Share News

కరువు నేలకు జలధార..!

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:33 PM

కర్నూలు జిల్లాకు పశ్చిమ ప్రాంతం కరువు, వలసలకు చిరునామాగా మారింది. ఊళ్లో పనులు లేక.. పస్తులతో ఉండలేక రైతులు, వారినే నమ్ముకున్న కూలీలకు వలసలే దిక్కు అయ్యాయి.

కరువు నేలకు జలధార..!
పత్తికొండ జలాశయం

హంద్రీ నీవా నుంచి పైపుల ద్వారా 27,500 ఎకరాలకు సాగునీరు

డ్రిప్‌, మైక్రో ఇరిగేషన్‌తో నీటి వృథాకు చెక్‌

ఆటోమేషన్‌, ఐఓటీ, సెన్సార్లతో పర్యవేక్షణ

పత్తికొండ ఇంటిగ్రేటెడ్‌ పైప్డ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రూపకల్పన

సీఎం చంద్రబాబు సానుకూలత

రూ.745 కోట్లు ఇస్తే కరువు, వలసలకు అడ్డుకట్ట

కర్నూలు జిల్లాకు పశ్చిమ ప్రాంతం కరువు, వలసలకు చిరునామాగా మారింది. ఊళ్లో పనులు లేక.. పస్తులతో ఉండలేక రైతులు, వారినే నమ్ముకున్న కూలీలకు వలసలే దిక్కు అయ్యాయి. సీమ జిల్లాలకు సాగునీరు అందించే హంద్రీనీవా ప్రధాన కాలువ ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తున్నా.. కరువు నేలకు సాగు జలాలు అందని ధైన్యపరిస్థితి ఉంది. అత్యల్ప నీటి నిల్వలు కలిగిన జిల్లాగా కర్నూలు మొదటి స్థానంలో నిలిచింది. సాగునీరు ఇస్తే హరిత బంగారం పండించే శక్తి ఇక్కడి రైతులకు ఉంది. అదే జరిగితే కరువు, వలసలకు చెక్‌ పెట్టవచ్చనే లక్ష్యంగా ఇంజనీర్లు ‘పత్తికొండ ఇంటిగ్రేటెడ్‌ పైప్డ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు’కు రూపకల్పన చేశారు. హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని ఎత్తిపోసి 27,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆశయంగా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఆధునిక ఆటోమేషన్‌, ఐఓటీ, సెన్సార్‌ సాంకేతికను వినియోగిస్తూ.. నీటిని అవసరమైన మేరకు.. అవసరమైన ప్రాంతాలకు మళ్లిస్తారు. డ్రిప్‌, మైక్రో ఇరిగేషన్‌కు అనుసంధానం చేస్తారు. పత్తికొండ ప్రాంతంలో 16 గ్రామాల్లో కరువుతీరా సాగుజలాలు అందించే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలంటే ప్రభుత్వం రూ.745 కోట్లు మంజూరు చేయాలి. సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రాజెక్టుపై సానుకూలత వ్యక్తం చేశారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో పత్తికొండ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలకు పైగా ఉంటుంది. పత్తి, టమోటా, వేరుశనగ వంటి పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. 85-90 శాతం వర్షం పైనే ఆధారపడక తప్పడం లేదు. రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలు తీసుకెళ్లే హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ ఈ నియోజకవర్గం మధ్యలో ప్రవహిస్తుంది. భూమట్టానికి దాదాపు 25అడుగుల లోతులో నీటి ప్రవాహం ఉండడంతో చెరువులు కూడా నింపుకోలేని పరిస్థితి. హంద్రీ నీవా నీటిని సద్వినియోగం చేసుకుని మెట్ట భూములకు మళ్లించాలి.. తద్వారా రైతుల కంట కన్నీరు తుడవాలి, కరువు, వలసలు నివారిం తచాలనే లక్ష్యంగా నీటి పథకానికి రూపకల్పన చేయాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా హంద్రీనీవా ప్రాజెక్టు డివిజన్‌-4 ఈఈ కిష్టన్న ‘పత్తికొండ ఇంటిగ్రేటెడ్‌ పైప్డ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు’కు డిజైన్‌ చేశారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, దేవనకొండ మండలాల పరిధిలో 16 గ్రామాల్లో 27,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా మూడు జోన్లుగా విభజించారు. కార్యరూపం దాల్చాలంటే ప్రభుత్వం రూ.745 కోట్లు నిధులు, పరిపాలన అనుమతులు ఇవ్వాలి. త్వరలోనే జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సమా చారం. నీటి వృథాను వంద శాతం నిరోధించి ప్రతి నీటి బొట్టును మొక్కకు అందించేలా ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేస్తున్నారు. కరువుకు నిలయమైన పత్తికొండ ప్రాంతంలో సాగునీటి లభ్యతను పెంచడం, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. కాలువల్లో నీటిని తీసుకెళ్తే నీరు సీపేజీ, ఆవిరి, లీకేజీల రూపంలో వృథా అవుతుంది. నీటి వృథాను అరికట్టేందుకు పైపుపైప్‌ ద్వారా నీటిని నేరుగా పొలానికి.. అక్కడి నుంచి డ్రిప్‌ ద్వారా మొక్కకు అందించే నూతన వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు.

లబ్ధిపొందే గ్రామాలు

ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ మండలాల పరిధిలోని చందోలి, చక్రాల, పత్తికొండ, రాతన, కొత్తూరు, రామచంద్రాపురం, హోసూరు, తుగ్గలి, పెండ్లిమాన్‌ తండా, ఒంటిగుడిసె తండా, గుండుతండా, బుగ్గతండా, కురువలదొడ్డి, బురుజుల, ముక్కెళ్ల, ఎద్దులదొడ్డి, పుచ్చకాయలమడ గ్రామాల్లో 27,500 ఎకరాలకు సాగునీరు అందనుంది.

ప్రయోజనాలు ఎన్నో

మూడు జోన్లు.. అంటే పత్తికొండ (పందికోన) జలాశయం వద్ద పంప్‌హౌస్‌ నిర్మించి అక్కడి నుంచి జోన్‌-1 పరిధిలో 8,634.60 ఎకరాలకు, హంద్రీనీవా కాలువ 120.030 కిలోమీటర్లు వద్ద మరో పంప్‌హౌస్‌ నిర్మించి అక్కడి నుంచి జోన్‌-2 పరిధిలో 8,555.30 ఎకరాలు, జోన్‌-3 పరిధిలో 10,310.10 ఎకరాలు కలిపి 27,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యం.

ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా నీటి పంపిణీకి ప్రత్యేక విధానం అమలు చేస్తారు. పంప్‌హౌస్‌ నుంచి ప్రధాన పైపుల ద్వారా నీటిని 500 ఎకరాల బ్లాక్‌కు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి 100 ఎకరాల అవుట్‌ లెట్‌, అనంతరం నాలుగు ఎకరాల సబ్‌ అవుట్‌లెట్‌కు సరఫరా చేస్తారు.

హెచ్‌డీపీఈ, పీవీపీ పైపుల నెట్‌వర్క్‌ ద్వారా చివరి అవుట్‌లెట్‌ వరకు నీరు చేరుతుంది. ప్రతి దశలో నీటి సరఫరాను ఆటోమేషన్‌ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తారు.

ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం నీటి ఒత్తిడి. వంద ఎకరాల అవుట్‌లెట్‌ వద్ద దాదాపు 35 మీటర్ల హెడ్‌, నాలుగు ఎకరాల అవుట్‌లెట్‌ వద్ద 25 మీటర్ల హెడ్‌ ఉండేలా వ్యవస్థను రూపొందించనున్నారు.

ఈ విధానం వల్ల రైతులు పొలాలకు నేరుగా డ్రిప్‌, తుంపర సేద్యం.. వంటి మైక్రో ఇరిగేషన్‌ వ్యవస్థకు పైప్‌లైన్‌ అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. దీని వల్ల రైతుకు విద్యుత్‌ రూపంలో అదనపు భారం తగ్గుతుంది.

సెన్సార్లు నీటి నియంత్రణ వ్యవస్థలు కీలకంగా పని చేయడం వల్ల ఎక్కడ ఎంత నీరు అవసరమో అంత మేరకు విడుదల చేస్తారు. ఆటోమేషన్‌ సాంకేతిక ద్వారా 24 గంటలు నీటిని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

సాధారణంగా ఒక టీఎంసీ నీటితో పది వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్‌ చేస్తారు. ఈ విధానం వల్ల 20 వేల ఎకరాలకు అందించవచ్చు.

ప్రాజెక్టు స్వరూపం ఇలా

నీటి లభ్యత : హంద్రీనీవా ప్రధాన కాలువ

జోన్లు : 3

పంప్‌ హౌస్‌లు : 2

ఆయకట్టు : 27,500 ఎకరాలు

లబ్ధి పొందే పల్లెలు : 16

మండలాలు : 4

నీటి ఆదా : వంద శాతం

అంచనా వ్యయం : రూ.745 కోట్లు

Updated Date - Oct 06 , 2026 | 11:33 PM