Share News

పదేళ్ల సమస్యకు పరిష్కారం

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:34 AM

పదేళ్లుగా బీడుగా మారిన భూములకు ఎట్టకేలకు విముక్తి లభించింది

పదేళ్ల సమస్యకు పరిష్కారం
పదేళ్లుగా బీడుగా మారిన భూములకు ఎట్టకేలకు విముక్తి లభించింది

250 ఎకరాల భూములకు విముక్తి

లీకేజీలతో బీడుగా మారిన భూములు

పనుల ప్రారంభంతో రైతుల హర్షం

పాణ్యం, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : పదేళ్లుగా బీడుగా మారిన భూములకు ఎట్టకేలకు విముక్తి లభించింది. చెరువు లీకేజీలతో నిత్యం నీటి కుంటగా మారిన పంట భూముల్లోని నీటిని తొలగించే కార్యక్రమాన్ని అధికారులు శనివారం చేపట్టడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పాణ్యం ఊరిముందరి చెరువు అలుగుకు లీకేజీలు ఏర్పడి చెరువు ఆయకట్టు కింద దాదాపు 250 ఎకరాల సాగు భూములు నీటితోనిండి పంటసాగుకు అనుకూలంగా లేకుండా పోయాయి. దీంతో 80 మంది రైతులు తమ భూములను నిరుపయో గంగా ఉంచాల్సి వచ్చింది. చెరువు అలుగు నీరు కిందికి వెళ్లే కాల్వ పూడిపోవడంతో నీరు పంట భూముల్లో చేరి జంబు పొదలు పెరిగి పంటసాగుకు అనుకూలంగా లేకుండా పోయింది. పదేళ్లుగా కలెక్టరు, చిన్ననీటిపారుదల శాఖ అధికారులకు వినతిపత్రాలు అందిస్తూనే ఉన్నారు. ఏటా రైతుల వినతుల మేరకు ప్రతిపాదనలు పంపడం నిధులు మంజూరు కాకపోవడంతో కాలం పదేళ్ళకు చేరింది. దీంతో రైతులు పంటల సాగుపై ఆశను వదిలేసుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే గౌరు చరిత దృష్టికి తమసమస్యను తీసుకువెళ్లడంతో ఆమె స్పందించి వెంటనే కాల్వ పూడిక తీయాలని కలెక్టరును కోరారు. ఎమ్మెల్యే కోర్కె మేరకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఒకటిన్నర కిలోమీటరు వరకు పూడిక తీయాల్సిఉండగా ప్రస్తుతం కిలోమీటరు వరకు పూడికతీసి అలుగు నీరు కాల్వలో వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు సాగునీటి సంఘం అధ్యక్షుడు వెంకటేశమయ్య తెలిపారు. మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి సాగుకు అనునకూలంగా మారుస్తామని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్యే గౌరు చరితకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రంగరమేష్‌, సాగునీటి సంఘం సభ్యులు ట్రాక్టరు పుల్లారెడ్డి, పెద్దన్న, శ్రీనివాసులు, వెంకటరమణ, శేఖర్‌, రమణమూర్తి, లక్ష్మిరెడ్డి, సురేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:37 AM