ఆత్మకూరు మున్సిపాలిటీ ఏకగ్రీవాల్లో మెలిక..!
ABN , Publish Date - Oct 22 , 2026 | 10:59 PM
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.
మూడు వార్డుల్లో ఎన్నికలు జరిగే అవకాశం
ఆత్మకూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కూటమి, వైసీపీ కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మున్సిపల్ చైర్మన్‌తో సహా అన్ని వార్డులు ఏకగ్రీవాలు అయినట్లు ప్రచారం జరిగినప్పటికీ చివరికి మెలిక పడింది. మూడు వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండటంతో ఆయా వార్డుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడింది. బుధవారం జరిగిన నామినేషన్ల ఉసంహరణలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అదేక్రమంలో అర్థరాత్రి వరకు ఆయా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులతో సాగిన మంతనాలతో 11, 23, 27 వార్డులు మినహా మిగతా స్థానాలన్నీ ఏకగ్రీవమైనట్లు తెలిసింది. అయితే ఆ మూడు వార్డులకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఏకగ్రీవాలకు అవకాశం లభించలేదు. కూటమి, వైసీపీల మధ్య కుదిరిన సయోధ్యలో భాగంగా 11వ వార్డులో వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన జాకీర్ అనే అభ్యర్థికి కేటాయించగా అక్కడ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన ఇర్ఫాన్ అనే అభ్యర్థి తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోలేదని తెలిసింది. అదేక్రమంలో 23వ వార్డు టీడీపీ అభ్యర్థి సుబ్బరాజుకు కేటాయించగా అక్కడ సీపీఎం తరపున నామినేషన్ దాఖలు చేసిన రణధీర్ కూడా తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోలేదు. ఈయనకు ఎన్ని విధాలుగా సర్దిచెప్పినా ఆయన విత్‌డ్రా చేసుకునేందుకు అంగీకరించలేదు. చివరికి కోఆప్షన్ ఇస్తామన్నా స్పందించలేదని సమాచారం. అలాగే 27వ వార్డు వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన మారుబత్తుల విజయకుమార్‌కు కేటాయించగా అక్కడ ఎస్డీపీఐ తరపున పోటీ చేసిన మాసుంబాషా తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోలేదని వినికిడి. ఈ లెక్కన ఆ మూడు వార్డుల్లో ఎన్నికలు అనివార్యం కానున్నట్లు తెలిసింది.