ఏసీబీ దాడులు
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:43 PM
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నగదు స్వాధీనం
అదుపులో డాక్యుమెంటు రైటర్లు
ఎస్‌ఆర్ ఓ, జూనియర్ అసిస్టెంట్ మధ్య లావాదేవీలపై విచారణ
నంద్యాల క్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని సిబ్బందితోపాటు అనుమతి లేకుండా కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను, కార్యాలయంలో ఉన్న 12 మంది స్టాంప్ రైటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్యాలయంలో నిబంధనల మేరకు ఉండాల్సిన క్యాష్ కంటే అదనంగా ఉన్న రూ.16వేల రూపాయలను జూనియర్ అసిస్టెంట్ హుశేన్‌పీరా నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే కార్యాలయంలో అనుమతి లేకుండా పని చేస్తున్న ముగ్గురిలో శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద కూడా కొంత మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ చంద్రమౌళి, జూనియర్ అసిస్టెంట్ హుశేన్‌పీరా మధ్య అనుమానాస్పద లావాదేవీలను గుర్తించామని, వీటికీ సంబంధించి ఆధారాలు కూడా ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఇద్దరి మధ్య గతంలో కూడా లావాదేవీలు ఉన్నాయని, అలాగే డీఆర్వో కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగిని సురేఖకు కొంత మొత్తాన్ని మొబైల్ ద్వారా పంపినట్లు ఆధారాలు లభించాయని మీడియాకు చెప్పారు. కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహించే డబ్బు నిర్వహణ కంటే అదనంగా ఉన్న రూ. 10,110 సీజ్ చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్యాలయంలో ఉన్న ముగ్గురు వ్యక్తులపైౖ పలు ఫిర్యాదులున్నాయని అన్నారు. కమర్షియల్ బిల్డింగులను రెసిడెన్స్ బిల్డింగులుగా మార్చి రిజిస్ట్రేషన్ చేయించి ట్యాక్స్ లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి రూ.3వేల పైచిలుకు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌లపై వివిధ రకాల ఫిర్యాదులు వచ్చాయని, పూర్తిస్థాయిలో మంగళవారం కూడా విచారిస్తామని ఆయన తెలిపారు.