Share News

ఆమెకు అందలం

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:25 PM

పుర పోరులో అతివలకు కూటమి ప్రభుత్వం అందలం ఎక్కించింది. విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను రంగంలోకి దింపింది.

ఆమెకు అందలం

రేసులో గెలుపు గుర్రాలు

మేయర్‌, చైర్‌పర్సన్ల కూటమి అభ్యర్థుల ఎంపిక

నాలుగు చోట్ల మహిళలకే కేటాయింపు

ఆదోని, ఎమ్మిగనూరులో తెరపైకి కొత్త వ్యక్తులు

సీఎం చంద్రబాబు రాజకీయ వ్యూహం

మూడు చోట్ల వైసీపీ అభ్యర్థులు ఖరారు

నేటితో ముగియనున్న నామినేషన్లు

కర్నూలు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పుర పోరులో అతివలకు కూటమి ప్రభుత్వం అందలం ఎక్కించింది. విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను రంగంలోకి దింపింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యనిర్వహ క అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్‌ ఐవీఆర్‌ సర్వేలు, రాజకీయ సమీకరణలను పరిగణ లోకి తీసుకుని కర్నూలు మేయర్‌, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్‌ అభ్యర్థులను ఎంపిక చేశారు. కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా గూడూరు నగర పంచాయతీ బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ కూడా అభ్యర్థిని ఎంపిక చేసింది. ఎమ్మిగనూరు మినహా మూడు చోట్ల మహిళలకు రిజర్వు చేశారు. బీసీ జనరల్‌ స్థానాన్ని కూడా ఆసామాజికవర్గానికి చెందిన మహిళను చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారు. నగరపాలక, మున్సిపాలిటీల్లో నారీ మణులకే అంకితం చేయడం రాజకీయ చర్చగా మారింది. ఆదివారం నామినేషన్ల స్వీకరణకు ఆఖరు కావడంతో నామినేషన్ల దాఖలుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

అనూహ్యంగా కొత్త వ్యక్తులు

ఆదోని, ఎమ్మిగనూరు చైరపర్సన్‌ అభ్యర్థులుగా అనుహ్యంగా కొత్త వ్యక్తులను ఎంపిక చేశారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూనే సీఎం చంద్ర బాబు కొత్త వ్యక్తుల్ని తెరపైకి తెచ్చి రాజకీయ చతురత చాటారు. వైసీపీలో ఆదోని మినహా కర్నూలు, గూడూరు చైర్‌పర్సన్‌, ఎమ్మిగనూరు చైర్మన్‌ అభ్యర్థులను ఎంపిక చేసింది. పుర ఎన్నికల మైదానంలో తలపడి. ప్రత్యర్థిని పడగొట్టి విజయకేతనం ఎగురవేసేది ఎవరు? జిల్లా అంతటా ఇదే చర్చ.

మంత్రి టీజీ భరత్‌ కుటుంబానికి..

కర్నూలు కార్పొరేషన్‌ టీడీపీ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్‌ బొల్లెద్దుల విజయ ప్రత్యూషను అధిష్ఠానం ఎంపిక చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న టీడీపీ సీనియర్‌ నాయకుడు దివంగత బొల్లెద్దుల రామకృష్ణ కూతరు. ఆమె భర్త గద్వాల విజయరాజు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ (డిఫెన్స్‌) లో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. సోదరులు బొల్లెద్దుల ప్రశాంత్‌, పవన్‌ కాంత్‌ మంత్రి టీజీ భరత్‌కు సన్నిహితులు, టీడీపీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. విజయ ప్రత్యూష 2021 కార్పొరేషన్‌ ఎన్నికల్లో 52వ వార్డు టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో మంత్రి టీజీ భరత్‌ ఎంపిక చేసిన విజయ ప్రత్యూష అభ్యర్థిత్వానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

మీనాక్షినాయుడుకు మేనకోడలు నాగమణి

ఆదోని మున్సిపాలిటీ టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మేనకోడలు (చెల్లెలు కూతురు) నాగమణిని సీఎం చంద్ర బాబు ప్రకటించారు. ప్రముఖ క్లాస్‌ కాంట్రాక్టర్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు చెన్నంపల్లి బలరాంచౌదరి కుమార్తె ఈమె. అనుహ్యంగా తెరపైకి వచ్చి టీడీపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. సీట్ల పంపకాల చర్చల్లో 21స్థానాలకు జనసేన ఒప్పుకొని ఆదోనిని వదులుకోవడంతో టీడీపీ ఖాతాలోకి చేరింది. మీకుటుంబం నుంచి నలుగురు పేర్లు సిఫార్సు చేయమని గురువారం రాత్రి టీడీపీ అధిష్ఠానం నుంచి మీనాక్షినాయుడుకు ఫోన్‌ వచ్చింది. ఆయన కొంకా సత్మమ్మ (కోడలు), కొంకా సుస్మిత (తమ్ముడు ఉమాపతినాయుడు కు మార్తె), చెల్లంపల్లి నాగమణి (చెల్లెలు కుమార్తె), కొంకా లక్ష్మి (చిన్నకోడలు) పేర్లు పంపారు. నాగమణి తెరపైకి వచ్చి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎంపికయ్యారు.

పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ టీడీపీ అభ్యర్థిగా మాచాని సునీత పేరును సీఎం చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాచాని మహేశ్‌కుమార్‌ భార్య సునీత. ఈమె కూడా అనుహ్యంగా తెరపైకి వచ్చారు. అన్‌రిజర్వుడ్‌ జనరల్‌కు కేటా యించినా, పట్టణంలో చేనేతలు అధికంగా ఉండడంతో అదే సామాజికవర్గం అభ్యర్థిని బరిలో దింపేందుకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పావులు కదిపారు. మాచాని మహేశ్‌ స్థానంలో ఆయన భార్య మాచాని సునీతను అనుహ్యంగా తెరపైకి తెచ్చి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

పట్టుబట్టి సాధించుకున్న బీజేపీ

గూడూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బీజేపీ అభ్యర్థిగా డమామ్‌ సునీతాబాయిని ఆ పార్టీ ఎంపిక చేసింది. ఈసీటును బీజేపీ పట్టుబట్టి సాధించుకుంది. గత నెల 5న కడపలో బీజేపీ రాయలసీమ జిల్లాల ఆశావహులతో రాష్ట్ర నాయకత్వం అంతర్గత సమావేశం నిర్వహించింది. ఆదోని, గూడూరు రెండు స్థానాల్లో పోటీకి సిద్ధపడాలని అధిష్ఠానం నిర్ణయించింది. తనకు గూడూరు చైర్మన్‌ టికెట్‌ ఇస్తే ఖర్చుకు వెనకాడనంటూ బీజేపీ నాయకుడు డమామ్‌ సురేశ్‌ అధిష్ఠానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో చంద్రబాబును ఒప్పించి సీట్లు సర్దుబాటులో గూడూరు చైర్మన్‌ సీటును బీజేపీ తమ ఖాతాలో వేసుకుంది. సురేశ్‌ భార్యనే ఆపార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇక్కడ టీడీపీ బలంగా ఉండడంతో బీజేపీకి కేటాయించడానికి టీడీపీ శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. బీజేపీకి సహకారం అందిస్తారా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మూడు చోట్ల వైసీపీ అభ్యర్థులు ఖరారు

కర్నూలు మేయర్‌ వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మణిగాంఽధీ భార్య సుశీలమ్మను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఎమ్మిగనూరు చైర్మన్‌ వైసీపీ అభ్యర్థిగా మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రఘును బరిలోకి దింపడం కొసమెరుపు. గూడూరు చైర్మన్‌ అభ్యర్థిగా మాజీ జడ్పీటీసీ ఎల్‌.వెంకటేశ్వర్లు భార్య ఎల్‌.పద్మావతిని ఎంపిక చేశారు. ఆదోని చైర్మన్‌ వైసీపీ అభ్యర్థిగా ఆపార్టీ సీనియర్‌ నాయకుడు చంద్రకాంత్‌రెడ్డి విముఖత చూపడంతో అభ్యర్థి ఎంపికపై మల్లాగుల్లలు పడుతుంది.

Updated Date - Oct 17 , 2026 | 11:25 PM