్లూరు, పాణ్యం, నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విధులు నిర్వహించిన ఆయన 2024 నుంచి నంద్యల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ర్టార్‌గా కొనసాగుతున్నారు. అవినీతి నిరోధక చట్టం - 1988 లోని సంబంధిత సెక్షన్ల కింద ఆగస్టు 3న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, దర్యాప్తులో భాగంగా మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఉదయం నుంచే ఏసీబీ అధికారులు నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకుని ఈశ్వర గోపాల్‌ ఛాంబర్‌తో పాటు కార్యాలయంలోని రికార్డులు, దస్త్రాలు, అధికారిక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈశ్వర గోపాల్‌ కర్నూలు శివారులో పెద్దపాడు సమీపంలో మైత్రి హోమ్స్‌లో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ట్రిపుల్‌ ఎక్స్‌ విల్లాలో ఉంటున్న ఈయన నివాసాన్ని చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారు. సుమారు ఆ విల్లా ఖరీదే రూ.2 కోట్లుపైనే ఉంటుందని అంచనా వేశారు. ఆయన ఇంట్లో 2 కిలోల వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈయనకు బాలాజీనగర్‌లో జీ ప్లస్‌ 2 ఇల్లు, గణేష్‌ నగర్‌లో మరో జీ ప్లస్‌ 1 భవనం ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు సీజ్‌ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో 25 సెంట్ల ఖరీదైన స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. అదేవిధంగా ఇంట్లో సుమారు రూ.25 లక్షలు విలువైన గృహోపకరణాలు లభ్యమయ్యాయి. వీటి ఖరీదు, స్టైల్‌ చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. ఈయనకు ఓ కారు, బులెట్‌ వాహనం, స్కూటీ ఉన్నట్లు గుర్తించారు. అలాగే హైదరాబాదులో ఉంటున్న ఈయన సోదరి హారికాబాయి ఇంట్లో సోదాలు చేశారు. అనంతపురంలో పని చేస్తున్న ఆయన బావమరిది ఇంట్లో తనిఖీలు చేశారు. కర్నూలులో ఈశ్వర్‌ గోపాల్‌ భార్య అన్న వినోద్‌ కుమార్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈయనకు మిత్రుడు, బినామిగా భావిస్తున్న మణికంఠ హోమ్స్‌లో నివాసముంటున్న రాజాబాషా ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అలాగే నంద్యాల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో మరో బృందం తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ఇంటిని అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దుకున్నట్లు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా రూ.2.8 కోట్లు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో రూ.5 కోట్లుపైబడి ఉంటుంది. ఇదిలా ఉండగా ఏసీబీ అధికారుల దాడులతో కాసేపు నంద్యాలలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు నిలిచిపోయింది. తనిఖీల విషయం తెలియగానే కార్యాలయం పరిసరాల్లో కార్యకలాపాలు నిర్వహించే స్టాంప్‌ వెండర్లు దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు.

Updated Date - Aug 07 , 2026 | 12:00 AM