Share News

పరామర్శనా.. బల ప్రదర్శనా..?

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:49 PM

దళిత మహిళ ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వచ్చావా? లేక బలప్రదర్శనకు వచ్చావా? అంటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరామర్శనా.. బల ప్రదర్శనా..?
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ

వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేతల ఆగ్రహం

కర్నూలు అర్బన్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): దళిత మహిళ ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వచ్చావా? లేక బలప్రదర్శనకు వచ్చావా? అంటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌ సింగ్‌, ముఖ్య నాయకులతో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో వైసీపీ కార్యకర్తలు చేసిన రచ్చతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమీ లేక వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వైసీపీ కార్యకర్తలు కలసి దళితులు, వాల్మీకులపై దాడి చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీసీ, దళిత బాధితులను పరామర్శించాల్సింది పోయి దాడికి పాల్పడిన ఎమ్మెల్యేను వెనుకేసుకు రావడం ఏమిటన్నారు. వైసీపీ నాయకులు జగన్‌ రెడ్డికి ఇచ్చిన స్ర్కిప్టు సరిగ్గా లేదన్నారు. దాడి జరిగిన రోజు బయటకు వచ్చిన వీడియోలు చూస్తే అందరికీ ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ లాంటి ఆరాచకవాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్‌ ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రానికి మేలు చేయాల్సింది పోయి.. ఆరాచకాలు సృష్టిస్తావా? అంటూ ప్రశ్నించారు. టీడీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్‌ గౌడ్‌ మాట్లాడుతూ గొడ్డలి పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరామర్శల పేరుతో జగన్‌ అండ్‌ కో చేస్తున్న అరాచకాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. వైసీపీలోని కొందరు నాయకులు ఆ పార్టీ నాయకులే హత్యలు చేస్తూ పరామర్శల పేరుతో నాటకాలు అడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకెపోగు ప్రభాకర్‌, రాష్ట్ర కార్యదర్శి కైప పద్మలతా రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు, కార్పొరేషన్ల డైరెక్టర్లు నంద్యాల నాగేంద్ర, థరూర్‌ జేమ్స్‌, పాలకవీటి విజయకుమార్‌, పోతురాజు రవి, ఎస్వీ ప్రసాద్‌, హనుమంతరావు, సత్రం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 11:50 PM