ఆధ్యాత్మిక శోభతో అహోబిలం
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:47 PM
అహోబిలం నల్లమల కొండలు బుధవారం గోవింద నామ స్మరణతో మారుమోగాయి. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లాయి.
గోవిందనామ స్మరణతో మారుమోగిన నల్లమల
శేషవాహనం, గరుడ విమానంపై విహరించిన దేవదేవుడు
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): అహోబిలం నల్లమల కొండలు బుధవారం గోవింద నామ స్మరణతో మారుమోగాయి. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లాయి. ఎగువ అహోబిల క్షేత్రంలో కొలువైన మాలోల నరసింహస్వామి నన్నిధి లో సుదర్శన హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం నరసింహ స్వామి దీక్ష తీసుకొన్న భక్తులు హోమం అనంతరం దీక్ష విరమించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఎగు వ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామికి పంచామృతంతో అభిషేకం చేశారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి హనుమంత వాహనంపై కోలువు దీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే దిగువ అహోబిల క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి, యోగానరసింహ గరుడ విమానంపై విహరించారు. సాయం త్రం చంద్రప్రభ వాహనంపై లక్ష్మీనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఊరేగించారు. అనంతరం పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రూరల్ సీఐ బీవి రమణ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.