అభీ.. లేవరా చిన్నా..
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:19 AM
అభీ.. లేవరా నాన్నా.. తెల్లారితే నీ పుట్టిన రోజు.. మమ్మల్ని విడిచి ఎక్కడి పోయావు చిన్నా.. అంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న ప్రతి ఒక్కరికీ కంటి తడిపెట్టించింది. బుడిబుడి నడకలతో.. ఆటాడుకునే అభి ఇక లేడు అన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గోడ కూలి చిన్నారి మృత్యు దరిచేరిన ఈ హృదయవిదారక ఘటన బుధవారం సాయంత్రం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో చోటుచేసుకుంది.
అమ్మానాన్నలను విడిచిపోయావా..
చిన్నారి పాలిట మృత్యురూపంలో గోడ
ప్రాతకోటలో విషాదం
పగిడ్యాల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): అభీ.. లేవరా నాన్నా.. తెల్లారితే నీ పుట్టిన రోజు.. మమ్మల్ని విడిచి ఎక్కడి పోయావు చిన్నా.. అంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న ప్రతి ఒక్కరికీ కంటి తడిపెట్టించింది. బుడిబుడి నడకలతో.. ఆటాడుకునే అభి ఇక లేడు అన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గోడ కూలి చిన్నారి మృత్యు దరిచేరిన ఈ హృదయవిదారక ఘటన బుధవారం సాయంత్రం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన అరుణ్ కుమార్, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. సాయంత్రం ఇంటి పరిసర ప్రాంతంలో అభి(3) తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఒకసారిగా ఈదురు గాలులు బలంగా వీచాయి. సిమెంటు ఇటుకలతో నిర్మించిన గోడ పెద్ద శబ్దంతో కూలింది. అభిపై పడటంతో ఇటుకల కింద ఆ చిన్నారి కూరుకుపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడి ఏడుపులు విన్న కుటుంబ సభ్యులు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతే ఆ తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. తమ కళ్లెదుట ఆడుతూపాడుతూ ఉరకలేసిన కుమారుడి మరణ వార్తతో కుప్పకూలిపోయారు. తెల్లవారితే పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన అభి అకాల మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో దద్దరిల్లింది. చిన్నారి మృతి చెందిన సమాచారాన్ని తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వైద్యశాలకు చేరుకొని పరామర్శించారు.