కాసుల కోసం కక్కుర్తి
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:26 PM
నగరంలోని సి.క్యాంపు రైతుబజారులో కాసులకు కక్కుర్తి పడి అధికారులు చేపడుతున్న షాపుల నిర్మాణంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
షాపుల నిర్మాణంలో భారీ అవినీతి
ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండానే నిర్మాణాలు
లక్షలు స్వాహా చేసేందుకు పన్నాగం
పేరు ప్రభుత్వానిది.. నిధులు ప్రైవేటు వ్యక్తులవి..
నగరంలోని సి.క్యాంపు రైతుబజారులో కాసులకు కక్కుర్తి పడి అధికారులు చేపడుతున్న షాపుల నిర్మాణంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. షాపుల నిర్మాణంలో అధికారులు అధికార పార్టీ నాయకుల అనుచరులను బురిడీ కొట్టించి రూ.లక్షలు స్వాహాచేసి చేపట్టిన అక్రమాలు బట్టబయలయ్యాయి. తీగ లాగితే డొంకంతా కదిలింది. ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండానే స్థానికంగా ఉన్న మార్కెటింగ్, ఇంజనీరింగ్ శాఖాధికారులు అధికార పార్టీకి చెందిన అనుచరులతో రూ.లక్షలు ఖర్చు పెట్టించి షాపుల నిర్మాణం చేపట్టారు. వీటిని ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు ఉత్తుత్తి రికార్డులు సృష్టించిన వ్యవహారం జిల్లాలో పెద్ద దుమారాన్నే రేపింది.
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): సి..క్యాంపు రైతుబజారులో కొంత మంది వ్యక్తులు షాపులను ఏర్పాటుచేసుకునేందుకు అధికార పార్టీ నాయకులను ఆశ్రయించారు. వారి ఒత్తిడితో మార్కెటింగ్, ఇంజనీరింగ్ శాఖాధికారులు మూడు షాపులను ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో బాగంగా గత మే నెలలో సీఎం చంద్రబాబు కర్నూలు వచ్చిన సమయంలో కొన్ని పనులను చేపట్టారు. ఆ పనులకు ఖర్చు చేయగా.. మిగిలిన నిధులను ఈ షాపుల ఏర్పాటు కోసం వినియోగించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇదంతా కాగితాలకే పరిమితం చేశారు. అధినాయకులు సిఫారసు చేసిన వ్యక్తులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. షాపుల నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చును మీరే భరించాలని చెప్పడంతో ఆవ్యక్తులు తమకు షాపులు వస్తాయనే ఆశతో దాదాపు రూ.8లక్షల దాకా అప్పులుచేసి షాపుల కోసం ఖర్చు చేశారు. ఈ తతంగమంతా లోలోపనే జరిగింది. పైకి మాత్రం ఈ షాపులను ప్రభుత్వ నిధులతోనే ఖర్చు చేశామని మార్కెటింగ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు స్పష్టం చేస్తూ వచ్చారు.
నెలలు గడుస్తున్నా షాపులు అప్పగించకపోవడంతో..
షాపులను రూ.లక్షలు ఖర్చుచేసి ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు నెలలు గడుస్తున్నా ఆ షాపులను తమకు అప్పగించకపోవడంతో ఆందోళన చెందారు. తాము ఖర్చు చేసిన డబ్బులను వెనక్కయినా ఇవ్వాలని, లేకపోతే షాపులను అప్పగించాలని నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మరో వైపు అధికార పార్టీకి చెందిన మరికొంత మంది నేతలు ఈ షాపులను తమ అనుచరులకే కేటాయించాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించారు. దీంతో మార్కెటింగ్, ఇంజనీరింగ్ శాఖాధికారులకు ఎవరికీ షాపులు కేటాయించాలో దిక్కుతోచలేదు. షాపుల కేటాయింపు నిర్ణయాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కే వదిలివేస్తూ నివేదికను పంపారు. ఎవరికీ తెలియకుండా తమ అనుమతి లేకుం డా సి.క్యాంపు రైతుబజారులో షాపులు ఎలా కట్టారని మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయసునీత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ అధికార వర్గాలు తెలిపాయి.
ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కడపలో ఉన్న మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులును కమిషనర్ విజయసునీత ఆదేశించారు. ఈ మేరకు కడపలో ఉన్న జేడీ రామాంజనేయులు గత నెల సి.క్యాంపు రైతుబజార్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన షాపుల వ్యవహారంపై స్వయంగా విచారించారు. షాపులను నిర్మించేందుకు అప్పులు తెచ్చి రూ.లక్షలు ఖర్చు పెట్టుకున్న బాధితులు మార్కెటింగ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తమతో ఏవిధంగా డబ్బులను ఖర్చు చేయించారో నెలలు గడుస్తున్నా తమకు ఎందుకు కేటాయించడం లేదో అర్ధం కావడం లేదని ఫిర్యాదు చేశారు. మరోవైపు కర్నూలు మార్కెటింగ్ శాఖ ఇంజనీరింగ్ అధికారి రఘునాథరెడ్డి ప్రభుత్వ నిధులతోనే ఈ షాపులు నిర్మించామని, ప్రైవేటు వ్యక్తులు షాపుల నిర్మాణానికి ఖర్చు చేయలేదని ఈ సందర్భంగా వివరించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని..
సి.క్యాంపు రైతుబజారులో నిర్మించిన మూడు షాపుల వ్యవహారంలో పెద్ద స్కామే జరిగినట్లు తమ విచారణలో తేలింది. కొంతమంది వ్యక్తులతో డబ్బులు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చింది. బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ఈ షాపులను ప్రభుత్వ నిధులతోనే నిర్మించామని మార్కెటింగ్, ఇంజనీరింగ్ శాఖాధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. అవినీతి జరిగినట్లు తేలింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నివేదికను మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు పంపాం.
రామాంజనేయులు, జేడీ, మార్కెటిగ్ శాఖ