Share News

పరామర్శా...బల ప్రదర్శనా?

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:19 AM

మాజీ సీఎం జగన్‌ వచ్చింది ఆలూరు వైపీసీ ఎమ్మెల్యే బి. విరూపాక్షిని పరామర్శించడం కోసం. అయితే.. రాజకీయ హంగామా.. నాలుగు గంటలకు పైగా హైడ్రామా నడిచింది.

పరామర్శా...బల ప్రదర్శనా?
నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్‌ షో నిర్వహిస్తున్న మాజీ సీఎం జగన్‌

నాలుగు గంటలపాటు ప్రజలకు చుక్కలు చూపిన జగన్‌ రోడ్‌ షో

హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

బందోబస్తు పోలీసులను తోసేసిన వైసీపీ శ్రేణులు

మాజీ సీఎం జగన్‌ వచ్చింది ఆలూరు వైపీసీ ఎమ్మెల్యే బి. విరూపాక్షిని పరామర్శించడం కోసం. అయితే.. రాజకీయ హంగామా.. నాలుగు గంటలకు పైగా హైడ్రామా నడిచింది. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారు. నేషనల్‌ హైవే నిబంధనలను నలిపేశారు. ప్రజలకు చుక్కలు చూపించారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి పంచలింగాల సమీపంలో ఉన్న జిల్లా కారాగారం వరకు సాగిన వైసీపీ రోడ్‌ షోలో అతిప్రవర్తనను ప్రజలు ఈసడించుకున్నారు. పరామర్శ పేరిట జగన్‌ చేసిన రోడ్‌షో రాజకీయ బల ప్రదన్శనను తలపించింది. దారి పొడవునా కార్యకర్తలకు అభివాదం చేస్తూ సాగదీతగా సాగిన జగన్‌ పర్యటన వల్ల సామాన్యులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు.

కర్నూలు/కర్నూలు క్రైం/ అర్బన్‌/ న్యూసిటీ/ కల్లూరు/ ఓర్వకల్లు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): చిప్పగిరి మండలం సంగాల, నేమకల్లు గ్రామాల్లో వైసీపీ కార్యకర్త అక్రమంగా డంప్‌ చేసిన ఇసుకను పోలీసులు సీజ్‌ చేసిన విషయంలో వైసీపీ కార్యకర్త గిరి, టీడీపీ నాయకుడు గురునాథ్‌ మధ్య ఫోన్లో జరిగిన వాగ్వాదం ఇరువర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. వైసీపీ కార్యకర్త గిరి ఫోన్‌ చేయడంతో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కుమారుడు చంద్రశేఖర్‌, తమ్ముడు శ్రీరాములు, వంద మందికిపైగా కార్యకర్తలను వెంటేసుకొని సంగాల, నేమకల్లు గ్రామాలకు వెళ్లి సంగాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నక్కలదొడ్డి శేఖర్‌, నేమకల్లు గ్రామంలోని దళిత సామాజికవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు నాగరాజు ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. దళిత మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపణ. టీడీపీ మండల కన్వీనర్‌ కొండా రామాంజనేయులు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌, తమ్ముడు శ్రీరాములు సహా పలువురు వైపీసీ కార్యకర్తలపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి వచ్చిన జగన్‌ రాజకీయ హంగామా సృష్టించారు. ఓర్వకల్లు మండలం నన్నూరు, టోల్‌ ప్లాజా, కర్నూలు నగరంలో గుత్తి పెట్రోల్‌ బంక్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు, చెన్నమ్మ సర్కిల్‌, చౌరస్తా సర్కిల్‌, సంతోష్‌ నగర్‌ సర్కిల్‌, పంచలింగాల చెక్‌పోస్టు సర్కిల్‌లో రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఉదయం పది గంటలకే వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలు కార్యకర్తలను తరలించారు. వైసీపీ శ్రేణులు గుంపులు గుంపులుగా చేరి పార్టీ జెండాలు పట్టుకొని అరాచకం సృష్టించారు. పోలీసుల విధులకు ఆటకం కలిగిస్తూ.. అదుపు చేయడానికి వెళ్లిన పోలీసులతో వాగ్వాదానికి దిగి వారిని తోసేశారు. వారి వింత ప్రవర్తలతో ప్రజలు ఇదే చోద్యం. అం టూ నిర్ఘాంతపోయారు. హైవేపై పలు చోట్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించారు. హైదరాబాద్‌ - బెంగళూరు జాతీ య రహదారిపై దూరప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

నాలుగు గంటల సాగదీత

ఓర్వకల్లు మిమానాశ్రయం నుంచి ఉదయం సుమారుగా 11.20 గంటలకు జగన్‌ కాన్వాయ్‌ బయలుదేరింది. జిల్లా జైలుకు చేరుకోడానికి మహా అయితే 45 నిమిషాలు పడుతుంది. కొంత ఆలస్యమైనా గంటకు మించదు. సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా జైలుకు చేరుకున్నారు. నేషనల్‌ హైవే కూడళ్లలో ముందే సిద్ధం చేసిన కార్యకర్తల వద్ద రోడ్‌షో చేస్తూ, వారికి అభివాదం చేస్తూ పర్యటనను సాగ..దీశారు. నాలుగు గంటలకు పైగా పర్యటన నడిపించారు. వివిధ ప్రదేశాల్లో ట్రాఫిక్‌ అంతరాయం వల్ల ప్రజలు ఇబ్బందులు తప్పలేదు. జగన్‌ సహా వైసీపీ కార్యకర్తలు నిబంధనలను తుంగభద్ర నదిలో కలిపేశారు. దీంతో తోడు వారి అరాచకం, అతి ప్రవర్తనతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు చవిచూడాల్సి వచ్చింది. వైసీపీ శ్రేణులు ఎంత ఒత్తిడికి గురి చేసిన పోలీసులు మాత్రం సహనం, సంయమనం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా.. జగన్‌ పర్యటన ఫొటోలు తీయకుండా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జగన్‌ పర్యటన వల్ల గ్రామీణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్తున్న రోగులకు ఇబ్బందులు తప్పలేదు.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు తప్పని ఇబ్బందులు

జిల్లా జైలుకు మధ్యాహ్నం 12 గంటల్లోగా జగన్‌ వస్తారని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్‌, మాజీ ఎంపీ, వైసీపీ పార్లమెంట్‌ సమన్వయకర్త బుట్టా రేణుక, ఆదోని, పత్తికొండ మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి తదితరులు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. అక్కడ కూర్చోవడానికి కుర్చీలు లేవు. చెట్ల నీడ కూడా లేదు. సాయంత్రం 4.30 గంటల వరకు రోడ్డుపైనే నిల్చొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరైతే ఆరోగ్య సమస్యలు ఉండడంతో వారి బాధలు వర్ణణాతీతం. జగన్‌ వెంట మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్నేని నాని తదితరులు చేరుకున్నారు.మాజీ మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి భార్య రామాంజినమ్మ, కుమారుడు వెంకటేశ్‌లతో కలసి జైలులోకి వెళ్లిన జగన్‌ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించారు. రాజకీయంగా అండగా ఉంటాం.. అధైర్యపడవద్దు అంటూ భరోసా ఇచ్చినట్లు తెలిసింది.

మద్యం.. బిర్యానీ పొట్లాలు

జగన్‌ పర్యటన సందర్భంగా మద్యం, బిర్యాని పొట్లాలు పంపిణీ చేశారు. ప్రత్యేకంగా వంటశాలు పెట్టి బిర్యాని తయారు చేయించి పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేయడంతో ఓర్వకల్లు, కల్లూరు, కర్నూలు మండలాల్లోని 9 మద్యం దూకాణాలు, మూడు బార్లలో ఒక్క రోజే రూ.1.46 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌ అధికారులు పేర్కొనడం కొసమెరుపు.

జగన్‌ గో బ్యాక్‌

మాజీ సీఎం జగన్‌ పర్యటన పురస్కరించుకొని టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌ పేరుతో జగన్‌ గోబ్యాక్‌ అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. ఎస్సీలపై దాడి చేసిన వారిని పరామర్శించేందుకు రావడానికి సిగ్గుందా జగన్‌..! డీఎస్సీపై చర్చించడానికి దమ్ము ఉంటే అసెంబ్లీకి రా జగన్‌..! అంట్లూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 14 , 2026 | 12:19 AM