పాఠశాలల్లో కొలువుదీరారు
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:33 AM
నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు ‘కొలువు’దీరారు. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో అవసరమైన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీలో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన నోటిఫిషన్‌కు నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన లభించింది.
ఉమ్మడి జిల్లాలో విధుల్లో చేరిన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు
ఉన్నత పాఠశాలల్లో తీరిన సబ్జెక్టు టీచర్ల కొరత
శిరివెళ్ల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు ‘కొలువు’దీరారు. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో అవసరమైన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీలో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన నోటిఫిషన్‌కు నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన లభించింది. జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా త్రిసభ్య కమిటీ సభ్యులు పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆయా మండలాల్లోని ఎంఈవోలు వారికి నియామక పత్రాలు అందజేయడంతో ఈ నెల 1వ తేదీ నుంచి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఉపాధ్యాయుల కొరతను అధిగమించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం చేపట్టింది.
తీరిన సబ్జెక్టు టీచర్ల కొరత
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంతో ప్రధానంగా ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత దాదాపు తీరింది. 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు లాంగ్వేజె్‌సతోపాటు సాంఘికశాస్త్రం, గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం సబ్జెక్టుల బోధనకు స్కూల్ అసిస్టెంట్లను నియమించడంతో ఆటంకాలు తొలిగిపోయాయి. పదో తరగతి వార్షిక ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు శక్తివంచన లేకుండా కృషి చేయాల్సి ఉంది
నాణ్యమైన విద్య అందిస్తున్నాం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంతో సిలబస్ సకాలంలో పూర్తవుతుంది. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తాం. - డీటీ శంకర్ ప్రసాద్, డిప్యూటీ ఈవో, నంద్యాల
విద్యార్థులకు ప్రయోజకరం
పాఠశాలలో జీవశాస్త్రం బోధించేందుకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ వచ్చారు. దీంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అన్ని అర్హతలు కలగిన ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించడం మంచి నిర్ణయం. - జానకి, హెచ్‌ఎం, జడ్పీహెచ్‌ఎస్, వీరారెడ్డిపల్లె