Share News

ఆమెకు అందలం

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:39 PM

పురపాలికలో మహిళలు చరిత్ర తిరగరాశారు. కర్నూలు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా అన్ని మున్సిపాలిటీల్లోనూ మహిళలే మహరాణులయ్యారు.

ఆమెకు అందలం
మేయర్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న కలెక్టర్‌

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరులో కొత్త పాలకవర్గం

కర్నూలు డిప్యూటీ మేయర్‌, ఆదోని, ఎమ్మిగనూరు వైస్‌ చైర్మన్లు ఏకగ్రీవం

కర్నూలులో ప్రమాణస్వీకారం చేయించిన కలెక్టర్‌ సిరి

హాజరైన టీజీ భరత్‌, ఎమ్మెల్యే గౌరు చరిత

ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి హాజరు

నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలే మహా‘రాణులు’

కర్నూలు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పురపాలికలో మహిళలు చరిత్ర తిరగరాశారు. కర్నూలు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా అన్ని మున్సిపాలిటీల్లోనూ మహిళలే మహరాణులయ్యారు. కర్నూలు కార్పొరేషన్‌ మేయర్‌ సహా, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు, గూడూరు నగర పంచాయతీల్లో మహిళలే అధ్యక్షులుగా సోమవారం కొత్త పాలకవర్గం కొలుదీరింది. పట్టణ పాలనకు నయారూపం వచ్చింది. 187 మంది కార్పొరేటర్లు/కౌన్సిలర్లలో సగానికి పైగా మహిళలే బాధ్యతలు చేపట్టారు. వారిలో మెజార్టీగా కొత్తతరం యువనాయత్వం రావడం రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది. మొత్తంమీద నాలుగు పట్టణాలు.. కొత్త పాలన.. ఎన్నో ఆసక్తికర సన్నివేశాలతో పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. మేయర్‌, చైర్‌ పర్సన్లు సహా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణాస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. కర్నూలు డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి నామినేషన్ల స్వీకరించగా, బీజేపీ అభ్యర్థి అంబలి కాశీవిశ్వనాథ్‌ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రటించారు. ఆదోని, ఎమ్మిగనూరు వైస్‌ చైర్మన్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గూడూరు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సరైన కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది.

కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలకు ఈ నెల 1న పోలింగ్‌ జరిగితే.. 3న ఓట్లు లెక్కింపు జరిగింది. ఆదోని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మినహా మూడు స్థానిక సంస్థల్లో కూటమి జెండా ఎగిరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనీల్‌ చంద్రపునేఠ జారీ చేసిన షెడ్యూల్‌ మేరకు నాలుగు పట్టణ సంస్థల్లో నూతన పాలకవర్గం ప్రమాణాస్వీకారం, డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. కర్నూలు నగరపాలక సంస్థలో 68 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రిసైడింగ్‌ అధికారి కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేయించారు. మొదట మేయర్‌ బొల్లెద్దుల విజయ ప్రత్యూష ప్రమాణస్వీకారం చేశారు. అదే సభలో కార్పొరేటర్‌గా కొనసాగుతున్న తల్లి బొల్లెద్దుల సరస్వతమ్మకు ప్రత్యూష పాదాభివందనం చేసి, మంత్రి టీజీ భరత్‌ ఆశీస్సులు తీసుకుని బాధ్యతలు చేపట్టారు. ఆమె ఇంగ్లీష్‌లో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 68 మంది కార్పొరేటర్లతో ఒకేసారి ప్రమాణస్వీకారం చేయించేందుకు కలెక్టర్‌ డాక్టర్‌ సిరి సిద్ధం కాగా, మంత్రి టీజీ భరత్‌ జోక్యం చేసుకుని ప్రతి సభ్యుడితో ప్రమాణస్వీకారం చేయించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు ప్రతి సభ్యుడితో కలెక్టర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భాషా వైవిధ్యం కనిపించింది. మెజార్టీ సభ్యులు మాతృభాష తెలుగులో ప్రమాణస్వీకారం చేస్తే, ఉన్నతవిద్యావంతులైన యువ కార్పొరేటర్లు కొందరు ఇంగ్లీ్‌షలో, కొందరు ఉర్దూలో ప్రమాణం చేశారు. ప్రమాణంలో పదాలు పలికే క్రమంలో కొందరు సభ్యులు తడబడటం, మళ్లీ సరిచేసుకుంటూ ముందుకు సాగడం సభలో ఆసక్తికరంగా మారింది. కల్లూరు అర్బన్‌ పరిధిలోని ఓ సభ్యుడి ‘మా బావా గౌరు వెంకటరెడ్డి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా’ అని అనడంతో సభలో నవ్వులు పూశాయి.

డిప్యూటీ మేయర్‌ పీఠంపై బీజేపీ..

కర్నూలు నగరపాలక సంస్థలో 68 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 1న జరిగిన ఎన్నికల్లో టీడీపీ 52, బీజేపీ 3, జనసేన రెండు కలిపి కూటమి 57 స్థానాలు దక్కించుకుంది. వైసీపీ 11 స్థానాలతో సరిపుచ్చుకుంది. స్పష్టమైన ఆధిక్యత ఉండడంతో డిప్యూటీ మేయర్‌ పీఠం కూటమికే దక్కింది. డిప్యూటీ మేయర్‌ పీఠం పాణ్యం నియోజకవర్గానికి చెందిన పెరుగు పురుశోత్తం రెడ్డికే ఇవ్వాలని ఎన్నికలకు ముందే రాజకీయ ఒప్పందం. మంత్రి టీజీ భరత్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఇద్దరు కూడా డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా ఆయన పేరునే అధిష్ఠానికి పంపించారు. పెరుగు పురుశోత్తంరెడ్డి ఎన్నిక లాంఛమేనని అంటూ టీడీపీ శ్రేణుల్లో సంతోషించారు. సోమవారం జరిగే ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు. అయితే.. ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత సీన్‌ మారిపోయింది. కర్నూలు డిప్యూటీ మేయర్‌ పీఠం బీజేపీకే ఇవ్వాలి అంటూ ఆ పార్టీ నాయకులు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పొత్తులో భాగంగా బీజేపీకి కర్నూలు డిప్యూటీ మేయర్‌ పదవిని కేటాయించడంతో పెరుగు పురుశోత్తంరెడ్డి ఆశలు ఎండమావులే అయ్యాయి. 18వ వార్డు బీజేపీ కార్పొరేటర్‌గా విజయం సాధించిన న్యాయవాది అంబలి కాశీవిశ్వనాథ్‌ను డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ బీ-ఫారం అందజేసింది. టీడీపీ నుంచి పోటీ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ప్రకటించి, ప్రమాణ స్వీకారం చేయించారు.

పురపాలికల్లో నూతన అధ్యాయం

ఆదోని మున్సిపాలిటీ నుంచి చైర్‌పర్సన్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచిన స్వప్న నాయకర్‌ రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. జనసేన నుంచి టికెట్‌ దక్కకపోవడంతో ఆ పార్టీ నేత మల్లప్ప తన భార్యతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయించి గెలిచిన విషయం తెలిసింది. ఈ క్రమంలో సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన జనసేన నాయకులు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. స్వప్న నాయకర్‌ చేత ప్రిసైడింగ్‌ అధికారి, ఆర్డీఓ ఆరుణాదేవి ప్రమాణస్వీకారం చేయించారు. ఆమె మాతృభాష తెలుగులో ప్రమాణం చేశారు. ఆ తరువాత 52 మంది కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల కోరిక మేరకు ఒక్కొక్కరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. కౌన్సిలర్లు సుధా, మనోహర్‌, సాకరె గోవిందరాజులు సంస్కృతంలో ప్రమాణం చేయడం ఆసక్తికరంగా మారింది. అనంతరం వైస్‌ చైర్మన్‌ టీడీపీ అభ్యర్థిగా 9వ కౌన్సిలర్‌ జయరాం నామినేషన్‌ వేయగా, బీజేపీ కౌన్సిలర్‌ నాగేంద్ర ప్రతిపాదించారు. కౌన్సిలర్లు తిమ్మప్ప, హారీ్‌ఫలు ఆమోదించారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి, ఆయనతో ఆర్డీవో అరుణాదేవి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి హాజరయ్యారు.

గూడూరు నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ డమాం సునీతాబాయి చేత ప్రిసైడింగ్‌ అధికారి, ఆర్డీఓ సందీ్‌పకుమార్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సమావేశానికి నలుగురు టీడీపీ కౌన్సిలర్లు, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా మాత్రమే హాజరై ప్రమాణస్వీకారం చేశారు. అయితే సరైన కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి సమావేశాన్ని గంటసేపు వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగా, ముందు ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు సభ్యులు వెళ్లిపోయారు. ఆ తరువాత 8 మంది వైసీపీ కౌన్సిలర్లు రావడంతో వారితో ప్రమాణం చేయించారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సరిపడా సభ్యులు హాజరు కాకపోవడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

ఎమ్మిగనూరు మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ మాచాని సునీత బాధ్యతలు చేపట్టారు. ప్రిసైడింగ్‌ అధికారి మధసూదనరెడ్డి ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తరువాత 44 మంది కౌన్సిలర్లతో ఏకకాలంలో ప్రమాణస్వీకారం చేయించడం కొసమెరుపు. అనంతరం జరిగిన వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో టీడీపీ అధిష్టానం ఆదేశాలు, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సహకారంతో 37వ కౌన్సిలర్‌ తురేగల్‌ నజీర్‌ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయన పేరు కౌన్సిలర్‌ మహేశ్‌ ప్రతిపాదించగా, 4వ వార్డు కౌన్సిలర్‌ శ్రీలత బలపరిచారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పీవో ప్రకటించి ప్రమాణస్వీకారం చేయించారు.

Updated Date - Nov 23 , 2026 | 11:39 PM